మూగ రోదన!

ABN , First Publish Date - 2021-06-14T04:54:44+05:30 IST

జిల్లాలో పశుపోషణే ప్రధాన జీవనాధారంగా మారింది. వచ్చిరాని వైద్యంతోనే పశువుల వ్యాధుల ను నయం చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికారులు సకాలంలో స్పందించక మూగరోదన వినిపిస్తోంది. మూగ జీవాలు తొలకరి వ్యాధుల బారినపడి మృత్యువాత పడుతున్నాయి.

మూగ రోదన!

పశువులను చుట్టుముడుతున్న తొలకరి వ్యాధులు 

వేధిస్తున్న వైద్యుల కొరత, నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్న రైతులు

సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్న మూగ జీవాలు 

జిల్లాలో గాడితప్పుతున్న పశువైద్యంతో రైతుల ఆందోళన

ఆదిలాబాద్‌, జూన్‌13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పశుపోషణే ప్రధాన జీవనాధారంగా మారింది. వచ్చిరాని వైద్యంతోనే పశువుల వ్యాధుల ను నయం చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికారులు సకాలంలో స్పందించక  మూగరోదన వినిపిస్తోంది. మూగ జీవాలు తొలకరి వ్యాధుల బారినపడి మృత్యువాత పడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో నాటు వైద్యం వికటించడంతో పశువుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. గతంలో నిర్వహించిన పశుగణన లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 52లక్షల 70వేల 510 వివిధ రకాల పశువులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ సారి ఇప్పటి వరకు పశుగణన కార్యక్రమాన్ని చేపట్టనే లేదు. ఏటా సీజనల్‌గా పశువులకు సోకే తొలకరి వ్యాధుల పట్ల రైతులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీనికి తోడు వేధిస్తున్న వైద్యుల కొరతతో సకాలంలో వైద్యం అందక మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటికి రెప్పల కాపాడుకున్న పశువులను భయంకర వ్యాధులు కభలించడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. ప్రధానంగా గ్రామీణ పశువైద్యశాలలో సరైన వసతులు లేక పోవడం తో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా మండలాల్లో పశువైద్యశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఏళ్ల తరబడి నిర్వహణ లేక పోవడంతో ప్రమాదకరంగా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన వెటర్నరి అసిస్టెంట్ల పోస్టులు భర్తీకాక పోవడంతో రైతుల పాలిట శాపంగా మారుతోంది. గతంలో ప్రభుత్వం సబ్సిడీ పై అందజేసిన గొర్రెలకు సైతం సరైన వైద్య సేవలు అందడం లేదని గొర్రెల కాపరులు వాపోతున్నారు. ప్రతి యేటా తొలకరి వర్షాలకు పశువుల్లో జబ్బవాపు, గుండెవాపు, గొర్రెలు మేకల్లో చిటక రోగం లాంటి వ్యాధుల బారిన పడి పశు సంపదను నష్ట పోతున్నారు. పెరిగిపోతున్న యాంత్రికరణతో అంతరించి పోతున్న పశు సంపదను కాపాడుకో వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. జిల్లాలో గాడితప్పుతున్న పశువైద్యంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. అయినా అధికార యంత్రాంగం కదిలినట్లే కనిపించడం లేదు.

పొంచి ఉన్న ముప్పు..

 జిల్లాలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. సీజనల్‌గా సోకే తొలకరి వ్యాధులు పశుపోషణపై తీవ్ర ప్రభావం చూపుతు న్నాయి. అలాగే పశువుల్లో చురుకుదనం కనిపించక పోవడంతో పాటు ప్రధానంగా బొబ్బరోగం, చిటుక వ్యాధి, పీపీఆర్‌, గురుక పెట్ట డం, జబ్బవాపు, గొంతువాపు, డయేరియా లాంటి వ్యాధులు సంభ వించే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో పాడి పశువులు అంతు చిక్కని వ్యాధుల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నాయి. ఇలాంటి పరిస్థి తుల్లో రైతులను పశువ్యాధులపై అప్రమత్తం చేయాల్సిన అధికారులు అందుబాటులో లేక అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ యేడు నట్టల నివారణ పంపిణీ కార్యక్రమాన్ని ఇంకా ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టత కనిపించడం లేదు. తొలకరి వర్షాలు కురుస్తున్న గ్రామంలో పశువైద్యాధికారులు పర్యటించక పోవడంతో రైతులే జిల్లా ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. అలాగే ఆపద సమయంలో వైద్యం అందుబాటులో లేక పోవడంతో పశు సంపద చేజారి పోయే అవకాశం ఉందని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. తొలకరి వర్షాలకు చుట్టుముట్టే వ్యాధులపై రైతుల్లో అవగాహన కల్పిస్తే పశు సంపదను కాపాడుకునే అవకాశం ఉంటుంది.

ఏళ్ల తరబడి వైద్యుల కొరత..

జిల్లాలో 18 మండలాల పరిధిలోని మొత్తం 21 పశువైద్య శాస్త్ర చికిత్స కేంద్రాలు (వీడీ) ఉండగా, 12 గ్రామీణ పశువైద్య కేంద్రాలు (ఆర్‌ఎల్‌యూ), మరో రెండు వెటర్నరీ ఆసుపత్రులు(వీహెచ్‌) ఉన్నా యి. మొత్తం 27 మంది వైద్యులు పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం 18మంది వైద్యులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి వైద్యుల కొరత పశువైద్య శాఖను వేదిస్తునే ఉంది. అలాగే వెటర్నరీ లైవ్‌స్టాక్‌ (వీఎల్‌వో)ల పోస్టులు మూడు ఉండగా ఇద్దరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఐదుగురు జూనియర్‌ వెటర్నరి అధికారు (జేవీఓ)లు, లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌ అధికారులు (ఎల్‌ఎస్‌ఏ)8 మంది పని చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ అధికారుల పోస్టులు 21 ఉండగా ఒక్కరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా 20పోస్టులు కొంత కాలంగా ఖాళీగానే కనబడుతున్నాయి. దీంతో గ్రామాల్లో గోపాల మిత్రలే అన్నదాతలకు అప్తులవుతున్నారు. అలాగే వైద్యులు అందుబాటులో లేక సంచార వైద్య సేవలు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. దీంతో జిల్లాలో పశువైద్యం గాడి తప్పడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏటా వైద్యుల కొరతతోనే పశువైద్యాన్ని నెట్టుకొచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

Updated Date - 2021-06-14T04:54:44+05:30 IST