శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ తరహాలో కానిస్టేబుల్‌ పృధ్వీరాజ్‌

ABN , First Publish Date - 2021-08-02T06:25:14+05:30 IST

శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ తరహాలో కానిస్టేబుల్‌ పృధ్వీరాజ్‌

శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ తరహాలో కానిస్టేబుల్‌ పృధ్వీరాజ్‌

 పోలీసు అంటూ తల్లి, భార్యకు బురిడీ

గుట్టురట్టు చేసిన నున్న పోలీసులు

పాయకాపురం, ఆగస్టు 1: శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ సినిమాలో కథానాయకుడు డాక్టర్‌నంటూ తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తాడు. మెడలో స్టెతస్కోప్‌ వేసుకుని ఒక ఆసుపత్రిని సృష్టించి పెళ్లి చూపులకు వెళతాడు. అదే కోవలో తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి చెందిన వ్యక్తి తాను పోలీసునంటూ 4 ఏళ్లుగా నమ్మబలికాడు. రోజూ పోలీసు యూనిఫాం వేసుకుని డ్యూటీకి వెళుతున్నానంటూ కుటుంబ సభ్యులను, భార్యని, బంధువులని, అత్తింటి వారిని ఏమార్చాడు. చివరికి ఇతను పోలీసు కాదని, నకిలీ పోలీసు అని నున్న రూరల్‌ పోలీసులు ఆదివారం బట్టబయలు చేశారు. వివరాల ప్రకారం.. రొయ్యూరు గ్రామానికి చెందిన లుక్కా పృధ్వీరాజ్‌(25) 2017లో పోలీసు సెలక్షన్‌కు వెళ్లాడు. అక్కడ పరిస్థితి తారుమారై ఉద్యోగానికి అనర్హుడయ్యాడు. తన తల్లి కోర్కెను నెరవేర్చాలని పోలీసు అవతారం ఎత్తాడు. సెలక్షన్స్‌లో ఎంపికయ్యానని పోలీసు ఉద్యోగం సాధించానని ఆమెను నమ్మబలికాడు. ఆమె సంతృప్తి కోసం నిత్యం ఖాకీ దుస్తులు ధరించాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అతనికి పెళ్లి చేశారు. నున్న శివారుల్లో కోళ్ల ఫారం నిర్వహిస్తూ తల్లి, భార్యను ఉద్యోగానికి వెళుతున్నానని నమ్మించాడు. అయితే ఆదివారం ఇతని డ్రామాకు నున్న పోలీసులు తెరపదింపారు. ఆదివారం సాయంత్రం పైపుల రోడ్డు ప్రాంతంలో నున్న రూరల్‌ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. పాయకాపురం వైపు నుంచి నగరంలోకి ఒక వ్యక్తి పోలీసు యూనిఫాంలో వెళుతుండటాన్ని గమనించారు. అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో గట్టిగా ప్రశ్నించారు. దీంతో అతను నకిలీ పోలీసు అని బట్టబయలైంది. విచారించగా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి చెందిన లుక్కా పృధ్వీరాజ్‌ తెలిసింది. తన బంధువులు, స్నేహితుల వద్ద పోలీసు ఉద్యోగం వచ్చిందని చెప్పుకుంటూ యూనిఫాంలో తిరుగుతున్నట్లు తేలింది. నున్నలో కోళ్ల ఫాం నడుపుతూ నిత్యం యూనిఫాంలో ఇంటి వద్ద నుంచి వచ్చి వెళ్తుంటాడని తేలింది. పృధ్వీరాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేవలం యూనిఫాంలో తిరుగుతున్నాడా? లేక  వసూళ్లకు పాల్పడుతున్నాడా అనే విషయమై ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2021-08-02T06:25:14+05:30 IST