నేడే భూమిపూజ

ABN , First Publish Date - 2020-08-05T07:19:34+05:30 IST

ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బుధవారం మధ్యాహ్నం భూమిపూజ

నేడే భూమిపూజ

  • ముహూర్తం మధ్యాహ్నం 12.44 గంటలు
  • రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా 40 కిలోల వెండి ఇటుక స్థాపన
  • 32 సెకన్లలో క్రతువు పూర్తి
  • సర్వాంగ సుందరంగా అయోధ్య
  • దేవాలయాలన్నీ కళకళ
  • కరోనా ఆంక్షలతో వేదిక రూపకల్పన
  • భౌతిక దూరంగా ఉండేలా సీట్లు
  • బయటివారికి ప్రవేశం లేదు
  • స్థానికులు చూసేందుకు భారీ స్ర్కీన్లు
  • కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు


అయోధ్య, ఆగస్టు 4: ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బుధవారం మధ్యాహ్నం భూమిపూజ జరుగనుంది. ప్రధాని మోదీ స్వయంగా హాజరై.. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించనున్నారు. తద్వారా ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 44 నిమిషాల 40 సెకన్లదాకా.. అంటే 32 సెకన్లలోపు ఈ కార్యక్రమం పూర్తవుతుంది. శంకుస్థాపనకు సకలసన్నాహాలు పూర్తయ్యాయి. సోమవారమే మొదలైన పూజలు.. భూమిపూజతో బుధవారం మధ్యాహ్నం పూర్తవుతాయి. శంకుస్థాపనకు ఎలాంటి అవరోధాలు కలగకుండా 12 మంది పురోహితులు విఘ్నేశ్వరుడికి పూజాదికాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు 21 మంది పురోహితులు వేద పఠనం ఆరంభించారు. రామాచార్య పూజ చేశారు. రుతుపవనాల ప్రభావంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయోధ్య ప్రాంతంలోనూ కురుస్తాయన్న సమాచారంతో రామజన్మభూమి ప్రాంతంలో భారీ రెయిన్‌ ప్రూఫ్‌ టెంట్‌ వేశారు. భూమిపూజ జరిగే ప్రధాన స్థలం వెనుక భారీ టీవీ స్ర్కీన్‌ ఏర్పాటు చేశారు. జరిగే క్రతువునంతా దాని ద్వారా చూడవచ్చు. ప్రధాని మోదీ, ఆర్‌ఎ్‌సఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ పేరు, అనంతరం యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌, శ్రీరామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు చైర్మన్‌ మహంత నృత్యగోపాల్‌ దాస్‌, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పేర్లు ప్రదర్శిస్తారు. కరోనా నేపథ్యంలో బీజేపీ వృద్ధ నేతలు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీ అయోఽధ్యకు రావడం లేదు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారు ఈ కార్యక్రమాన్ని తిలకిస్తారు. కాగా.. రామజన్మభూమి ప్రాంతంలో అతిథుల కోసం భారీ వేదికను నిర్మించారు. వేదికపై పై ఐదుగురే ఆసీనులవుతారు. భౌతిక దూరం పాటిస్తూ 175 మంది ఆహూతులు కూర్చునేలా కుర్చీలు, శంకుస్థాపనను తిలకించేందుకు ఎల్‌సీడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. 


తొలుత హనుమాన్‌గఢీలో ప్రధాని పూజలు..

మోదీ బుధవారం ఉదయం 9.35కి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయల్దేరి లఖ్‌నవూ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అయోధ్య చేరుకుంటారు. తొలుత హనుమాన్‌గఢీ ఆలయంలో పూజలు చేస్తారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు గద, కిరీటం, వెండి ఇటుక బహూకరిస్తారు. అనంతరం మోదీ రామ్‌లల్లా విగ్రహాన్ని సందర్శించి భూమిపూజ జరిగే చోటుకు చేరుకుంటారు. నిర్ణయించిన ముహూర్తానికి వెండి ఇటుకను ప్రతిష్ఠిస్తారు. శంకుస్థాపన ఫలకను ఆవిష్కరిస్తారు. రామాలయం నమూనాపై ఐదు రూపాయల స్టాంపును కూడా విడుదల చేస్తారు. అనంతరం ట్రస్టు సభ్యులతో చర్చిస్తారు. తిరిగి బయల్దేరి 2.20 గంటలకు లఖ్‌నవూ చేరి.. అక్కడి నుంచి ఢిల్లీ పయనమవుతారు. కార్యక్రమానికి పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. 


అమెరికాలో భారతీయుల సందడి..

శంకుస్థాపనను పురస్కరించుకుని అమెరికాలోని భారతీయ అమెరికన్లు కూడా వేడుకలు జరుపుకొంటున్నారు. వాషింగ్టన్‌ డీసీలో రామాలయం నమూనా ఉన్న శకటాన్ని బుధవారం ఊరేగించనున్నారు. ఇది కేపిటల్‌ హిల్‌, వైట్‌హౌ్‌సల మీదుగా వెళ్తుంది.


పద్మశ్రీ షరీఫ్‌ చాచాకూ ఆహ్వానం

పద్మశ్రీ షరీఫ్‌ చాచా అలియాస్‌ మొహమ్మద్‌ షరీ్‌ఫను కూడా భూమిపూజకు ఆహ్వానించారు. సైకిల్‌ మెకానిక్‌ అయిన 82 ఏళ్ల షరీఫ్‌.. గత 27 ఏళ్లలో వందల అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మానవతావాదికి ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు లభించింది. అయితే తన తండ్రి భూమిపూజకు వెళ్లేది అనుమానమేనని ఆయన కుమారుడు సగీర్‌ చెప్పారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ప్రస్తుతం అలా్ట్ర సౌండ్‌ టెస్టులు జరుగుతున్నాయి. 


‘రావణ’ జన్మభూమిలో సంబరం

అయోధ్యకు 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిస్రఖ్‌లో రావణాసురుడి ఆలయం ఉంది. దీన్ని రావణ జన్మభూమి అని కూడా అంటారు. ఆ ఆలయ పూజారి మహంత్‌ రామదాస్‌. రామాలయానికి భూమిపూజ జరుగుతుండడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం తాను మిఠాయిలు పంచిపెడతానని చెప్పారు. ముస్లింలకు కాబా ఎంత పవిత్రమైందో... హిందువులకు రామ జన్మభూమి కూడా అంతే పవిత్రమైందని అయోధ్యలోని ముస్లింలు పేర్కొంటున్నారు. రామ మందిర నిర్మాణంపై హిందువుల్లో ఎంత ఆసక్తి నెలకొందో... స్థానిక ముస్లింలలోనూ అదే స్థాయిలో ఆశలు రేకెత్తుతున్నాయి. అయోధ్యలో గుడి చుట్టూ సుమారు 500 కుటుంబాలు ఉండగా అందులో 120 వరకూ ముస్లిం కుటుంబాలున్నాయి. రామ మందిర నిర్మాణంతో తమ జీవితాలు కూడా బాగుపడతాయని ఎందరో ముస్లింలు అంటున్నారు.  కాగా.. అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమిపూజ సందర్భంగా కోతుల బెడద సహా ఏ విధమైన ఆటంకాలూ సంభవించకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.


అందరికీ రామ్‌, రాష్ట్ర, రోటీ : కేశవ్‌ మౌర్య

రామ్‌ (శ్రీరాముడు), రాష్ట్ర (దేశం), రోటీ (ఆహారం)తోనే అందరి జీవితాలు పరిపూర్ణమవుతాయని ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య వ్యాఖ్యానించారు. అయోధ్యలో నిర్మించే రామ మందిరం దేశ ఐక్యతకు ప్రతిరూపంగా ఉండడమే కాకుండా దానిని మరింత పెంచుతుందని అన్నారు.


ఇది చరిత్రాత్మక దినం: ఆడ్వాణీ

రామమందిర నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న రోజు తనకు, భారతీయులకూ చరిత్రాత్మక దినమని బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే ఆడ్వాణీ పేర్కొన్నారు. 1990లో సోమనాథ్‌ నుంచి అయోధ్యకు తాను నిర్వహించిన రథయాత్రను ‘కీలకమైన విధి’గా ఆయన అభివర్ణించారు. రామమందిరం భారత్‌ను బలమైన, ఐకమత్య దేశంగా ప్రతిబింబింపజేస్తుందని అన్నారు.



Updated Date - 2020-08-05T07:19:34+05:30 IST