Abn logo
Oct 13 2021 @ 00:03AM

పల్లెకు పోలేం!

బీబీనగర్‌ మండలం ముగ్దుంపల్లి సబ్‌సెంటర్‌

పల్లెదవాఖానా ఉద్యోగాలపై విముఖత 

47 వైద్యుల పోస్టుల భర్తీకి .. వచ్చినవి 22 దరఖాస్తులు మాత్రమే

భువనగిరిటౌన్‌, అక్టోబరు 12: పల్లె దవాఖానాల్లో (సబ్‌సెంటర్లు) ఉద్యోగం చేసేందుకు వైద్యులు విముఖత చూపుతున్నారు. జిల్లాలో 47 పల్లెదవాఖానాల్లో  కాంట్రాక్ట్‌ పద్ధతిన వైద్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే ఆ గడువు మంగళవారంతో ముగియగా, దరఖాస్తులు 22 మాత్రమే వచ్చాయి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టులకంటే 25 దరఖాస్తులు తక్కువగా రావడం పల్లెల్లో విధులు నిర్వహించడానికి వైద్యులు చూపుతున్న విముఖతకు నిదర్శనంగా తెలుస్తోంది. అయితే రూ.40వేల వేతనానికి భద్రతలేని ఉద్యోగంలో చేరలేమని, రూ.లక్షలు పోసి చదువుకున్న తాము మరింత ఆర్థిక ఇబ్బందులకు గురికాలేమని వైద్యులు పేర్కొంటున్నారు. అలాగే అసౌకర్యాల నడుమ పల్లె దవాఖానాల్లో విధులు నిర్వహిస్తే, వారి తదుపరి లక్ష్యం పీజీ, సూపర్‌ స్పెషాలిటీ  కోర్సులకు దూరమమ్యే ప్రమాదం ఉంటుందని, వైద్యచికిత్సల్లో మెలకువలు, పట్టు సాధించలేరని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా వచ్చిన 22 దరఖాస్తులు పరిశీలించి పోస్టులను భర్తీ చేస్తామని అధికారులు పేర్కొంటుండగా, విధుల్లో చేరేందుకు మరికొంత మంది కూడా విముఖత చూపే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు చెబుతుండడం గమనార్హం.  


జిల్లాలో 137 సబ్‌సెంటర్లు 

జిల్లాలో 137 సబ్‌ సెంటర్లు ఉండగా, గత ఏడాది 18పోస్టులు భర్తీకాగా తాజాగా 42 పోస్టులకు జారీచేసిన నోటిఫికేషన్‌ ఆధారంగా 22దరఖాస్తులు రాగా మిగతా పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు వైద్యసేవలకోసం సమీపంలోని పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, భువనగిరిలోని జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.


అర్హులతో భర్తీ చేస్తాం: సాంబశివరావు, డీఎంహెచ్‌వో 

వైద్యులు పోస్టులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులతో భర్తీ చేస్తాం. దరఖాస్తులు రాని పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్‌ జారీ చేస్తాం.