డ్రమ్‌ సీడర్‌.. భలే బాగు

ABN , First Publish Date - 2021-01-11T06:08:30+05:30 IST

సాధారణంగా వరి పంట సాగుకు నారు పోసి నాటు వేసుకోవాలి.

డ్రమ్‌ సీడర్‌.. భలే బాగు
డ్రమ్‌సీడర్‌తో విత్తనాలు చల్లుతున్న రైతు

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం
 కూలీల సమస్య అధిగమించే అవకాశం
 ఉమ్మడి జిల్లాలో 5వేల హెక్టార్లలో సాగు

త్రిపురారం, జనవరి 10 :
సాధారణంగా వరి పంట సాగుకు  నారు పోసి నాటు వేసుకోవాలి. ఇది చాలా ఖర్చుతో పాటు, కూలీల సమస్య వేధిస్తోంది.కూలీలు దొరకక సాగులో ఆలస్యమైతే అదును దాటి దిగుబడులపై ప్రభా వం చూపుతుంది. అలాగాక ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తే రైతులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ప్రధానంగా వరి సాగులో డ్రమ్‌ సీడర్‌తో నేరుగా వరి విత్తనం విత్తే పద్ధతిని నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపసాగర్‌ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయి ప్రదర్శనతో రైతులకు శిక్షణ ఇస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 5వేల  హెక్టార్లలో డ్రమ్‌ సీడర్‌ పద్ధతితో రైతులు వరి సాగు చేపట్టడానికి సిద్ధం చేస్తున్నట్లు సేద్యపు విభాగపు శాస్త్రవేత్త డాక్టర్‌ భరత్‌ తెలిపారు. ఈ పద్ధతిలో వరి సాగుపై రైతులకు వివరించారు.
ఉపయోగాలు
  - ఈ పద్ధతితో ఎకరానికి 15-20 కిలోల విత్తనం ఆదా అవుతుంది.
  పంట 7-10రోజుల ముందుగా కోతకు వస్తుంది. నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు.
  సాగు ఖర్చు ఎకరానికి రూ.2,500 నుంచి 3వేలు తగ్గుతుంది.
  -   మొక్కల సాంద్రత సరిపడా ఉండటంతో 10-15శాతం దిగుబడి పెరుగుతుంది.
  -   కూలీల కొరత అధిగమించవచ్చు.
  -   ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నపుడే వరి సాగు చేసుకోవచ్చు.
ప్రతికూలతలు
  -   చలి ఎక్కువ ఉన్న, సమస్యాత్మక నేలల్లో (చౌడు, క్షారము, ఆమ్లము) అనుకూలం కాదు.
  -   విత్తనం చల్లిన తరువాత వర్షం వస్తే పూర్తిగా విత్తనం కొట్టుకు పోయే అవకాశం కలదు. యాసంగిలో ఈ సాగు అనుకూలం.
విత్తన వేసుకునే పద్ధతి
  - డ్రమ్‌ సీడర్‌ పద్ధతిలో ఎకరానికి 10-12కిలోల విత్తనాలు సరిపోతాయి.
  -  డ్రమ్‌ సీడర్‌తో విత్తనాలు విత్తుకునే ముందు లీటర్‌ నీటికి 1గ్రా. కార్బ ండిజమ్‌ చొప్పున కలిపిన ద్రావణంలో విత్తనాలు 12గంటలు నానబెట్టాలి. అనంతరం గోనె సంచుల్లో 24గంటలు మండె కట్టాక  మొలక వచ్చిన తరువాత డ్రమ్‌ సీడర్‌లో వేసి విత్తుకోవాలి.
  -  డ్రమ్‌ సీడర్‌ పరికరానికి నాలుగు ప్లాస్టిక్‌ డ్రమ్ములు ఉంటాయి. ప్రతీ డ్రమ్ముకు 20సెంమీ దూరంలో రెండు చివరల వరుసకు 18 రంధ్రాలు ఉంటాయి. ఈ డ్రమ్ములో మొలకెత్తిన విత్తనాలను నింపి మూత బిగించాలి. గింజ రాలడానికి వీలుగా ప్రతీ డ్రమ్ములో కేవలం మూడో వంతు మాత్రమే గింజలు నింపాలి.
  - గింజలు నింపి డ్రమ్‌ సీడర్‌ లాగితే ఎనిమిది వరుసల్లో ఒక్కో కుదురుకు 5-8 గింజలు పడతాయి. కుదురుకు కుదురుకు మధ్య దూరం 5- 8 సెం.మీ ఉంటుంది.
  -  కొన్ని పరిస్థితుల్లో మొలక సరిగా రాకపోవడం, పక్షులు తినడం వల్ల  కుదురులోని గింజలు 50శాతం దెబ్బతింటే మిగిలిన 50శాతం గింజల నుంచి వచ్చిన మొక్కల సాంద్రత సరిపోతుంది.
  -  గింజ రకాలను అనుసరించి గింజ అధికంగా పడుతుంటే స్టాపర్స్‌తో రంధ్రాలు మూసివేయాలి.
  -  ప్రతీ 16వరుసలకు అడుగు వెడల్పు కాలిబాటలు ఉంచుకోవాలి. తాడును వినియోగించి డ్రమ్‌ లాగితే వరుసలు బాగా వస్తాయి. ఈ పద్ధతిలో కోనోవీడర్‌ తిప్పడానికి వీలుగా ఉంటుంది.
పొలం తయారీ
సాఽధారణ వరి నాటేటపుడు కన్నా వీలైౖనంత బాగా చదును చేసుకోవాలి. పొలం ఎత్తు పల్లాలు లేకుండా సమాంతరంగా ఉండటం చాలా అవసరం.  పొలంలో నీరు నిల్వ ఉండరాదు. నీరు ఎక్కువైతే బయటకు పోవడానికి ఏర్పాట్లు చేయాలి.
  -  పెద్దగా ఉన్న మడులను చిన్నవిగా చేసి విభజించుకుంటే చదును చేయడానికి నీరు పెట్టడానికి, విత్తనం చల్లడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. బంక నేలల్లో ఆఖరి దమ్ము చేసి చదును చేసిన మరుసటి రోజు విత్తుకోవచ్చు. విత్తే సమయానికి నీరు లేకుండా బురదగా ఉంటే సరిపోతుంది.
  -  ఇసుక శాతం ఎక్కువగా ఉన్న నేలల్లో విత్తనం వేసేటపుడు అదే రోజు ఆఖరి దమ్ము చేసి చదును చేసి పలుచటి నీటి పొర ఉండేటట్లు చూసుకోవాలి.
ఎరువుల యాజమాన్యం
ఈ పద్ధతిలో వానాకాలంలో 40-48కిలోలు నత్రజని, 24కిలోల భాస్వరం, 16కిలోల పొటాష్‌, యాసంగిలో 48-60కిలోల నత్రజని, 24కిలోల భాస్వరం, 16కిలోల పొటాష్‌ ఎరువలు వేసుకోవాలి.
  -  దమ్ములో నత్రజని ఎరువులు వేయకుండా కేవలం భాస్వరం ఎరువు (మొత్తం మోతాదు) పొటాష్‌ (సిఫారసు చేసిన మోతాదులో సగం మాత్రమే వేయాలి). దమ్ములో విత్తేటపుడు నత్రజని వేస్తే కలుపు అధికంగా వస్తుంది.
  - భాస్వరము మూడు భాగాలుగా చేసి మూడోభాగం విత్తిన 3-5 రోజులకు మరో భాగం విత్తిన 40-45రోజులకు,  మిగిలిన మరో భాగం నత్రజని, సగం పొటాష్‌తో కలిపి విత్తిన 60-65రోజులకు వేయాలి.
కలుపు యాజమాన్యం
  - ఎకరాకు (పెట్లాకోర్‌ + సేఫనర్‌ మందును 600-800 మి.లీ విత్తిన 3-5రోజుల లోపు లేదా పైరజోసల్ఫూరాన్‌ ఈథైల్‌ 80-100గ్రా. లేదా బ్యూటాక్లోర్‌ 1-1.5లీ లేదా పెట్లాకోర్‌ 500మి.లీ లేదా అక్సాడయార్జిల్‌ మందును 35-45గ్రా. 8-10రోజుల్లో ఇసుకలో కలిపి చల్లాలి.
  - ఎకరాకు సైహలోఫాప్‌ పి బ్యూటైల్‌ 300మి.లీ (ఊద, బడిపిలి) లేదా ఫినాక్స్‌ పాప్‌ ఈథైల్‌ 250-300మి.లీ విత్తిన 15రోజులకు లేదా బిస్‌పైరిబాక్‌ సోడియం 100మి.లీ విత్తిన 20రోజులకు 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి.
  - బస్‌ పైరిబాక్‌ సోడియం వెడల్పాకు కలుపు నివారణకు 2-4-డి సోడియం సాల్ట్‌ 600గ్రా. విత్తిన 25-30 రోజులకు పిచికారి చేయాలి. పంట దశను కలుపు రకాన్ని అనుసరించి కలుపు మందును ఎంచుకోవాలి.
నీటి యాజమాన్యం
విత్తనం విత్తిన తరువాత మొదట్లో నీరు లేకుండా బురదగా ఉంచాలి.  తరువాత పలుచగా నీరు (2-3 సెం.మీ) పిలకలు తొడిగే దశ వరకు ఉంచితే సరిపోతుంది. పైౖరు పొట్ట దశ నుంచి పంట కోసే 7-10 రోజుల వరకు నాటు వేసిన పొలం మాదిరిగానే నీటి యాజమాన్యం పాటించాలి.

Updated Date - 2021-01-11T06:08:30+05:30 IST