Abn logo
Sep 15 2020 @ 00:42AM

‘ముంచే’ ప్రభుత్వం!

సాగుకి నీళ్లివ్వాలనే సంకల్పం మంచిదే కానీ, అదొక విచక్షణ లేని వేలంవెర్రి కాగూడదు. కోర్టు ఇచ్చిన స్టేను కూడా ధిక్కరించేంత అహంకారం కూడదు. కళకళలాడే జలాశయాన్ని గర్వంగా ప్రదర్శించుకోవడం కోసం జనం కళ్లల్లో నీరు నింపకూడదు. రాజకీయంగా పోటీ పడాలనే అసహనపు ఆత్రుతలో మంచీచెడ్డా మరచిపోతే ఏమవుతుందో కడప జిల్లా గండికోట జలాశయం ముంపు గ్రామాల దుస్థితి చూస్తే అర్థమవుతుంది. ఒకనాడు ఇవే ముంపు గ్రామాల పరిహారం కోసం, న్యాయం కోసం చంద్రబాబు ప్రభుత్వం మీద గొంతెత్తిన వైసిపి జిల్లా, రాష్ట్ర నేతలే, ఊరును ముంచమని ఇప్పుడు అధికారులను తొందరపెడుతున్నారు. వరద ఉండగానే నీటిని పట్టుకోవాలని ఆదేశాలిస్తున్నారు. వాకిళ్ల నుంచి నట్టిళ్లలోకి, పెరళ్లలోకి నీరు ముంచుకువచ్చి, పాములు తేళ్ల మధ్య భయంభయంగా వారం రోజుల నుంచి బతుకీడుస్తున్న త్రాళ్ల పొద్దుటూరు గ్రామస్థుల బాధలు చెప్పనలివికానివి. 


గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా కడపలోని కొండాపురం మండలంలో నిర్మించింది ఈ గండికోట జలాశయం. దీని సామర్థ్యం 26.85 టిఎంసిలు. నిర్మాణం మునుపెన్నడో పూర్తి అయినప్పటికీ, పరిహారం, పునరావాసం పనులు పూర్తి కాకపోవడంతో, పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేయడం సాధ్యపడడం లేదు. అంటే రెండవదశ ప్రాజెక్టు ఇంకా మిగిలే ఉన్నది. పన్నెండు టిఎంసిల మేరకు నింపి, తన ప్రత్యర్థి నియోజకవర్గం పులివెందులకు నీళ్లు ఇచ్చారు చంద్రబాబు. ఆ అంశాన్ని ఆయన పదే పదే గొప్పగా ప్రస్తావించేవారు కూడా. ఇప్పుడు, 12 టిఎంసిల కంటె మించిన సామర్థ్యంతో, పూర్తి 26 టిఎంసిలు కాకపోయినా, కనీసం 16 టిఎంసిల వరకైనా నీటిని నింపి, తమది పైచేయిగా నిరూపించుకోవాలని జగన్‌ ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. అందుకని, పరిహారం చెల్లింపులు పూర్తి కాకుండానే, పునరావాస కాలనీ నిర్మాణం మొదలు కాకుండానే, ఉన్నవారిని ఉన్నట్టు ఇళ్లు ఖాళీచేయమని అధికారులు వెంటబడసాగారు. ఇంకా కొంత ఖాళీ కావలసి ఉన్న మరో ముంపు గ్రామం కొండాపూర్‌లో నిర్వాసితులు హైకోర్టుకు వెళ్లి గండికోట ప్రాజెక్టు రెండవ దశకు సంబంధించి అక్టోబర్‌ 16 వరకు స్టే పొందారు. మొత్తం ప్రాజెక్టుకు వర్తించే ఆ నిలుపుదల ఉత్తర్వును ప్రభుత్వం ధిక్కరిస్తున్నది. అధికారుల అఘాయిత్యాన్ని ఎదిరిస్తూ, గత వారం రోజుల నుంచి వెయ్యికి పైగా కుటుంబాలున్న త్రాళ్ల పొద్దుటూరులో జనం బైఠాయింపు, ఆందోళన చేస్తున్నారు. అనేక పర్యాయాలు ఉద్రిక్తపరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. ప్రజలను భయపెట్టడానికి ఒక ఖాళీ ఇంటిని దుండగులు తగులబెట్టారు కూడా. ఇష్టం లేకుండా భూసేకరణ చేస్తే, మునిగిపోవడానికైనా సిద్ధమంటూ సత్యాగ్రహం చేసిన సందర్భం వంటిది కాదిది. పరిహారానికి ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం ఒక గడువు చెప్పాలి కదా, ఆ లోగా, పునరావాస గృహాలు నిర్మించాలి కదా, అవేవీ లేకుండా, ఊళ్లో ఉన్నవారు మరెక్కడికీ పోవడానికి వీలులేని స్థితిలో నీళ్లు నింపడమేమిటి, కాళ్ల కిందికి నీళ్లు రావడమేమిటి? 


త్రాళ్ల పొద్దుటూరు జగన్‌ పార్టీకి గట్టి మద్దతు పలికిన గ్రామం. ఇప్పటికీ, ఆయనకు తెలియకుండా ఇదంతా ఎవరో కింది అధికారులెవరో చేస్తున్నారని నమ్మే అమాయక జనం అక్కడ బాగానే ఉన్నారు. పోలీసులు విరుచుకు పడితే, మానవహక్కుల వేదిక నేతను గృహనిర్బంధంలో ఉంచారు. వైసిపి, బిజెపి నేతలు అజ్ఞాతంలోకి వెళ్లవలసి వచ్చింది. స్థానిక ప్రజల తరఫున నిలబడిన సొంత పార్టీ నేతను కూడా సహించని వైఖరిని అధికార పార్టీ ప్రదర్శిస్తున్నది. 2017లో ముంపు ఖాళీ చేయించడానికి టిడిపి ప్రభుత్వం హడావుడి చేసినప్పుడు వైసిపికి చెందిన అప్పటి కడప ఎంపి, అవినాశ్‌ రెడ్డి, ప్రస్తుత శాసనసభ్యుడు సుధీర్‌రెడ్డి ప్రజలతో కలసి ఆందోళన చేశారు. ఇప్పుడు ఆ నాయకులే తమకు అన్యాయం చేస్తున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. 


2013 భూసేకరణ చట్టం ప్రకారం భవిష్యత్ నిర్వాసితులతో అధికారులు ముందుగా సంప్రదించాలి. బాధితులు చెప్పుకునే కష్టనష్టాలకు ఏదో పరిష్కారం చెప్పాలి. ఆ తరువాతే, భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టాలి. పునరావాస చర్యలు పూర్తికాకుండా భూసేకరణ చేయకూడదు. ఒక నివాసగృహం కూడా నిర్మించని పునరావాస కాలనీలో నిర్వాసితులు ఎట్లా ఉంటారు? వారికి నీడ, నీరు, మరుగు ఇవన్నీ ఎట్లా? చట్ట ప్రకారం తీసుకోవలసిన తగిన చర్యలు తీసుకోకుండా, ఉన్నపళాన ఖాళీ చేయమనడం చట్టవ్యతిరేకం- అని ఉద్యమకారులు అంటున్నారు. ఊరు ఊరంతా ఒక్క తాటి మీద ప్రతిఘటిస్తుంటే, ప్రజలను కులాల వారీగా, వాడలు కాలనీల వారీగా చీల్చడానికి ప్రయత్నించి, తమ లక్ష్యం నెరవేర్చుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామంలో ఉన్న నివాస ప్రాంతాల మట్టాన్ని దాటి నీటిని నిల్వచేస్తుండడం వల్ల ఇళ్లు మునగడం ఒక బాధ అయితే, రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు సమస్యను మరింత తీవ్రం చేశాయి. ముఖ్యంగా దళితులు, వెనుకబడిన కులాల కాలనీలలో పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నది. 


తగినంత గడువు ఇచ్చి, ఇవ్వవలసిన పరిహారం ఇచ్చి, పునరావాసపు ఏర్పాట్లు పూర్తి అయ్యే దాకా జలాశయంలో గతానికి మించి నీరు నింపకుండా వేచి ఉండడం న్యాయం. ప్రభుత్వం ఆ వివేకం ప్రదర్శించాలి. న్యాయస్థానాల చేత తరచు అక్షింతలు వేయించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కొనే ప్రమాదాన్ని నివారించుకుంటే మంచిది. 

Advertisement
Advertisement
Advertisement