కొవ్వూరు పట్టణాన్ని వీడని దుర్గంధం

ABN , First Publish Date - 2022-01-20T05:28:06+05:30 IST

చిన్న సమస్య ఒక పట్టణాన్ని పట్టిపీడిస్తోంది..

కొవ్వూరు పట్టణాన్ని వీడని దుర్గంధం
గోదావరి గట్టుపై కాటన్‌ విగ్రహ సమీపంలో చెత్త డంపింగ్‌

కొవ్వూరు, జనవరి 19: చిన్న సమస్య ఒక పట్టణాన్ని పట్టిపీడిస్తోంది.. ఐదు దశాబ్దాలుగా వెంటాడుతోంది. సుమారు పది మంది ఎమ్మెల్యేలు.. ఇద్దరు మంత్రులుగా కూడా ప్రాతినిధ్యం వహించారు.. సమస్య పరిష్కారం కాలేదు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యం ఉన్న పట్టణానికి నిత్యం వేలాది మంది వస్తారు. రాష్ట్ర రహదారి పక్కన చెత్త డంపింగ్‌తో ఎవరైనా ముక్కు మూసుకోవ లిసిందే..! ఇదేం పాలనరా బాబూ అని ముక్కున వేలేసుకోవలసిందే..!!

ఒక పక్కన అఖండ గోదావరి సోయగం, మరో పక్కన దుర్వాసన వెదజల్లుతున్న చెత్త కుప్ప. ప్రతిరోజు తిరిగే ప్రజలకు భరించలేని దుర్గంధం.. మంత్రి, ఆర్డీవో, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కమిషనర్‌ ఎవరికీ పట్టదు. 16.23 కిలోమీటర్లు విస్తరించిన పట్టణంలో 23 వార్డు లు, 40 వేలకు పైగా జనాభా. 13వేల నివాస గృహాలు, దుకాణాలు, సంస్థల నుంచి నిత్యం 23 టన్నుల చెత్త వచ్చి పడుతుంది. గతంలో రాజీవ్‌కాలనిలోని నివాసాలను ఆనుకుని మున్సిపల్‌ చెర్వు మూసివేసి చెత్తను డంపింగ్‌ చేశారు. వర్షాకాలంలో చెత్త రోడ్డుపై పారు తోందని కాలనీ వాసుల ఆందోళనతో నందమూరు రోడ్‌లో సుమారు 2 ఎకరాల భూమి సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. భూ యజమాని కోర్టు ను ఆశ్రయించడంతో ఆగిపోయింది. ఇటీవల ఐ.పంగిడిలో జడ్పీ స్థలం 7 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. సుమారు 11 కిలోమీటర్లు దూరంలోని చెత్తను తీసుకువచ్చి మా గ్రామంలో వేయడానికి వీలులేదని స్థానికు లు ఆందోళన చేపట్టారు. దీనితో గోదావరి తీరం గోష్పాదక్షేత్రానికి సమీపంలోని పాత రైలు వంతెన వద్ద గోదావరి గట్టుపై చెత్త వేస్తున్నారు.


చారిత్రక పట్టణంలో దుర్గంధం

కొవ్వూరు పురాతన, చారిత్ర పట్టణం. దేశం నలుమూలల నుంచి యాత్రికులు కొవ్వూరు గోష్పాదక్షేత్రానికి వస్తుంటారు. గోదావరి గట్టుపై యాత్రికులకు సప్తరుషుల విగ్రహాలకు బదులుగా చెత్త దర్శనం ఇస్తుంది. దీనికితోడు మున్సిపల్‌ సిబ్బంది డంపింగ్‌ యార్డులో తరలించిన చెత్తను మంట పెట్టడంతో ప్లాస్టిక్‌, రసాయనాలు మండి స్థానికులు ఊపిరితిత్తులు, గుండె సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. తక్షణం డంపింగ్‌ యార్డును కాటన్‌ విగ్రహం పరిసర ప్రాంతం నుంచి తరలించాలి.

పిల్లలమర్రి మురళీకృష్ణ, కౌన్సిలర్‌


అవగాహన కల్పిస్తున్నాం

పట్టణంలో చెత్త సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం. ఇంటింటా సేకరిస్తున్న చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేసి అందించాలని ప్రజలకు మూడు రకాల డస్ట్‌బిన్‌లు అందజేశాం. వారికి అవగాహన కల్పిస్తున్నాం. ఒకటో వార్డులో వర్మి కంపోస్టు ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నాం. గోదావరి గట్టుపై కాటన్‌ విగ్రహం వద్ద చెత్త రోడ్లపైకి రాకుండా స్థలం చుట్టూ ఫెన్సింగ్‌ వేయిస్తున్నాం. పాలకవర్గ సహకారంతో డంపింగ్‌ యార్డు సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.

టి.రవికుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌

Updated Date - 2022-01-20T05:28:06+05:30 IST