పాడేరు ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్‌పై దాడి

ABN , First Publish Date - 2020-12-04T06:09:23+05:30 IST

విధి నిర్వహణలో ఉన్న డాక్టర్‌పై దౌర్జన్యం చేసి, తీవ్రంగా గాయపరిచిన వ్యక్తిని అరెస్టు చేసేంత వరకు విధులకు హాజరయ్యేది లేదంటూ స్థానిక జిల్లా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది గురువారం ఉదయం విధులు బహిష్కరించి, ఆందోళన చేపట్టారు.

పాడేరు ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్‌పై దాడి
ఆస్పత్రి వద్ద ఆందోళన చేస్తున్న వైద్యులు, సిబ్బంది.


తీవ్రంగా కొట్టిన మృతుడి బంధువు

విధులు బహిష్కరించి ఆందోళనకు దిగిన వైద్యులు, సిబ్బంది

నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్‌

పోలీసు అధికారుల హామీతో విరమణ


పాడేరురూరల్‌, డిసెంబరు 3: విధి నిర్వహణలో ఉన్న డాక్టర్‌పై దౌర్జన్యం చేసి, తీవ్రంగా గాయపరిచిన వ్యక్తిని అరెస్టు చేసేంత వరకు విధులకు హాజరయ్యేది లేదంటూ స్థానిక జిల్లా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది గురువారం ఉదయం విధులు బహిష్కరించి, ఆందోళన చేపట్టారు.  విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. డాక్టర్‌పై దాడిచేసిన వ్యక్తిని అరెస్టు చేస్తామని, ఆస్పత్రిలో నలుగురు పోలీసులను నియమిస్తామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన ఆందోళనకారులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి విధులకు హాజరయ్యారు. దీనికి సంబంధించి ఆస్పత్రి వర్గాలు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి.

జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ వరిగెలపాలెం గ్రామానికి చెందిన రామన్న అనే వ్యక్తికి రక్తంతో కూడిన వాంతులు అవుతుండంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కృష్ణారావు రోగిని పరిశీలించి వైద్య సేవలు అందించారు. అయినప్పటికీ పరిస్థితి విషమంగానే వుందని కుటుంబ సభ్యులకు చెప్పారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో రామన్న మృతి చెందాడు. దీంతో అతని అల్లుడు, జి.మాడుగుల మండలం కొత్తపల్లికి చెందిన కొండపల్లి రాంబాబు(కొక్కిరాపల్లి పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు) విధి నిర్వహణలో వున్న డాక్టర్‌ అజయ్‌పై దాడి చేసి,  ఎడమకంటిపై కొట్టాడు. వైద్యసిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్‌ వచ్చి, రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. కాగా డ్యూటీలో వున్న డాక్టర్‌పై దాడి చేసినందుకు నిరసగా వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది గురువారం విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించి ఎవరైనా మృతిచెందితే.... వారి బంధువులు వైద్య సిబ్బందిపై దాడి చేయడం అలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా వైద్యులు, సిబ్బంది ఆందోళన చేస్తున్నట్టు తెలుసుకున్న సీఐ పి.పైడపునాయుడు, ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్‌ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యుడిపై దాడిచేసిన వ్యక్తిని అరెస్టు చేసి, సస్పెండ్‌ చేయిస్తామని, ఆస్పత్రిలో నలుగురు పోలీసులను నియమిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.


Updated Date - 2020-12-04T06:09:23+05:30 IST