ప్రతి ఆదివారం డ్రై డే పాటించాలి

ABN , First Publish Date - 2020-05-10T10:38:35+05:30 IST

ప్రతి పట్టణం, గ్రామంలో ప్రతి ఆదివారం డ్రై డే నిర్వహించి పట్టణాలు, గ్రామాలతోపాటు ఇళ్ళను పరిశుభ్రం

ప్రతి ఆదివారం డ్రై డే పాటించాలి

ఉదయం 10గంటలకు పరిశుభ్రత పనులు చేపట్టాలి 

కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి 

రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు 


కరీంనగర్‌, మే 9 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ప్రతి పట్టణం, గ్రామంలో ప్రతి ఆదివారం డ్రై డే నిర్వహించి పట్టణాలు, గ్రామాలతోపాటు ఇళ్ళను పరిశుభ్రం చేసుకోవాలని రాష్ట్ర మున్సిపల్‌, ఐటీశాఖల మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కరోనా కట్టడికి తీసుకోవలసిన చర్యలపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రతి ఆదివారం గ్రామాలు, పట్టణాలలో డ్రై డే పాటించాలని ఒక్క నీటి చుక్క నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలన్నారు.


  డెంగ్యూ చికెన్‌గున్యా, కలరా లాంటి వ్యాధులకు కారణం అవుతున్న దోమల నివారణకు, అవి వృద్ధి చెందకుండా ఉండడానికి ప్రతి ఆదివారం 10గంటలకు పది నిమిషాల పాటు విధిగా మన ఇంట్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీరు ఖాళీ చేయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు రేపటి నుంచి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాల పాటు విధిగా మీ ఇంట్లో ఇంటి పరిసరాలలో నిలిచి ఉన్న నీటిని తొలగించి వ్యాధులు వ్యాపించకుండా చూడాలని అన్నారు.


ఎయిర్‌కూలర్‌, రిఫ్రిజిరేటర్‌ నీరు నిలువ ఉండకుండా చూడాలని అన్నారు. పగిలిన కుండలు, డబ్బాలు, డ్రమ్ములు మొదలగు వాటిలో నీరునిలిచి ఉంటే తొలగించాలని అన్నారు. రేపటినుంచే ఈ ఉద్యమాన్ని ప్రారంభిద్దామని, ప్రతి ఆదివారం నిలువ నీటిని తొలగిద్దామని వ్యాధులకు కారణమయ్యే దోమలను పారదోలుదామని మన పట్టణాన్ని ఆరోగ్యవంతమైన పట్టణంగా మలచుకొందామన్నారు. కరోనా కట్టడిలో జిల్లా యంత్రాంగం సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటా మని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. నగర పాలక కమిషనర్‌ వల్లూరి క్రాంతి, మున్సిపల్‌ ఎస్‌ఈ భద్రయ్య పాల్గొన్నారు.


Updated Date - 2020-05-10T10:38:35+05:30 IST