పర్యాటకంపై పట్టింపేదీ?

ABN , First Publish Date - 2022-07-25T06:46:48+05:30 IST

జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వానికి పట్టింపు కరువైంది. ప్రాజెక్టులు, జలపాతాలపై సర్కారు చిన్నచూపు చూస్తోంది. జిల్లా వ్యాప్తంగా అద్భుతమైన జలపాతాలు, ప్రాజెక్టులు, చెరువులు ఉన్నా.. వాటిని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయకపోవడంతో జలాశయాల సందర్శనకు వస్తున్న పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన వసతి లేకపోవడం వల్ల సందర్శనకు వెనకడుగు వేస్తున్నారు.

పర్యాటకంపై పట్టింపేదీ?

జిల్లాలో అభివృద్ధికి నోచుకోని ప్రాజెక్టులు, జలపాతాలు 

ఏళ్లతరబడి ప్రతిపాదనలకే పరిమితం

అరకొర నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం

పర్యాటక ప్రాంతాలను పట్టించుకోవాలంటున్న సందర్శకులు

నిజామాబాద్‌, జూలై 24(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వానికి పట్టింపు కరువైంది. ప్రాజెక్టులు, జలపాతాలపై సర్కారు చిన్నచూపు చూస్తోంది. జిల్లా వ్యాప్తంగా అద్భుతమైన జలపాతాలు, ప్రాజెక్టులు, చెరువులు ఉన్నా.. వాటిని పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయకపోవడంతో జలాశయాల సందర్శనకు వస్తున్న పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన వసతి లేకపోవడం వల్ల సందర్శనకు వెనకడుగు వేస్తున్నారు. రోడ్డు, భద్రత సౌకర్యాలు లేక పోవడంతో ఆసక్తి చూపడం లేదు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా అనుమతులకు నోచుకోవడం లేదు. అభివృద్ధికి నిధులు విడుదల కావడంలేదు. వర్షాకాలంలో చెరువులు, ప్రాజెక్టులు నిండి నిండుకుండలా మారి మత్తడులు పోస్తున్నా సందర్శకులను రంపించలేకపోతున్నాయి.

     ఫ సెలవుల్లో సందర్శకుల తాకిడి

జిల్లాలో శ్రీరామసాగర్‌, అలీసాగర్‌, రామడుగు ప్రాజెక్టులతోపాటు సిర్నాపల్లి, మంచిప్ప వంటి చెరువులు ఉన్నాయి. పెద్దవాగు, కప్పలవాగుపై ఉన్న చెక్‌డ్యాంలు, గోదావరి ఆనుకుని ఉన్న సావెల్‌, తడ్‌పాకల్‌, దోంచంద వంటి ప్రాంతాలున్నాయి. ఇవేకాకుండా జిల్లాలో నిజాంకాలంలో నిర్మించిన చెరువులు ఉన్నాయి. అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న చిన్న జలపాతాలు ఉండడం వల్ల వర్షాకాలంలో వరదలు వస్తుండడంతో ఎక్కువమంది సందర్శకులు సెలవు రోజుల్లో ఈ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. 

     ఫ రూ.30 కోట్లతో ప్రతిపాదనలు

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు  నిర్మాణం పూర్తి చేసి 1983లో జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టు వద్ద ఎలాంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయలేదు. ఉమ్మడి రాష్ట్ర హయాంలో ప్రాజెక్టు కింది భాగంలో ఒక పార్కు నిర్మాణం చేసి బోటింగ్‌ కొంత ప్రయత్నాలు చేసినా ఆ తర్వాత ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల అభివృద్ధికి నోచుకోలేదు. ఈ ప్రాజెక్టు వద్ద బోటింగ్‌ పాయింట్‌తో పాటు పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఉన్నట్లు పలుమార్లు జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదికలు పంపింది. పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరింది. సుమారు 30కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తే ప్రతి సంవత్సరం వచ్చే పర్యాటకులకు ఉపయోగపడడంతో పాటు స్థానికులకు ఉపాధి దొరుకుతుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. బోటింగ్‌తో పాటు రిసార్ట్‌లను ఏర్పాటు చేస్తే ఉపయోగపడుతుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. భారీ నీటి పారుదల ప్రాజెక్టు కావడంతో ఇరిగేషన్‌ అధికారులు కొన్ని అభ్యంతరాలు చెప్పినా కొంతమేర బోటింగ్‌కు అనుమతులు ఇవ్వవచ్చని నివేదికలో పేర్కొన్నారు. ప్రాజెక్టు కిందిభాగంలో పార్కులతో పాటు రిసార్ట్‌లను ఏర్పాటు చేస్తే ఉపయోగపడుతుందని నివేదికలు ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ప్రాజెక్టు నిండిన ప్రతిసారి వేలమంది పర్యాటకులు వస్తున్నారు. ప్రాజెక్టుపైకి వచ్చి వరద, నీటిని పరిశీలించి వెళ్తున్నారు. ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల నిరాశతో వెళ్లిపోతున్నారు. 

     ఫ ‘అలీసాగర్‌’ది అదే పరిస్థితి

జిల్లాలో అలీసాగర్‌ ప్రాజెక్టు వద్ద కూడా అదే పరిస్థితి ఉంది. రూర్బన్‌ పథకం కింద కొన్ని నిధులు వెచ్చించి కొంతమేర పనులు చేసినా ఇబ్బందులు తప్పడం లేదు. పర్యాటక శాఖ ద్వారా కొన్ని గెస్ట్‌హౌజ్‌ల నిర్మాణం చేసినా అందుబాటులోకి రాలేదు. బోటింగ్‌, పార్కు మెంటనెన్స్‌ సక్రమంగా లేకపోవడం వల్ల అక్కడికి వచ్చే సందర్శకులకు సమస్యలు ఎదురవుతున్నాయి. రూర్బర్‌ కింద నిధులు విడుదలైన ఇంకా పనులు పూర్తికాలేదు. నగరానికి దగ్గరగా ఉన్న అలీసాగర్‌ను అభివృద్ధి చేస్తే పర్యాటకులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. జానకంపేట్‌ దగ్గరగా ఉన్న అశోక్‌సాగర్‌ పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. పార్కు, బోటింగ్‌ అనుకూలంగా లేకపోవడం వల్ల ఉపయోగంలేకుండా ఉంది. ధర్పల్లి మండలంలో ఉన్న రామడుగు ప్రాజెక్టు వద్దకు సందర్శకులు వస్తున్న సౌకర్యాలు లేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న రామడుగు వద్ద పర్యాటకానికి అనుకూలమైన ఏర్పాట్లు చేస్తే వచ్చే వారికి ఉపగయోగపడే అవకాశం ఉంది. నిజాంకాలంలో నిర్మాణం అయిన సిర్నాపల్లి చెరువును చూసేందుకు ఎక్కువమంది వస్తారు. చెరువు నిండి మత్తడులు పడే సమయంలో నెల రోజుల పాటు ఈ పర్యాటకుల రాక ఎక్కువగా ఉంటుంది. చెరువు వద్దకు వెళ్లేందుకు సరైన రోడ్డు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువు వరకు రహదారి నిర్మించి అక్కడ కొంతమేర నిర్మాణాలు చేపడితే ప్రతి సంవత్సరం వచ్చేవారికి ఉపయోగపడనుంది. మంచిప్ప రిజర్వాయర్‌ వద్ద కూడా ఎక్కువమంది నిండిన సమయంలో చూసేందుకు సందర్శకులు వస్తున్నారు. నగరంలోని వారితో పాటు గాంఽధారి రోడ్‌గుండా వెళ్లేవారు ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తున్నారు. ఈ చెరువు రిజర్వాయర్‌గా మారుతుండడంతో భవిష్యత్‌ పర్యాటకాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేస్తే జిల్లావాసులకు ఉపయోగపడనుంది. 

కమ్మర్‌పల్లి మండలంలోని రాళ్లవాగు వర్షాకాలంలో రెండు నెలల పాటు సందర్శకులు వస్తారు. వాగు పొంగి జలపాతంగా పడుతుండడంతో ఎక్కువమంది సెలవు రోజుల్లో వస్తున్నారు. జిల్లా వాసులతో పాటు జగిత్యాల జిల్లావాసులు ఎక్కువగా ఈ రాళ్లవాగు సందర్శనకు వస్తుండడంతో రద్దీ పెరుగుతోంది. జిల్లాలోని వీటితో పాటు ఇతర వాగులపై ఉన్న చెక్‌డ్యామ్‌ల వెంట కొన్ని ఏర్పాట్లు చేస్తే పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధిచెందే అవకాశం ఉంది. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులను విడుదల చేస్తే జిల్లావాసులకు మేలు జరగనుంది. పర్యాటక కేంద్రాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జిల్లా అధికారులు మాత్రం ఈ ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఇంకా నిధులు విడుదల కాకపోవడం వల్ల పనులు చేపట్టడంలేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికీ అలీసాగర్‌ వద్ద కొన్ని పనులు చేస్తున్నామని వారు తెలిపారు.

Updated Date - 2022-07-25T06:46:48+05:30 IST