చిన్నోళ్లు బడిలో.. పెద్దోళ్లు ఇంట్లో..!

ABN , First Publish Date - 2021-03-01T07:30:36+05:30 IST

చిన్న చిన్న పిల్లలంతా బడి బాట

చిన్నోళ్లు బడిలో.. పెద్దోళ్లు ఇంట్లో..!

 తెరుచుకోని డిగ్రీ, ఇంజనీరింగ్‌ కళాశాలలు

 ఆన్‌లైన్‌లోనే తరగతులు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : చిన్న చిన్న పిల్లలంతా బడి బాట పడుతుంటే, ఉన్నత విద్యార్థులు మాత్రం ఇంటిపట్టునే ఉంటున్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్‌, పీజీ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ ఫస్టియర్‌ విద్యార్థులకు ఇంకా తరగతులు ప్రారంభం కాకపోవడమే అందుకు కారణం. 

పాఠశాలల్లో 6,7,8, 9, 10 తరగతులతో పాటు ఇంటర్‌, డిగ్రీ, పీజీ ఫైనలియర్‌ విద్యార్థులకు తరగతులను ఈ నెల ఒకటి నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇంటర్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ ఫైనలియర్‌ విద్యార్థులకు ఇటీవల హాస్టల్స్‌ ప్రారంభించడంతో తరగతులు జరుగుతున్నాయి. ఓయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో సెకండియర్‌, థర్డ్‌ ఇయర్‌, ఫైనలియర్‌ విద్యార్థులకు మాత్రమే ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తున్నారు. ఫస్టియర్‌ విద్యార్థులు వర్సిటీలో అడుగుపెట్టలేదు.

తరగతులన్నీ ఆన్‌లైన్‌లోనే.. 

జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో ఈ నెల ఒకటి నుంచి 16 వరకు బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌, ఫైనలియర్‌ విద్యార్థులకు ల్యాబ్స్‌ నిర్వహించి ప్రాక్టికల్స్‌, ఎగ్జామ్‌ సైతం నిర్వహించారు. ఎంటెక్‌ సెకండియర్‌ విద్యార్థులకు కూడా ల్యాబ్స్‌తోపాటు పరీక్షలు నిర్వహించారు. వీరికి ఆన్‌లైన్‌లో థియరీ తరగతులను నిర్వహిస్తున్నారు.  ఫిబ్రవరి 22 నుంచి ఈ నెల 6 వరకు సెకండియర్‌ విద్యార్థులకు ల్యాబ్స్‌ నిర్వహిస్తుండగా, ఆ వెంటనే ఫైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూహెచ్‌లో థియరీ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే చేపడుతున్నారు. మార్చి 15కు ఇంజనీరింగ్‌ థర్డ్‌, ఫైనలియర్‌ విద్యార్థులకు ఎగ్జామ్స్‌ జరగనుండగా, మార్చి 28 నుంచి సెకండియర్‌ విద్యార్థులకు పరీక్షలు జరిగే అవకాశాలున్నాయి. కానీ, ఫస్టియర్‌పై స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. 

డిగ్రీ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి  

డిగ్రీ విద్యార్థులకు కూడా కేవలం ప్రాక్టికల్స్‌ మాత్రమే నిర్వహిస్తున్నారు. కేవలం ఫైనలియర్‌ విద్యార్థులకు తరగతి గదుల్లో బోధనలు జరుగుతున్నాయి. కొంత మేరకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో నేరుగా తరగతులు నిర్వహిస్తుండగా, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో పూర్తిగా భిన్నమైన పరిస్థితులున్నాయి. ఆన్‌లైన్‌ తరగతులకే ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రాక్టికల్స్‌ కోసం మాత్రమే విద్యార్థులను కళాశాలకు రప్పిస్తున్నారు. 

కొన్ని కళాశాలలు ప్రస్తుత విద్యా సంవత్సరానికి అధ్యాపకులను తీసుకోలేదు. ప్రస్తుతం తరగతులు ప్రారంభిస్తే వారి అవసరం ఉంటుందని ఆ వైపుగా ఆసక్తి చూపడం లేదని తెలిసింది. 

Updated Date - 2021-03-01T07:30:36+05:30 IST