కొత్త టారిఫ్‌ ప్రకారం విద్యుత్‌ బిల్లులు

ABN , First Publish Date - 2020-04-09T10:30:49+05:30 IST

లాక్‌డౌన్‌ అమలులో వుండడంతో ఏప్రిల్‌ నెలలో ఏపీఈపీడీసీఎల్‌ సిబ్బంది విద్యుత్‌ వినియోగానికి సంబంధించి మీటర్‌ రీడింగ్‌

కొత్త టారిఫ్‌ ప్రకారం విద్యుత్‌ బిల్లులు

లాక్‌డౌన్‌తో ఏప్రిల్‌లో మీటర్‌ రీడింగ్‌ తీసే పరిస్థితి లేదంటున్న ఈపీడీసీఎల్‌

మార్చి నెలలో ఎంత చెల్లించారో అంతే మొత్తం చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి

మే నెలలో ఒకేసారి రెండు నెలల బిల్లు

రెండు భాగాలు చేసి యూనిట్‌ రేటు నిర్ణయిస్తామంటున్న అధికారులు

వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరణ


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): లాక్‌డౌన్‌ అమలులో వుండడంతో ఏప్రిల్‌ నెలలో ఏపీఈపీడీసీఎల్‌ సిబ్బంది విద్యుత్‌ వినియోగానికి సంబంధించి మీటర్‌ రీడింగ్‌ తీసే అవకాశం లేదు. వచ్చే నెల మేలోనే మొత్తం రీడింగ్‌ తీస్తారు. అయితే వినియోగదారులు రెండు నెలల బిల్లు ఒకేసారి చెల్లించాలంటే కష్టం కాబట్టి...మార్చి నెలలో ఎంత చెల్లించారో అంతే మొత్తం ఇప్పుడు ఏప్రిల్‌లో చెల్లిస్తే...మే నెలలో ఇచ్చిన బిల్లులో దానిని సర్దుబాటు చేస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి.


అయితే దీనిపై వినియోగదారుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది వేసవి సీజన్‌ కాబట్టి ఏసీలు, ఫ్యాన్లు ఎక్కువగా వాడడం వల్ల విద్యుత్‌ వినియోగం పెరుగుతుందని, దానివల్ల రెండు నెలల రీడింగ్‌ తీస్తే ఎక్కువ వస్తుందని, దానివల్ల శ్లాబులు మారిపోయి...బిల్లు మొత్తం పెరిగిపోతుందేమోనని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదే విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి...విశాఖపట్నం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ సూర్యప్రకాశ్‌ వద్ద ప్రస్తావించగా అటువంటి భయం ఏమీ అవసరం లేదని ఇలా వివరించారు.


కొత్త టారిఫ్‌ల ప్రకారం బిల్లులు

కొత్త ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్‌ నుంచి కొత్త విధానం అమలులోకి వచ్చింది. గతంలో ఏడాది మొత్తం విద్యుత్‌ వినియోగం తీసుకొని శ్లాబులు లెక్కించేవారు. ఇప్పుడు కొత్త విధానం ప్రకారం ఏ నెలకు ఆ నెల వినియోగం బట్టి శ్లాబు నిర్ణయిస్తారు. ఒక నెల ఎక్కువ వినియోగిస్తే..ఎక్కువ ధర, మరో నెల తక్కువ వినియోగిస్తే...తక్కువ ధర లెక్కిస్తారు. వినియోగాన్ని బట్టి ఏ నెలకు ఆ నెల యూనిట్‌ రేటు మారిపోతుంది.


మార్చి నెల వినియోగం ప్రకారం ఒక వినియోగదారుడు రూ.400 బిల్లు ఏప్రిల్‌లోను చెల్లించాడనుకుంటే...ఏప్రిల్‌, మే రెండు నెలల రీడింగ్‌ మే నెలలో తీస్తారు. వాటి సగటును లెక్కలోకి తీసుకుంటారు. రెండు నెలలకు కలిపి సుమారు 420 యూనిట్లు రీడింగ్‌ వస్తే....దానిని రెండు భాగాలు చేసి ఏప్రిల్‌కు 210 యూనిట్లు, మే నెలకు 210 యూనిట్లు వేస్తారు. ఏప్రిల్‌లో 210 యూనిట్లకు ఎంత మొత్తం అయిందో లెక్క చూసి, అందులో ముందుగా చెల్లించిన రూ.400 తీసేసి, మిగిలిన మొత్తం కట్టాల్సిందిగా చెబుతారు. దానిని మే నెల బిల్లుతో పాటు చెల్లించాల్సి వుంటుందని ఎస్‌ఈ సూర్యప్రకాశ్‌ వివరించారు.

Updated Date - 2020-04-09T10:30:49+05:30 IST