గడువులోగా పనుల పూర్తికి కృషి

ABN , First Publish Date - 2021-10-22T07:12:39+05:30 IST

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు గడువులోగా పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వైటీడీఏ వైస్‌చైర్మన్‌ కిషన్‌రావు తెలిపారు.

గడువులోగా పనుల పూర్తికి కృషి
యాదాద్రికొండపై పునర్నిర్మాణ పనులను పరివీలిస్తున్న వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు

వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు

యాదాద్రి టౌన్‌, అక్టోబరు 21: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు గడువులోగా పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వైటీడీఏ వైస్‌చైర్మన్‌ కిషన్‌రావు తెలిపారు. యాదాద్రి ఆలయ విస్తరణ పనులను దేవస్థాన ఈవో గీతారెడ్డి, ఆర్కిటెక్ట్‌ ఆనందసాయితో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. ఆలయ, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు ఆర్‌అండ్‌బీ, దేవస్థాన అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. వచ్చే ఏడాది మార్చి 21న ఆలయ ఉద్ఘాటన, 28వ తేదీ వరకు మహా సుదర్శనయాగం, మహాకుంభాభిషేకం ఉండనుండటంతో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. నీటి సరఫరా, క్యూలైన్లలో వసతి సౌకర్యాలు, రవాణ, నిఘా వ్యవస్థ, విద్యుత్‌ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. ఆయన వెంట ఆర్‌అండ్‌బీ, దేవస్థాన అధికారులు, స్ట్రక్చరల్‌ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఉన్నారు.


ఉద్ఘాటన నేపథ్యంలో..

యాదాద్రి ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో మార్చి నాటికి రాగి తొడుగుల పనులు పూర్తిచేయాలని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి వైటీడీఏ, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. యాదాద్రి విస్తరణ, అభివృద్ధి పనులపై హైదరాబాద్‌ బేగంపేట మెట్రోభవన్‌లోని ఆయన కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయ ఉద్ఘాటన ముహూర్తాన్ని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు వైటీడీఏ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానాలయ శిల్ప పనులు పూర్తయినా, కొండపైన మిగిలిన అభివృద్ధి పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలన్నారు. పనుల్లో ఎలాంటి అలసత్వం వహించవద్దన్నారు. సమీక్షలో వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, దేవస్థాన ఈవో గీతారెడ్డి, ఈఎన్‌సీ గణపతిరెడ్డి, ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వసంత్‌నాయక్‌, ఈఈలు లింగారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


యాదాద్రీశుడికి నిజాభిషేకం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో స్వామివారికి నిజాభిషేక పూజలు గురువారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేకువజామున బాలాలయ కవచమూర్తులను అర్చకులు హారతితో కొలిచారు. ఉత్సవమూర్తులను వేదమంత్ర పఠనాలతో పంచామృతాభిషేకం, తులసీ దళాలతో అర్చనలు నిర్వహించారు. కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలు, బంగారు, ముత్యాల ఆభరణాలతో అలంకరించి గజవాహన సేవత్సోవం నిర్వహించారు. భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా గురువారం రూ.8,61,714 ఆదాయం సమకూరింది.


కిలో చొప్పున బంగారం విరాళంగా ప్రకటించిన ఎమ్మెల్సీ, ఏపీ జడ్పీటీసీ

హాలియా, యాదాద్రి టౌన్‌: యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయ విమానగోపురం స్వర్ణ తాపడానికి కిలో బంగారం చొప్పున విరాళంగా ఇవ్వనున్నట్లు ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వైఎ్‌సఆర్‌ కడప జిల్లా చిన్నమండెం జడ్పీటీసీ మోడెం జయమ్మ గురువారం ప్రకటించారు. ఈ బంగారాన్ని తన కుటుంబం, శ్రీని ఫార్మా గ్రూపు కంపెనీల తరపున అందిస్తున్నానని ఎమ్మెల్సీ తెలిపారు. జయమ్మ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు ఫోన్‌ చేసి విషయాన్ని ప్రకటించారు. 

Updated Date - 2021-10-22T07:12:39+05:30 IST