లెక్కలు చూపని అభ్యర్థులపై ఈసీ కొరడా

ABN , First Publish Date - 2021-01-08T06:13:13+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చు లెక్క చూపని అభ్యర్థులపై ఎన్నికల కమిషన్‌ కొరడా ఝళిపించంది. నిబంధనల ప్రకారం ఎన్నికలు ముగియగానే పోటీ చేసిన అభ్యర్థులంతా గెలిచినా, ఓడినా ఈసీకి ఎన్నికల ఖర్చు లెక్కలు ఇవ్వాలి. అయితే లెక్కలు ఇవ్వకుండా ముఖం చాటుతూవస్తున్న గెలిచిన అభ్యర్థులపై ఈసీ అనర్హత వేటు వేయగా, ఓడిన అభ్యర్థులు ఇకపై జరిగే ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించింది.

లెక్కలు చూపని అభ్యర్థులపై ఈసీ కొరడా

ఉమ్మడి జిల్లాలో 870 మంది వార్డు సభ్యులపై అనర్హత వేటు

లబోదిబోమంటున్న స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు

మోత్కూరు, జనవరి 7: స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చు లెక్క చూపని అభ్యర్థులపై ఎన్నికల కమిషన్‌ కొరడా ఝళిపించంది. నిబంధనల ప్రకారం ఎన్నికలు ముగియగానే పోటీ చేసిన అభ్యర్థులంతా గెలిచినా, ఓడినా ఈసీకి ఎన్నికల ఖర్చు లెక్కలు ఇవ్వాలి. అయితే లెక్కలు ఇవ్వకుండా ముఖం చాటుతూవస్తున్న గెలిచిన అభ్యర్థులపై ఈసీ అనర్హత వేటు వేయగా, ఓడిన అభ్యర్థులు ఇకపై జరిగే ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించింది. దీంతో లక్షలు ఖర్చుచేసి గెలిచిన పంచాయతీ వార్డు సభ్యులు లబోదిబోమంటున్నారు.

నిబంధనలు ఇలా..

స్థానిక సంస్థలకు చెందిన పంచాయతీ ఎన్నికలు 2019 జనవరిలో జరిగా యి. ఐదు వేలకుపైబడిన జనా భా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థి రూ.2.50లక్షలు, వార్డ్‌ మెంబర్‌ అభ్యర్థి రూ.50వేలు మాత్రమే ఖర్చు చేయాలి. అదేవిధంగా, ఐదు వేలలోపు జనాభా ఉన్న పంచాయతీ ల్లో సర్పంచ్‌ అభ్యర్థి రూ. 1.50లక్షలు, వార్డ్‌ అభ్యర్థి రూ.30వేలు దాటకుండా ఖర్చు చేయాలి. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే పోటీ చేసిన అభ్యర్థులంతా గెలిచినా, ఓడినా సంబంధం లేకుండా ఖర్చు లెక్కలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలి.


870 మందిపై అనర్హత వేటు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2019 జనవరిలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు మాత్రం సేఫ్‌గా ఉండగా ఎన్నికల ఖర్చుచూపని కారణంగా 870 మంది వార్డు సభ్యుల (ఉపసర్పంచులతో కలిపి)పై అనర్హత వేటు పడింది. ఈసీ అనర్హత వేటు కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐదుగురు ఉపసర్పంచులు, 62 మంది వార్డు సభ్యులు పదవులను కోల్పోయారు. బీబీనగర్‌ మండలంలోని జియాపల్లె, జియాపల్లి తండా పంచాయతీల్లో మొత్తం వార్డు సభ్యులు పదవులు కోల్పోయారు. ఇదే మండలంలో 43 మంది, అడ్డగూడూరులో 14 మంది, మోత్కూరులో ఆరుగురు, సంస్థాన్‌నారాయణపురంలో నలుగురు పదవులు కోల్పోయారు. నల్లగొండ జిల్లాలో 635 మంది వార్డు సభ్యులపై అనర్హత వేటుపడింది. గుర్రంపోడు మండలంలో 118 మంది, చండూరులో 69, చింతపల్లిలో 29, దేవరకొండలో 71, గరిడెపల్లిలో 78, కట్టంగూరులో 31, కేతెపల్లిలో ఇద్దరు, కొండమల్లేపల్లిలో 37, మర్రిగూడలో 45, మిర్యాలగూడలో 34, మునుగోడులో 30, నకిరేకల్‌లో ఏడుగురు, నల్లగొండలో ఇద్దరు, నార్కట్‌పల్లిలో 18, పెదఅడిశర్లపల్లిలో 18, తిప్పర్తిలో 32, వేములపల్లిలో 14 మంది వార్డు సభ్యులు పదవులు కోల్పోయారు. సూర్యాపేట జిల్లాలో 168 మంది వార్డు సభ్యులపై అనర్హత వేటు పడింది. గరిడేపల్లి మండలంలో 107 మంది, నూతనకల్‌లో 9, జాజిరెడ్డిగూడెంలో 26, ఆత్మకూరు(ఎ్‌స)లో 26 మంది వార్డు సభ్యులు పదవులు కోల్పోయారు. అనర్హత వేటు పడిన వార్డు సభ్యులు మరో మూడేళ్లవరకు ఎన్నికల్లో పోటీచేసేందుకు అనర్హులు. ఖాళీ అయిన వార్డు సభ్యుల స్థానాలకు ఈసీ తిరిగి ఎన్నికలు నిర్వహిస్తుందని జిల్లా పంచాయతీ అధికారులు తెలిపారు.


4908 మంది పోటీకి అనర్హులు

నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారిలో 501 మంది సర్పంచ్‌ అభ్యర్థులు, 4407 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల ఖర్చు చూపని కారణంగా మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ఈసీ ప్రకటించింది. అనర్హుల జాబితాలో యాదాద్రి జిల్లా నుంచి 117 మంది ఓడిన సర్పంచ్‌ అభ్యర్థులు, 1033 మంది వార్డు సభ్యులు, నల్లగొండ జిల్లాలో 384 మంది ఓడిన సర్పంచ్‌ అభ్యర్థులు, 3374 వార్డు సభ్యులు ఉన్నారు.


ఈసీ చర్య మంచిదే : అవిలిమల్లు, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు

ఎన్నికల ఖర్చు లెక్కలు చూపని అభ్యర్థులపై ఈసీ అనర్హత వేటు వేయడం మంచిదే. దీంతో ఇక ముందు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా లెక్కలు చూపిస్తారు. లెక్కలు ఇవ్వకపోయినా ఏమీ కాదన్న ధీమా అందరిలో తొలగిపోతుంది. అలాగే అభ్యర్థులు ఎన్నికల్లో పరిమితికి మించి చేసే ఖర్చుపై కూడా ఈసీ దృష్టిసారించాలి.

Updated Date - 2021-01-08T06:13:13+05:30 IST