కరోనా వ్యాక్సిన్‌ సమాచారానికీ ఈ-విన్‌

ABN , First Publish Date - 2020-09-21T07:46:37+05:30 IST

దేశంలో వ్యాక్సిన్ల సమాచారాన్ని రియల్‌ టైమ్‌ లో తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ‘ఎలకా్ట్రనిక్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌(ఈవిన్‌)’నే కరోనా వ్యాక్సిన్‌ సమాచారానికి వినియోగిస్తామని కేంద్ర మంత్రి అశ్వనీకుమార్‌ చౌబే తెలిపారు...

కరోనా వ్యాక్సిన్‌ సమాచారానికీ ఈ-విన్‌

  • సెప్టెంబరు 18 నాటికి 6.17 కోట్ల మందికి టెస్టులు
  • రాజ్యసభలో కేంద్ర మంత్రి అశ్వనీకుమార్‌ వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: దేశంలో వ్యాక్సిన్ల సమాచారాన్ని రియల్‌ టైమ్‌ లో తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ‘ఎలకా్ట్రనిక్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌(ఈవిన్‌)’నే కరోనా వ్యాక్సిన్‌ సమాచారానికి వినియోగిస్తామని కేంద్ర మంత్రి అశ్వనీకుమార్‌ చౌబే తెలిపారు. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాక.. దేన్ని ఎంపిక చెయ్యాలి, తొలుత ఎవరికివ్వాలి, పంపిణీ వ్యవస్థ, నిల్వ ఏర్పాట్లు తదితర అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు జాతీయస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామన్నారు.


దేశంలో కరోనా వ్యాప్తి, పీపీఈ కిట్లు, వెం టిలేటర్ల లభ్యత తదితర అంశాలపై పలువురు ఎంపీల ప్రశ్నలకు మంత్రి లిఖిత పూర్వక సమాధానాలిచ్చారు. వ్యాక్సిన్‌కు సంబంధించి ఏ విదేశీ సంస్థతోనూ భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోలేదని చెప్పారు. దేశంలో 7 సంస్థలకు ప్రీక్లినికల్‌ టెస్టుల నిమిత్తం కొవిడ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తికి అనుమతు లు ఇచ్చినట్టు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ వెల్లడించిందని మంత్రి తెలిపారు. వాటిలో భారత్‌ బయోటెక్‌, క్యాడిలా హెల్త్‌కేర్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు సురక్షితమైనవని తొలి దశ ప్రయోగాల్లో తేలినట్టు చౌబే చెప్పారు. అవి రెండో దశ ప్రయోగాల్లో ఉన్నాయన్నారు. దేశంలో వివిధ దశల్లో ఉన్న 30వ్యాక్సిన్‌ కేండిడేట్లకు ప్రభుత్వం మద్దతునిస్తోందని చెప్పారు.


పీపీఈ కిట్లు, వెంటిలేటర్లకు కొరత లేదు

పీపీఈ కిట్లు, వెంటిలేటర్లకు కొరత లేదని చౌబే తెలిపారు. దేశంలో ప్రతి 1000 మందికి 1.16 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 15,403 కొవిడ్‌ చికిత్సా కేంద్రాలు, 15,54,022 ఐసోలేషన్‌ బెడ్లు, 63,758 ఐసీయూ బెడ్లు, 2,32,505 ఆక్సిజన్‌ బెడ్లు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రాలకు 3.44 కోట్ల ఎన్‌95 మాస్కులు, 1.41కోట్ల పీపీఈ కిట్లు, 10.84 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లు, 30,796 వెంటిలేటర్లు, 1,02,400 ఆక్సిజన్‌ సిలిండర్లను సరఫరా చేశామన్నా రు. ఇక.. ఇతర దేశాలతో పోలిస్తే.. కొవిడ్‌ కేసులు, కరోనా మరణాల సంఖ్య మన దేశంలోనే తక్కువని చౌబే వెల్లడించారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేం దుకు రాష్ట్రాలకు కేంద్రం సాయం చేస్తోందని తెలిపారు. ఫలితంగా కేసుల వేగం తగ్గిందన్నారు. హెర్డ్‌ ఇమ్యూనిటీ (సమాజంలో ఎక్కువ మందికి వైరస్‌ సోకడం వల్ల వచ్చే నిరోధకశక్తి) దిశగా ఆలోచిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని మరో ప్రశ్నకు సమాధానంగా చౌబే చెప్పారు. కాగా, దేశవ్యాప్తంగా 1768 ల్యాబుల్లో రోజూ 10 లక్షలకు పైగా నమూనాలకు పరీక్షలు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. సెప్టెంబరు 18 నాటికి 6.17 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేసినట్టు వెల్లడించారు. ఆగస్టు నెలలోనే 2.39 కోట్ల టెస్టులు చేశామన్నారు. అందులో 1.24 కోట్లు యాంటీజెన్‌ టెస్టులని వెల్లడించారు. జూలైలో 1.05 కోట్లు, జూన్‌లో 49.93 లక్షలు, మేలో 29.37 లక్షలు, ఏప్రిల్‌లో 8.64లక్షలు, మార్చిలో 33,330 పరీక్షలు చేసినట్టు వివరించారు. ఇక.. దేశంలో ఎన్ని ప్లాస్మా బ్యాంకులు ఉన్నాయన్న ప్రశ్నకు తమ వద్ద సమాచారం లేదని తెలిపారు.


Updated Date - 2020-09-21T07:46:37+05:30 IST