విద్యా శాఖ వింత వైఖరి

ABN , First Publish Date - 2020-11-20T05:58:34+05:30 IST

ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతులకు విద్యార్థుల హాజరుపై విద్యా శాఖ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోంది.

విద్యా శాఖ వింత వైఖరి

9, 10 తరగతుల విద్యార్థుల హాజరుపై రెండు రకాల ఆదేశాలు

తల్లిదండ్రులు అంగీకారపత్రం తెస్తేనే స్కూల్‌కు రానివ్వాలని గతంలో ఉత్తర్వులు

కరోనా భయంతో ఇప్పటికీ 45 శాతం దాటని హాజరు

ఎక్కువ మంది గైర్హాజరుకు కారణాలు తెలుసుకోవాలని తాజాగా ఉత్తర్వులు

ఆ వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి

23 నుంచి 6, 7, 8 తరగతుల ప్రారంభంపై కొరవడిన స్పష్టత


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కరోనా ప్రభావం వున్నందున తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రం తీసుకువచ్చిన 9, 10 తరగతుల విద్యార్థులను పాఠశాలలకు అనుమతించాలి.

- ప్రధానోపాధ్యాయులకు పాఠశాల విద్యా శాఖ గతంలో జారీచేసిన ఆదేశాలు


పాఠశాలలకు విద్యార్థుల ఎందుకు హాజరుకావడం లేదో కారణాలు తెలుసుకుని ఆన్‌లైన్‌ ఫారంలో అప్‌లోడ్‌ చేయాలి. 

- పాఠశాల విద్యా శాఖ తాజాగా జారీచేసిన ఆదేశాలు


ఉన్నత పాఠశాలల్లో 9, 10 తరగతులకు విద్యార్థుల హాజరుపై విద్యా శాఖ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోంది. కరోనా ప్రభావం వున్నందున విద్యార్థుల రాకపై బలవంతం చేయవద్దని చెప్పిన ఉన్నతాధికారులు...తాజాగా విద్యార్థులు తరగ తులకు ఎందుకు హాజరుకావడం లేదో కారణాలు తెలుసుకుని వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఉత్తర్వులు జారీచేశారు. కరోనా ప్రభావంతో మూతపడిన పాఠశాలలను తిరిగి తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నించినప్పటికీ, వైరస్‌ ఉధృతి తగ్గకపోవడంతో వాయిదా వేస్తూ వచ్చింది. ఎట్టకేలకు నవంబరు రెండో తేదీ నుంచి ఉన్నత పాఠశాలలు తెరిచి, 9, 10 తరగతులకు బోధన చేపట్టాలని నిర్ణయించింది. అయితే పాఠశాలకు హాజరయ్యే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రం తీసుకోవాలని స్పష్టంచేసింది. దీంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపడానికి వెనుకంజ వేశారు. పాఠశాలలు తెరిచిన తరువాత తొలి వారంలో 30 నుంచి 35 శాతం విద్యార్థులు హాజరుకాగా, ప్రస్తుతం 45 శాతం మంది వస్తున్నారు. నగరంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతంలో హాజరు ఒకింత మెరుగ్గా ఉంది.


విద్యార్థులంతా ఎందుకు రావడం లేదు?

ఇదిలావుండగా 9, 10 తరగతుల విద్యార్థులు ఇప్పటికీ సగం మందికన్నా తక్కువ వస్తుండడంపై పాఠశాల విద్యా శాఖ సమీక్ష ప్రారంభించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసు కుంటున్నా...విద్యార్థులు పూర్తిస్థాయిలో ఎందుకు రావడం లేదో తెలుసుకోవాలని ఆదేశించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారి అభిప్రాయాలను నమోదుచేయాలని సూచించింది. దీంతో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఇతర ఉపాధ్యాయులు...స్కూళ్లకు రాని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు.కరోనా వైరస్‌ ప్రభావం పూర్తిగా తగ్గనందున పిల్లల్ని పాఠశాలకు పంపడం లేదని ఎక్కువమంది తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ పిల్లలను పాఠశాలకు పంపితే వారు కరోనా బారిన పడరని హామీ ఇస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్నిచోట్లా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఉపాధ్యాయులు ఈ వివరాలను ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. 


6, 7, 8 తరగతుల ప్రారంభంపై కొరవడిన స్పష్టత 

ఇదిలావుండగా ఈ నెల 23వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులు కూడా నిర్వహించడానికి విద్యా శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఆ రోజు నుంచి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని, దీంతో ఇబ్బందులు వస్తాయని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


పిల్లల హాజరుపై బలవంతం లేదు

- బి.లింగేశ్వరరెడ్డి, డీఈవో

పాఠశాలలకు 9,10 తరగ తుల విద్యార్థుల హాజరుపై బల వంతం లేదు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు తరగతి గదిలో, పాఠశాలకు రాని విద్యార్థులకు మధ్యాహ్నం తరువాత ఆన్‌లైన్‌లో పాఠాలు బోఽధిస్తున్నాం. 9, 10 తరగతుల విద్యార్థుల్లో ఎక్కువ మంది హాజరు కాకపోవడంపై హెచ్‌ఎంల నుంచి సమాచారం తీసుకుంటున్నాం. ఈ నెల 23 నుంచి 6, 7, 8 తరగతుల నిర్వహణపై ఆదేశాలు రావాలి.

Updated Date - 2020-11-20T05:58:34+05:30 IST