Abn logo
Sep 14 2021 @ 00:54AM

అమ్మఒడిలోనూ.. భారీగా ఏరివేతలు!

అమ్మఒడి.. కోతల సుడి

జిల్లాలో అమ్మఒడి పథకం లబ్ధిదారులపై కోతల కత్తి

ఎక్కడికక్కడ నిబంధనల పేరుతో ఎడాపెడా జాబితాల కుదింపు

అర్హులపై వడపోత ప్రక్రియ ప్రారంభించిన జిల్లా విద్యా శాఖ

మొత్తం 15వేల మందికిపైగా లబ్ధిదారులను తొలగించడానికి కసరత్తు

మండలాల వారీగా ఏరివేతలో తొలిరోజు 40 మంది అనర్హుల గుర్తింపు 

వీరిలో ఎక్కువ మంది హోంగార్డులు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులుగా గుర్తింపు


(ఆంధ్రజ్యోతి, కాకినాడ): సంక్షేమ పథకాల అమలు భారం నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. ఇప్పటికే నిబంధనల పేరుతో జిల్లాలో వేలాది వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్లు కత్తిరించేసిన సర్కారు ఇప్పుడు అమ్మఒడి పథకంపై కన్నేసింది. ఈ పథకంలోనూ వేలాదిమందిని కత్తిరించడానికి అడుగులు మొదలుపెట్టింది. అందుకోసం జిల్లా విద్యా శాఖను రంగంలోకి దించి ఏరివేత ప్రారంభించింది. నిబంధనల సాకుతో అర్హుల జాబితాను భారీగా తగ్గించడానికి ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. దాదాపు 15వేల మంది పేర్లను తీసేయబోతోంది. సోమవారం నుంచి ఏరివేత ప్రక్రియ మొదలుపెట్టగా తొలిరోజే 40 మంది అనర్హులను గుర్తించారు. వీరంతా హోంగార్డులు, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులుగా పనిచేస్తూ వారి  పిల్లల పేర్లతో అడ్డంగా లబ్ధి పొందినట్టు తేల్చారు. 


నవరత్నాలు పేరుతో సంక్షేమ పథకాలను ప్రతీ ఒక్కరికీ అందిస్తామని, కుంటిసాకులు చెప్పి లబ్ధిదారులకు అన్యాయం చేయబోమని పదేపదే చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఒకపక్క ఆర్థిక కష్టాలు.. మరోపక్క పథకాలకు చెల్లింపుల భారంతో లబ్ధిదారుల జాబితాలకు కోతలు భారీగా పెడుతోంది. సాధ్యమైనంత ఎక్కువ మందిని పథకాల ప్రయోజనం నుంచి తప్పించడానికి ఎత్తుగడలు వేస్తోంది. అందులో భాగంగా వయసు వ్యత్యాసాలు, పేర్లలో తప్పులు.. సరైన ధ్రువీకరణ పత్రాలు లేవనే కారణంతో జిల్లావ్యాప్తంగా 17వేల మందికిపైగా వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల పెన్షన్లను ఇప్పటికే కోసేసింది. వీరందరికీ సెప్టెంబరు నుంచి డబ్బుల పంపిణీ నిలిపివేసింది. దీంతో వారంతా లబోదిబోమంటున్నారు. ఒకపక్క ఇది కొనసాగుతుండగా.. ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ అమ్మఒడి పథకంపై కన్నేసింది. ఇందులోనూ భారీగా ఏరివేతలు చేపట్టి ఆర్థిక భారం తగ్గించుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. అందుకోసం జిల్లా విద్యాశాఖ సోమవారం నుంచి మండలాల వారీగా అర్హుల జాబితా వడపోతకు శ్రీకారం చుట్టింది.


వారం పాటు కొనసాగనున్న ఈ ప్రక్రియలో సాధ్యమైనంత ఎక్కువ మంది లబ్ధిదారులను ఏరిపారేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో అమ్మఒడి పథకం కింద జిల్లాలో 2.24లక్షల మంది తల్లుల ఖాతాలో ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున ప్రభుత్వం నగదు జమ చేసింది. తిరిగి వచ్చే ఏడాది జనవరికి బ్యాంకు ఖతాల్లో మళ్లీ డబ్బు జమచేసే సమయం ఆసన్నమవుతుండడంతో ఈలోపు తల్లుల జాబితాను గణనీయంగా తగ్గించడానికి నిర్ణయించింది. అందుకోసం మండలాల వారీగా జాబితాను రాష్ట్రప్రభుత్వం ఆర్‌టీజీఎస్‌ డేటాను జిల్లా విద్యా శాఖకు పంపింది. ఇప్పుడు ఈ జాబితాను విద్యా శాఖ తమ వద్దనున్న విద్యార్థులు, వారి కుటుంబ వివరాల జాబితాతో సరిపోల్చుతోంది.


విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? వారి ఆదాయ వివరాలేంటి? వృత్తి? ఇతర వివరాలతో కూడిన జాబితాను ప్రభుత్వం పంపిన జాబితాతో పోల్చి చూస్తున్నారు. ఇలా చేయడం ద్వారా పిల్లల తల్లులకు సంబంధించిన కుటుంబ సమాచారం వెల్లడవుతోంది. తద్వారా వీరిలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వ్యాపారులెవరు? గతేడాది పథకంలో ఒక కుటుంబంలో ఓ తల్లి ఇద్దరు పిల్లలపై డబ్బులు ఎందరు తీసుకున్నారు? వంటి వివరాలన్నీ బయటపడుతున్నాయి. ఒకవేళ వివరాలేవీ సరిపోకపోతే ఆ తల్లుల వివరాలను ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేయనున్నారు. తద్వారా అర్హుల జాబితాను కుదించనున్నారు.