Abn logo
Oct 15 2021 @ 01:47AM

దసరా సరదాలకు సిద్ధం

సిరిసిల్లలో రామ్‌లీల

- వైభవోపేతంగా దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు

- పల్లె పల్లెన శమీపూజలకు ఏర్పాట్లు

- మార్కెట్‌లో కొనుగోళ్ల సందడి

- నేడు దసరా

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) 

దసరా సరదాలు చైతన్య శక్తిని కలిగించడమే కాకుండా ఆధ్యాత్మిక సాధనలో జీవితాలను మలుపు తిప్పుతాయి. చెడును తొలగించి మంచిని వెలిగించే విధిగా దసరా పండుగను జరుపుకుంటారు. దుర్గామాత మహిశసురుడనే రాక్షసున్ని సంహరించి లోకానికి మేలు కలిగించిందని గుర్తుగా ఒకవైపు, రాముడు రావణ సంహారం చేసినందుకు గుర్తుగా మరోవైపు విజయదశమిని జరుపుకుంటారు. విజయాలకు ప్రతీకగా దసరాను వైభవంగా జరుపుకోవడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తొమ్మిది రోజుల పాటు సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పార్వతి అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. రోజుకో అవతార అలంకరణలో పూజలు నిర్వహించారు. ధర్మగుండంలో అమ్మవారి తెప్పోత్సవం ఘనంగా జరిపారు.మండల, పల్లెల్లో అమ్మవారి మండపాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. శుక్రవారం అమ్మవారి శోభాయాత్రలో సాయంత్ర వేళ శమీ దర్శనం, శమీ పూజలకు జమ్మిచెట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫ్యాక్టరీల్లో, వృత్తి పనివారు అయుధాలకు బదులుగా తమ పరికరాలతో పూజలు నిర్వహిస్తారు. కొత్త వ్యాపారాలు, పనులు, దుకాణాలు, ప్రారంభించుకోవడానికి విజయదశమి రోజుకు ప్రాధాన్యం ఇస్తారు. విజయదశమి రోజు ప్రారంభోత్సవాల వల్ల అన్నింటా విజయాలు లభిస్తాయని ప్రజల నమ్మకం. 

నవదుర్గలుగా రాజరాజేశ్వరి అమ్మవారు

 వేములవాడ  శ్రీ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో  శరన్నవరాత్రుల్లో శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారు నవదుర్గల రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలిరోజు శైలపుత్రిగా, రెండవ రోజు బ్రహ్మచారిణిగా, మూడవ రోజు చంద్రఘంట రూపంలో, నాల్గవ రోజు కూష్మాండ అవతారంలో, ఐదవ రోజు స్కందమాత రూపంలో, ఆరవ రోజు కాత్యాయనిగా, ఏడవ రోజు కాళరాత్రి రూపంలో, ఎనిమిదవ రోజు మహాగౌరి అలంకారంలో, తొమ్మిదవ రోజు సిద్దిదా అలంకారం అమ్మవారు దర్శనమిస్తారు. దసరా రోజున మహాలక్ష్మిగా పూజలందుకుంటారు. అమ్మవారి రూపాలైన మహంకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతి, బాలాత్రిపురసుందరీదేవి, రాజరాజేశ్వరీ అమ్మవార్లలో ఒకరైన రాజరాజేశ్వరీ అమ్మవారు కొలువై ఉన్న క్షేత్రం కావడంతో శ్రీశరన్నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేకతగా భావిస్తారు. మరోవైపు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ సప్తమాతృకలలోని వారాహి రూపం కూడా అమ్మవారిలో నిక్షిప్తమై ఉన్నది. ఆలయ ఆవరణలోనే బాలాత్రిపురసుందరీదేవి, ఆలయం వెనుకవైపు మహిషాసురమర్ధినీ అమ్మవారు కొలువై ఉన్నారు. దీంతో దుర్గాష్టమి రోజున మహిషాసురమర్దినీ అమ్మవారికి మహాపూజ నిర్వహిస్తారు. కాశీ క్షేత్రంలోని అన్నపూర్ణదేవి ప్రతిరూపం వేములవాడ  క్షేత్రంలో ఉందని, అదే కారణంగా ఈ క్షేత్రానికి దక్షిణ కాశీగా పేరువచ్చిందని ప్రతీతి. 

మార్కెట్‌లో దసరా కొనుగోళ్లు

విజయదశమి సందర్భంగా మార్కెట్‌కు ప్రత్యేక శోభ వచ్చింది. ప్రజలు ఇంట్లోకి అవసరమయ్యే వస్తువులతో పాటు వాహనాలు కొనుగోళ్లు చేస్తున్నారు. దసరాకు కావాల్సిన కొత్త బట్టల కోసం షాపింగ్‌మాళ్లు, దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఎలకా్ట్రనిక్‌ వస్తువులు, గృహోపకరణాలు, వాషింగ్‌ మెషిన్లు, సెల్‌ఫోన్‌లు, ఫ్రిజ్‌ల అమ్మకాలు కూడా పెరిగాయి. దుకాణదారులు వినియోగదారులను అకట్టుకోవడానికి ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నారు. కొన్ని దుకాణ దారులు లక్కీడీ్‌పలను ఏర్పాటు చేశారు. 

నేడు రామ లీల

దుర్గా మాత మహిశాసురుడనే రాక్షసున్ని సంహరించి లోకానికి మేలు కలిగించిందని గుర్తుగా ఒకవైపు, రాముడు రావణ సంహారం చేసినందుకు గుర్తుగా మరోవైపు విజయదశమి జరుపుకుంటారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా రామలీల కార్యక్రమాలను నిర్వహిస్తారు. అందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సిరిసిల్ల మానేరు తీరంలో రామలీల కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించనున్నారు.