కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని వైద్యుల సంఘానికి ఢిల్లీ హైకోర్టు హితవు

ABN , First Publish Date - 2021-06-04T00:01:53+05:30 IST

యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు ఢిల్లీ హైకోర్టు గురువారం

కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని వైద్యుల సంఘానికి ఢిల్లీ హైకోర్టు హితవు

న్యూఢిల్లీ : యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు ఢిల్లీ హైకోర్టు గురువారం నోటీసులిచ్చింది. అల్లోపతి మందులకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడినట్లు ఆరోపిస్తూ ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు ఈ చర్య తీసుకుంది. అపరాధ స్వభావంగల అంశాలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రచురించకుండా రామ్‌దేవ్‌ను నిరోధించాలని ఈ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. 


ఈ వ్యాజ్యంపై వాదనల సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ, వైద్యులు ఈ మహమ్మారిని నయం చేయడానికి సమయాన్ని వినియోగించాలని, కోర్టు సమయాన్ని వృథా చేయకూడదని తెలిపింది. దీనిపై డీఎంఏ (ఢిల్లీ మెడికల్ అసోసియేషన్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రామ్‌దేవ్ బాబా వ్యాఖ్యలు డీఎంఏ సభ్యులపై ప్రభావం చూపుతున్నట్లు తెలిపింది. ఆయన డాక్టర్లను దూషిస్తున్నారని తెలిపింది. అల్లోపతి బూటకమని ఆయన విమర్శిస్తున్నారని పేర్కొంది. రామ్‌దేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్ కంపెనీలో తయారు చేసిన కొరొనిల్‌ను కోవిడ్‌ను నయం చేసే మందుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలా చేయవద్దని ప్రభుత్వం ఆయనను ఆదేశించిందని తెలిపింది. అనంతరం కొరొనిల్‌ను ఇమ్యూనిటీ బూస్టర్‌గా చెప్పుకుంటూ, ఇప్పటికే రూ.250 కోట్లు సంపాదించారని పేర్కొంది. 


దీనిపై హైకోర్టు స్పందిస్తూ, ‘‘రేపు, హోమియోపతి బూటకమని నాకు అనిపించవచ్చు. అది ఓ అభిప్రాయం. దాని మీద వ్యాజ్యం ఎలా వేస్తారు? ఒకవేళ ఆయన తప్పుగా మాట్లాడారని, తప్పుదోవ పట్టించారని అనుకున్నప్పటికీ, ప్రజా ప్రయోజనాల కోసం ఈ విధంగా వ్యాజ్యం వేయకూడదు. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) రూపంలో దాఖలు చేయాలి’’ అని తెలిపింది. 


నిబంధనలను పతంజలి ఉల్లంఘించినట్లయితే, దానిపై చర్య తీసుకోవలసినది ప్రభుత్వమని హైకోర్టు తెలిపింది. ‘‘మీరెందుకు దివిటీ పట్టుకుంటున్నారు. ఇది వ్యాజ్యం రూపంలో ఉన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం. మీరు పిల్ వేయడం మంచిది. ఆయన దీనిని ఔషధం అన్నారు, ఆ తర్వాత ఇమ్యూనిటీ బూస్టర్‌గా మార్చారు, ఈ మధ్య కాలంలో లక్షలాది మంది కొన్నారని పిల్ వేయడం మంచిది’’ అని హైకోర్టు పేర్కొంది. 


రామ్‌దేవ్ ప్రసంగాల వీడియో క్లిప్‌లను ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించింది. వెబ్‌లింకులపై ఎందుకు ఆధారపడ్డారని ప్రశ్నించింది. రామ్‌దేవ్‌కు అల్లోపతి మీద నమ్మకం లేకపోవచ్చునని, ఆయన యోగా, ఆయుర్వేదం ద్వారానే అన్ని రోగాలు నయమవుతాయని నమ్మవచ్చునని తెలిపింది. అయితే ఆయన నమ్మకం తప్పో, ఒప్పో కావచ్చునని, కొరొనిల్ ఔషధమో, కాదో కోర్టు చెప్పజాలదని వివరించింది. ఆయన ‘స్టుపిడ్ సైన్స్’ అని అన్న మాటలు కాకపుట్టించేవి కావచ్చునని, అయితే వ్యాజ్యం దాఖలు చేయడానికి తగిన కారణంగా నిలబడవని తెలిపింది. 


రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని రామ్‌దేవ్ బాబాకు చెప్పాలని ఆయన తరపు న్యాయవాదికి హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ జూలై 13న జరుగుతుంది.


రామ్‌దేవ్‌ బాబా వీడియో గత నెలలో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయిందని, అల్లోపతి మందుల వల్ల లక్షలాది మంది మరణించారని ఆయన అంటున్నట్లు ఈ వీడియోలో వినిపించిందని వైద్య సంఘాలు ఆరోపిస్తున్నాయి. సరైన చికిత్స, ఆక్సిజన్ లేకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని,  అల్లోపతి స్టుపిడ్, దివాలాకోరు సైన్స్ అని అన్నారని పేర్కొన్నాయి. 


Updated Date - 2021-06-04T00:01:53+05:30 IST