డబుల్‌.. ట్రబుల్‌

ABN , First Publish Date - 2022-01-17T06:22:13+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పథకం జిల్లాలో అడుగడునా అడ్డంకులతో నత్తనడకన సాగుతోంది. ఏళ్లు గడస్తున్నా నిర్మాణాలు పూర్తి కావడం లేదు. పూర్తయిన ఇళ్ల కోసం లబ్ధిదారులకు ఎదురు చూస్తున్నారు.

డబుల్‌.. ట్రబుల్‌
కోరుట్లపేటలో పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

-  ఇళ్ల కోసం ఎదురుచూపులు 

- నత్తనడకన పనులు 

- కాంట్రాక్టర్‌లకు బకాయిలు  

- జిల్లాలో 6,886 ఇళ్లు మంజూరు

 - 3,305 పూర్తి

- పంపిణీ చేసింది 369  

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పథకం జిల్లాలో అడుగడునా అడ్డంకులతో నత్తనడకన సాగుతోంది.  ఏళ్లు  గడస్తున్నా నిర్మాణాలు పూర్తి కావడం లేదు. పూర్తయిన ఇళ్ల కోసం లబ్ధిదారులకు ఎదురు చూస్తున్నారు.  కొన్ని చోట్ల ఇంటి నిర్మాణాలు, స్థలం సమస్య. మరికొన్ని చోట్ల కాంట్రాక్ట్‌ల బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు డబుల్‌ ఇళ్ల నిర్మాణాలకు స్టీల్‌, సిమెంట్‌, కూలీల రేట్లు, ఇతర మేటీరియల్‌ ధరలు పెరగడంతో ప్రభుత్వం ఇచ్చే యూనిట్‌ కాస్ట్‌లో నిర్మాణాలు చేపట్టలేమని కాంట్రాక్టర్‌లు మధ్యలోనే నిలిపివేసినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు యూనిట్‌ కాస్ట్‌పై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే తప్ప నిర్మాణాలు ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు.

అధికారుల చుట్టూ ప్రదక్షిణలు 

రాజన్న సిరిసిల్ల జిల్లాకు 6886 ఇళ్లు మంజూరయ్యాయి. రూ.402.28 కోట్ల వ్యయాన్ని నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు 3305  ఇళ్లు పూర్తయ్యాయి. 527 నిర్మాణ దశలోనే ఆగిపోయాయి. ఇప్పటివరకు రూ.186.90 కోట్లు వెచ్చించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాకపోవడంతో లబ్ధిదారులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో సిరిసిల్ల మండలంలో 2052 ఇళ్లలో 2052 పూర్తి చేశారు. ముస్తాబాద్‌ 707ఇళ్లకు 313, తంగళ్లపల్లి 565 ఇళ్లకు 107, ఎల్లారెడ్డిపేట 490 ఇళ్లకు 320, గంభీరావుపేట 495 ఇళ్లకు 369, వీర్నపల్లి 120 ఇళ్లు మంజూరైన ఇంకా ప్రారంభం కాలేదు. ఇల్లంతకుంట 340 ఇళ్లకు 104 పూర్తి చేశారు. వేములవాడ రూరల్‌ మండలం  1080 ఇళ్లకు 40ఇళ్లు పూర్తికాగా వేములవాడ అర్భన్‌లో 800 ఇళ్లకు ఇప్పటి వరకు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. కోనరావుపేట మండలంలో 92, చందుర్తి  45, రుద్రంగి  35, బోయినపల్లిలో 65 ఇళ్లు మంజూరైనా ఇప్పటి వరకు నిర్మాణాలు ప్రారంభించలేదు. 

ఇళ్లకోసం ఇంకెన్నాళ్లు? 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రధానంగా సిరిసిల్ల నియోజకవర్గంలో మాత్రమే మంజూరైన ఇళ్ల నిర్మాణాలు  వేగంగా పూర్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేములవాడ నియోజకవర్గంలో నిర్మాణాలు మొదలు కానివే ఎక్కువగా ఉన్నాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో 4429 ఇళ్లు మంజూరు కాగా 3424  నిర్మాణాలు చేపట్టి 3161 ఇళ్లను పూర్తి చేశారు. 263 ఇళ్లు నిర్మాణంలో ఉండగా 1005 ఇంకా ప్రారంభించలేదు. రూ.273.72 కోట్లు నిర్మాణ వ్యయంగా నిర్ణయించగా రూ.174.72 కోట్లు ఖర్చు చేశారు. సిరిసిల్ల పట్టణ లబ్ధిదారుల కోసం మండెపల్లి వద్ద నిర్మించిన ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు నెలల క్రితమే ప్రారంభించినా లబ్ధిదారులకు మాత్రం  కేటాయించలేదు. ఇందుకోసం మున్సిపల్‌ వార్డుల్లో వార్డు సభలు నిర్వహిస్తూనే ఉన్నారు. ముస్తాబాద్‌ మండలంలో 65 ఇళ్లు, ఎల్లారెడ్డిపేట 264, వేములవాడలో 40 ఇళ్లను గతేడాది పంపిణీ చేశారు. ప్రస్తుతం 2936 ఇళ్లు పూర్తయి సిద్ధంగా ఉన్నా లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో ఎదురు చూడక తప్పడం లేదు. వేములవాడ నియోజకవర్గంలో 2052 ఇళ్లు మంజూరు కాగా 264 మాత్రమే నిర్మాణాలు ప్రారంభించారు. 40 ఇళ్లు పూర్తి కాగా 184 ఇళ్లు ప్రగతిలో ఉన్నాయి. 1828 ఇళ్లు నిర్మాణానికి నోచుకోలేదు. చొప్పదండి నియోజకవర్గంలో ఉన్న బోయినపల్లి మండలానికి 65 ఇళ్లు మంజూరైనా నిర్మాణాలు చేపట్టలేదు. మానకొండూరు నియోజకవర్గంలో ఉన్న  ఇల్లంతకుంట మండలానికి 340 ఇళ్లు మంజూరు కాగా 184 ఇళ్ల నిర్మాణాలు చేపట్టి 104 పూర్తి చేశారు. 156 ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. నిర్మాణాలు చేపట్టకపోవడానికి ప్రధానంగా యూనిట్‌ వ్యయం పెరగడమే కారణంగా తెలుస్తోంది. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం గ్రామాల్లో రూ.5 లక్షల 4 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5 లక్షల 30 వేలు నిర్ణయించింది. ప్రస్తుతం పెరిగిన ధరలతో ఇంటి నిర్మాణం కనీసం రూ.8 లక్షలకుపైగా కావడంతోనే నిర్మాణాల్లో వేగం పెరగడం లేదని తెలుస్తోంది. 

బకాయిల కోసం ఎదురుచూపులు 

 మెటీరియల్‌ ధరలు పెరిగినా కాంట్రాక్టర్‌లు ముందుకొచ్చి నిర్మాణాలు చేపడుతున్నారు. బిల్లులు చెల్లింపు మాత్రం సమస్యగా మారుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంట్రాక్టర్‌లకే పెండింగ్‌ బిల్లులు రూ .4 కోట్ల వరకు రావాల్సి ఉంది. బిల్లులు కానీవి కూడా కోట్లలోనే ఉండడంతో కాంట్రాక్టర్‌లు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 5 నెలలుగా బిల్లులు రావడం లేదు.  డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు కాంట్రాక్టర్‌ వేగంగా చేయడం లేదని ప్రజాప్రతినిధులు అరోపించడం, కాంట్రాక్టర్‌లు పట్టించుకోకపోవడం సర్వసాధరణంగా మారింది. 

తలనొప్పిగా మారిన అర్హుల ఎంపిక 

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు కోసం వచ్చిన దరఖాస్తులపై గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహిస్తున్నా అర్హుల ఎంపిక అధికారులకు  తలనొప్పిగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముందుగా అర్హుల జాబితాను ప్రకటించి రెండు, మూడు విడతల్లో పరిశీలన జరిపి జాబితా ప్రచురిస్తున్న క్రమంలో మొదటగా వచ్చిన పేరు రెండో జాబితాలో, తుది జాబితాల్లో లేకపోవడంతో ప్రజలు సమావేశాల వద్ద అందోళనకు దిగుతున్నారు. మంత్రి కేటీఆర్‌,   కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి లబ్ధిదారుల ఎంపిక  ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఆదేశిస్తున్నా ఎంపిక ప్రక్రియ మాత్రం నత్తనడకనే సాగుతోంది. 


Updated Date - 2022-01-17T06:22:13+05:30 IST