తాగునీటి తండ్లాట

ABN , First Publish Date - 2022-01-24T05:50:35+05:30 IST

రామగుండం పక్కనే నిండుకుండలా గోదావరి.. ఆ పైనే ఎల్లంపల్లి ప్రాజెక్టు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ నుంచి నీటి సరఫరా.. అయినా రామగుండంలో ప్రజల దాహార్థి మాత్రం తీరడం లేదు.

తాగునీటి తండ్లాట

- మిషన్‌ భగీరథ నీరు ఇచ్చినా రోజు విడిచి రోజు సరఫరా

- నిరంతర నీటి సరఫరాకు హామీలు.. కార్యాచరణ కరువు

- రెండేళ్లు కావస్తున్నా వినియోగంలోకి రాని భీమునిపట్నం ట్యాంకు

- పీకే రామయ్య కాలనీలో నల్లా కనెక్షన్లే లేవు

- అమృత్‌, సీఎంఏ గ్రాంట్‌లో నిధులు ఇచ్చినా మారని తీరు

- రామగుండంలో నీటి సరఫరాపై పర్యవేక్షణ కరువు

- లీకేజీల మరమ్మతులకు నెలలు

కోల్‌సిటీ, జనవరి 23: రామగుండం పక్కనే నిండుకుండలా గోదావరి.. ఆ పైనే ఎల్లంపల్లి ప్రాజెక్టు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ నుంచి నీటి సరఫరా.. అయినా రామగుండంలో ప్రజల దాహార్థి మాత్రం తీరడం లేదు. మున్సిపాలిటీలో 24గంటల నీటి సరఫరా దేవుడెరుగు.. రోజు విడిచి రోజు నీటి సరఫరానే గగనమవుతోంది. కనీసం ప్రతిరోజూ నీటి సరఫరా చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు లేని దుర్భర స్థితి రామగుండంలో నెలకొన్నది. గ్రామాల్లో సైతం రోజూ నీటి సరఫరా జరుగుతున్నా రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మాత్రం రోజు విడిచి రోజు నీటి సరఫరా జరగడం లేదు. తాగునీటి వ్యవస్థపై పర్యవేక్షణ లేకపోవడం, ప్రణాళిక లోపాలతో కార్పొరేషన్‌లో నీటి సరఫరానే ఒక ప్రహసనంగా మారిపోయింది. రామగుండం నగరపాలక సంస్థ 93.87చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. 2011జనాభా లెక్కల ప్రకారం 2,29,644జనాభా ఉంది. కార్పొరేషన్‌ పరిధిలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ రికార్డుల ప్రకారం 61,321 నివాసాలు ఉన్నాయి. ఇందులో సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, జెన్‌కో, రైల్వే క్వార్టర్లు 17329 ఉన్నాయి. మిగతావి సుమారు 44వేల నివాసాలు మాత్రమే మున్సిపల్‌ కార్పొరేషన్‌ సర్వీస్‌ ఏరియాగా ఉన్నాయి. సింగరేణి, ఎన్‌టీపీసీ, జెన్‌కో, రైల్వే క్వార్టర్లకు ఆయా సంస్థలే మంచినీటి సరఫరా చేస్తున్నాయి. సింగరేణి, ఎన్‌టీపీసీ, జెన్‌కోలకు గోదావరి నుంచి ప్రత్యేక నీటి సరఫరా వ్యవస్థ ఉంది. ఆయా సంస్థలు ప్రతి రోజు నీటి సరఫరా చేస్తున్నాయి. ఎన్‌టీపీసీలోనైతే నిరంతర నీటి సరఫరా ఉంటుంది. సింగరేణి సంస్థ గోదావరి నుంచి ప్రత్యేక నీటి సరఫరా వ్యవస్థతో సెంటినరీ కాలనీ వరకు నీటి సరఫరా చేస్తుంది. ఆ సంస్థ పరిధిలోని క్వార్టర్లతో పాటు యైుటింక్లయిన్‌కాలనీ, గోదావరిఖనిలోని పలు కాలనీల్లోని ప్రైవేట్‌ నివాసాలకు కూడా నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఫిల్టర్‌బెడ్లు, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు ఉన్నాయి. 

మిషన్‌ భగీరథతో నీటి సరఫరా..

రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు మిషన్‌ భగీరథ నుంచి రోజుకు 5.6కోట్ల లీటర్లు(56ఎంఎల్‌డీ) నీటి సరఫరా ఒప్పందం ఉంది. ఇందులో నుంచి సింగరేణి సంస్థకు 20ఎంఎల్‌డీ నీటి సరఫరా చేయగా, మిగిలిన 36ఎంఎల్‌డీలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నేరుగా రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు నీటి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 32 నుంచి 36ఎంఎల్‌డీల నీరు ఎల్లంపల్లి నుంచి వస్తుంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో బీ పవర్‌హౌస్‌ గడ్డపై గ్రౌండ్‌ లెవల్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌(జీఎల్‌బీఆర్‌) ఉంది. ఇక్కడి నుంచి కార్పొరేషన్‌ పరిధిలోని పది ఓవర్‌హెడ్‌ ట్యాంకులకు ఎలాంటి పంపింగ్‌ లేకుండా కేవలం గ్రావిటీ ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. కార్పొరేషన్‌ పరిధిలో శారదానగర్‌ వద్ద 24లక్షల లీటర్ల సామర్థ్యంగల ఓవర్‌హెడ్‌ ట్యాంకు ఉంది. ఎన్‌టీపీసీ హెలీ ప్యాడ్‌(17లక్షల లీటర్లు), గోదావరిఖని మెటర్నిటీ ట్యాంకు(12లక్షల లీటర్లు), ఓల్డ్‌ మున్సిపల్‌ ఆఫీస్‌ ట్యాంకు(12లక్షల లీటర్లు), అశోక్‌నగర్‌, సంజయ్‌గాంధీనగర్‌ ట్యాంకులు (12లక్షల లీటర్లు), రామగుండం బీ పవర్‌హౌస్‌ ట్యాంకు(10లక్షల లీటర్లు), అల్లూరు, మారేడుపాక ట్యాంకులు(10లక్షల లీటర్లు), ఎన్‌టీపీసీ భీముని పట్నం, గోదావరిఖని సీఎస్‌పీ కాలనీ, విఠల్‌నగర్‌, ఎఫ్‌సీఐ ట్యాంకులు(10లక్షల లీటర్లు) ఉన్నాయి. కార్పొరేషన్‌ పరిధిలోని 255కిలో మీటర్ల పైప్‌లైన్లు ఉంటే 42వేల కనెక్షన్లు ఉన్నాయి. కార్పొరేషన్‌ పరిధిలో 44వేల ప్రైవేట్‌ నివాసాలు ఉండగా ఇప్పటికీ సుమారు 2వేల నివాసాలకు మంచినీటి కనెక్షన్లు లేని దుర్భర స్థితి ఉంది. 

అమృత్‌ నుంచి రూ.110కోట్ల నిధులు..

రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ అమృత్‌ పథకానికి ఎంపిక చేసి రూ.110కోట్లు మంజూరుచేసింది. ఇందులో రూ.85కోట్లతో మంచినీటి పైప్‌లైన్ల నిర్మాణం, మిగతా నిధులతో ఉచితంగా బీదలకు మంచినీటి నల్లా కనెక్షన్లు ఇవ్వడం చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో ఎన్‌టీపీసీ భీమునిపట్నం, సీఎస్‌పీకాలనీ, విఠల్‌నగర్‌లలో మూడు ఓవర్‌హెడ్‌ ట్యాంకులు నిర్మించారు. ఎన్‌టీపీసీ, యైుటింక్లయిన్‌కాలనీతో పాటు గోదావరిఖని విఠల్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో పంపింగ్‌ మెయిన్‌లు, డిస్ర్టిబ్యూషన్‌ పైప్‌లైన్లు వేశారు. 

నీళ్ల ట్యాంకు కట్టారు.. సరఫరాను మరిచారు..

అమృత్‌ పథకంలో కార్పొరేషన్‌ పరిధిలోని ఎన్‌టీపీసీ భీమునిపట్నంలో 10లక్షల లీటర్ల సామర్థ్యంగల ఓవర్‌ హెడ్‌ ట్యాంకు నిర్మించారు. ఈ ట్యాంకు పరిధిలో 15వరకు మురికివాడలున్నాయి. ముఖ్యంగా భీమునిపట్నం, ఆటోనగర్‌, పీకే రామయ్యక్యాంపు, మేడిపల్లి, అంబేద్కర్‌నగర్‌ తదితర ప్రాంతాలున్నాయి. పీకేరామయ్య క్యాంపు పూర్తిగా రోజు వారి కూలీలు నివాసముండే ప్రాంతం. ఇక్కడ ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వలస వచ్చిన కూలీలు, ఆటో డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, ఎన్‌టీపీసీ కాంట్రాక్టు కార్మికులు ఎక్కువగా నివాసముంటున్నాము. భీమునిపట్నం ట్యాంకు నిర్మాణం పూర్తయి రెండున్నరేళ్లు అయినా ఇప్పటికీ నీటి సరఫరాకు నోచుకోవడం లేదు. ట్యాంకు నుంచి ఔట్‌లెట్‌కు వాల్వ్‌లు బిగించకపోవడంతో నీటి సరఫరా జరుగడం లేదు. పీకే రామయ్య కాలనీలో కనీసం డిస్ర్టిబ్యూషన్‌ లైన్లు వేసిన పరిస్థితి లేదు. 

అమలుకాని నిరంతర నీటి సరఫరా హామీ..

రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 24/7 నీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకోసం అమృత్‌ పథకంలో పెద్దఎత్తున నిధులు కేటాయించింది. అమృత్‌లో రాష్ట్ర వాటాగా 14వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమచేసింది. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాటు కేటాయించి రూ.100కోట్ల సీఎంఏ గ్రాంట్‌ నిధులతో కూడా 24 గంటల నీటి సరఫరాకు సుమారు రూ.5కోట్లు కేటాయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాల్వ్‌లు, ఇతర సామగ్రి కొనుగోలు చేశారు. ఇందులో ముఖ్యంగా సీఎంఏ గ్రాంట్‌ నిధుల నుంచి నిరంతర నీటి సరఫరా కోసం కోటి రూపాయల వ్యయంతో స్క్వాడ వాల్వ్‌లను కొనుగోలు చేశారు. సరైన పరిజ్ఞానం లేకపోవడంతో ఇవి వినియోగంలోకి రావడం లేదు. సెల్‌ఫోన్ల ద్వారా ఆపరేటింగ్‌ చేసే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా ఇది మూలపడి ఉంది. కార్పొరేషన్‌ పరిధిలో 24గంటల నీటి సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకుని మొదటగా అతి తక్కువ కనెక్షన్లు ఉన్న న్యూమారేడుపాక ఓవర్‌హెడ్‌ ట్యాంకును ఎంచుకున్నారు. ఇక్కడ కేవలం 600 నుంచి 800కనెక్షన్లు మాత్రమే ఉంటాయి. కొన్ని నెలల పాటు ఇక్కడ నిరంతర నీటి సరఫరా చేసినా తరువాత నిలిపివేశారు. 

పర్యవేక్షణ ప్రణాళిక ఉంటే..

రామగుండం నగరపాలక సంస్థలో మంచినీటి సరఫరాపై పర్యవేక్షించే పరిస్థితులు లేవు. గ్రామాల్లో సైతం ప్రతి రోజు నీటి సరఫరా జరుగుతున్నా నగరపాలక సంస్థలో రోజు విడిచి రోజు నీటి సరఫరా చేసే పరిస్థితి ఉంది. అది కూడా 42వేల కనెక్షన్లకు మాత్రమే ఇస్తున్నారు. పరిశ్రమలు నీటి సరఫరా చేస్తుండడంతో ఒత్తిడి కూడా తక్కువే. సరైన పర్యవేక్షణ, ప్రణాళిక ఉంటే కార్పొరేషన్‌ పరిధిలో మొదట తక్కువ కనెక్షన్లు ఉన్న ట్యాంకుల పరిధిలో ప్రతి రోజు మంచినీటి సరఫరా మొదలు పెట్టి అన్నీ ట్యాంకులకు దశవారీగా విస్తరించుకునే అవకాశం ఉంటుంది. కార్పొరేషన్‌ పాలకవర్గ పెద్దలు కానీ, ఉన్నతాధికారులు కానీ ఏరోజు పూర్తిస్థాయిలో నీటి సరఫరాపై పూర్తిస్థాయిలో పర్యవేక్షించే పరిస్థితి లేదు. లీకేజీలు ఏర్పడితే 15రోజుల వరకు ఆ ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 

Updated Date - 2022-01-24T05:50:35+05:30 IST