Abn logo
Jan 26 2021 @ 00:24AM

విలువల పరిరక్షణకు దుర్గాప్రసాద్‌ ఎనలేని కృషి

నాగళ్ల సంస్మరణ సభలో ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ శ్రీనివాస్‌

  

తెనాలి, జనవరి 25, (ఆంధ్రజ్యోతి): మారుతున్న కాలంతోపాటు విలువలు దిగజారిపోవటం మంచిదికాదని ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు. పాత విలువల కొనసాగింపుకూడా ఉండాలన్నారు. అటువంటి వాటిని గుర్తుచేసే ఆలోచన, దానికోసం పరితపించే మనుషులు మనకు అవసరం ఉందని, దీనిని దుర్గాప్రసాద్‌ తీర్చారని పేర్కొన్నారు. అటువంటి సేవలు కేవలం ఒక ప్రాంతానికే కాకుండా, సాహిత్య లోకానికి అటువంటివారు అవసరమన్నారు. కొల్లూరు మండలం అనంతవరంలో ప్రజ్వలిత వ్యవస్థాపకుడు నాగళ్ళ దుర్గాప్రసాద్‌ సంస్మరణ సభ సోమవారం జరిగింది. ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తొలుత దుర్గాప్రసాద్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. తర్వాత జరిగిన సభలో ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలుగు సాహిత్యం, సాంస్కృతిక ఉన్నతికి ఒకే ప్రాంతం నుంచి వికాసం రావటం చిన్న విషయం కాదని, ఎందరో గొప్ప మహనీయులు సాహిత్యాభివృద్ధికి కృషిచేశారని తెలిపారు. అటువంటి వారిలో ఒకరిగా కాకుండా గొప్ప మనీషిగా నాగళ్ల దుర్గాప్రసాద్‌కు ప్రత్యేకస్థానం ఉంటుందని అన్నారు. ఆయనకు సాహిత్యాభిలాష ఎక్కువగా కలగటానికి తెనాలి ప్రాంతం దోహదపడిందని అభిప్రాయపడ్డారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ మాట్లాడుతూ తెనాలి ప్రాంతానికి దుర్గాప్రసాద్‌ చేసిన కళాపరమైన సేవలు ఎనలేనివన్నారు. ఎమ్మెల్సీ, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న మాట్లాడుతూ దుర్గాప్రసాద్‌ వంటి కళాపిపాసులు అరుదుగా ఉంటారని, అటువంటి వ్యక్తి తక్కువకాలంలోనే లేకుండాపోవటం బాధాకరమన్నారు. ప్రముఖ రచయిత ఖాదర్‌ మొహిద్దీన్‌ మాట్లాడుతూ కళాకారుల్లోనే అనేక రంగాలవారుంటే, అందరినీ ఒకేతాటిపైకి తీసుకువచ్చి, వారి ఔన్నత్యానికి ఆయన కృషిచేశారన్నారు. వాసిరెడ్డి నవీన్‌ మాట్లాడుతూ ఒక రచయిత, నటుడు, కవి వంటివారు వారి రంగాల్లోనే తోటివారి అభ్యున్నతికి కృషిచేస్తే, నాగళ్ల మాత్రం అన్ని రంగాల కళాకారులను సమానంగా ఆదరించారన్నారు. సుధ మాట్లాడుతూ మంచి సోదరుడిని కోల్పోవటం బాధను కలిగించిందన్నారు. ప్రజానాట్యమండలి సీనియర్‌ నాయకులు నల్లూరి వెంకటేశ్వర్లు, అరసం జాతీయ కార్యదర్థి పెనుగొండ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే, భారతీయం వ్యవస్థాపకులు ఈదర హరిబాబు మాట్లాడుతూ మరుగున పడిపోతున్న ఎందరో కళాకారులను గుర్తుచేసేలా పునరావలోకనాన్ని ప్రారంభించటం వంటి కార్యక్రమాలు తమకు స్ఫూర్తిదాయమకన్నారు. సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌ మాట్లాడుతూ దుర్గాప్రసాద్‌ చేసిన సేవలకు గుర్తుగా కళల కాణాచి తరఫున ఒక పుస్తకాన్ని తీసుకురావాలని నిర్ణయించామన్నారు. తెలుగు నాటక అకాడమీ మాజీ చైౖర్మన్‌ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ వృద్ధ కళాకారులకు పింఛన్‌లు ఇప్పించేందుకు ఆయన పడిన తపన మర్చిపోలేమన్నారు. మరికొందరు కవులు, రచయితలు మొవ్వా శ్రీనివాసరావు, ఆచంట బాలాజీ నాయుడు, కోట పురుషోత్తం, రమణచంద్ర, ప్రసేన్‌, ఆముదాల మురళి, వేణుగోపాల్‌రెడ్డి, శాఖమూరి రామ్‌గోపాల్‌, బాలచందర్‌, న్యాయవాది జె.ఎస్‌.ఆర్‌ కృష్ణయ్య, మేరుగ రామలింగేశ్వరుడు, దేవిశెట్టి కృష్ణారావు, సత్యన్నారాయణశెట్టి, ఐనాల మల్లేశ్వరరావు, జానీబాషా తదితరులు దుర్గాప్రసాద్‌ గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. దుర్గాప్రసాద్‌కు ఇటీవలే కిడ్నీ సమస్య వచ్చినప్పుడు అర్ధాంగిగా తన కిడ్నీని అందించిన భార్య రాజేశ్వరి ఎదరికో ఆదర్శమంటూ కొనియాడారు.

Advertisement
Advertisement
Advertisement