ఆందోళన వద్దు.. సానుకూల దృక్పథమే ముద్దు..

ABN , First Publish Date - 2020-04-02T16:53:54+05:30 IST

కరోనా వైరస్‌ బారినపడి కొంతమంది మృత్యువాతపడుతుండగా..

ఆందోళన వద్దు.. సానుకూల దృక్పథమే ముద్దు..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలువురిలో మానసిక ఒత్తిడి

వైరస్‌ సోకితే ఏమవుతుందోననే భయం

భవిష్యత్తుపై బెంగతో యాంగ్జైటీ

రోజుల తరబడి ఇంట్లో ఉండడం,రోజువారీ కార్యకలాపాలకు దూరం కావడం వల్లనే కొంతమందిలో ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్న వైద్యులు

అందరితో కలివిడిగా ఉండడం ద్వారా సమస్యకు చెక్‌


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): కరోనా వైరస్‌ బారినపడి కొంతమంది మృత్యువాతపడుతుండగా, ఈ మహమ్మారి ఏం చేస్తుందోనన్న భయం మరికొన్ని మరణాలకు కారణం అవుతోంది. కరోనా వల్ల ఉత్పన్నమయ్యే ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక జర్మనీలోని హెస్సీ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్‌ షాఫెర్‌ (54) ఆత్మహత్య చేసుకోవడం యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. లాక్‌డౌన్‌ వల్ల రోజుల తరబడి ఇళ్లలో వుండడంతో కొంతమంది పరిపరి విధాలుగా ఆలోచిస్తూ మానసిక వేదనకు గురవుతున్నారని, భవిష్యత్తుపై బెంగ, వైరస్‌ బారినపడితే ఏమైపోతామోననే భయం, ఆర్థిక ఇబ్బందులు వంటివి ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. 


యాంగ్జైటీ డిజార్డరే కారణం

లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లకే పరిమితం కావడం, రోజువారీ కార్యకలాపాలకు దూరంగా వుండడం వల్ల కొంతమంది మానసిక ఆందోళనకు గురవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. దీనినే యాంగ్జైటీ డిజార్డర్‌ (ఏం జరుగుతుందో తెలియకపోవడం వల్ల వచ్చే ఆందోళన) అంటారని నిపుణులు చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో జరిగే ప్రచారం, ఇతర దేశాల్లో భారీగా చోటుచేసుకుంటున్న మరణాలు వంటివి వీరిని భయాందోళనకు గురిచేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు. 


ఈ జాగ్రత్తలు అవసరం

ఇంట్లో వున్న ఇతరులతో కలివిడిగా ఉండాలి. ఇతర ప్రాంతాల్లో వున్నవారితో ఫోన్‌ మాట్లాడడం, సానుకూల దృక్పథంతో వ్యవహరించడం, మంచి నిద్ర, వ్యాయామం, పోషకాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్‌ చెప్పవచ్చు.

 

ఇవీ లక్షణాలు

ప్రస్తుత పరిస్థితులను టీవీలు, సామాజిక మాధ్యమాల్లో చూసి ఏదో జరిగిపోతుందని భయపడుతుండే వారిలో ప్రధానంగా కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. గుండె దడ, విపరీతమైన ఆందోళన, చేతులు వణకడం, రెస్ట్‌లెస్‌గా కనిపించడం, అటుఇటూ తిరుగుతుండడం, నిద్రపట్టకపోవడం, నెగిటివ్‌ ఆలోచనలు, భవిష్యత్తుపై ఆశ కోల్పోవడం...వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటి కారణంగా గతంలో స్ర్కిజోఫీనియా, బైపోలార్‌ డిజార్డర్‌, డిప్రెషన్‌, ఓసీడీ, ఫిట్స్‌ వంటి సమస్యలు వున్నట్టయితే మళ్లీ తిరగబెట్టే అవకాశముంది. 


పాజిటివ్‌ థింకింగ్‌ అవసరం: డాక్టర్‌ ఎస్‌.రాధారాణి, ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌

క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు, జీవితంలో ఎప్పుడూ చూడని ఘటనలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కొంతమంది తీవ్రమైన భయాందోళన చెందుతుంటారు. దీన్నే యాంగ్జైటీ, అప్రెహెన్షన్‌ అని కూడా అంటారు. వీటి బారిన పడినవారు తీవ్రమైన ఇబ్బందులు పడుతుంటారు. భవిష్యత్తుపై భయందోళన చెందుతుంటారు. సివియర్‌ యాంగ్జైటీగా రూపాంతరం చెందితే ఆత్మహత్యలు చేసుకో వాలన్న ఆలోచన చేస్తారు. వీరిలో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా వీరిని గుర్తించేందుకు అవకాశముంది. అందరితో కలిసి వుండేలా చేయడం ద్వారా ఈ సమస్యకు చెక్‌ చెప్పవచ్చు.

Updated Date - 2020-04-02T16:53:54+05:30 IST