విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌

ABN , First Publish Date - 2021-09-05T07:20:34+05:30 IST

టారిఫ్‌తో సంబంధం..

విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌

నెలకు రూ.15 కోట్లు బాదుడు 

ఆగస్టు నుంచి మార్చి వరకూ ఇదే బాదుడు


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): టారిఫ్‌తో సంబంధం లేదు. శ్లాబ్‌ రేట్లతో అసలే సంబంధం లేదు. ఎవరు ఎన్ని యూనిట్లు వాడుకున్నారనేది కూడా వాళ్లకు అనవసరం. వినియోగదారులు ఎన్ని యూనిట్లు వాడుకుంటే అన్ని యూనిట్లకు శ్లాబ్‌ రేట్‌ ప్రకారం బిల్లు చెల్లించడంతోపాటు ప్రతీ యూనిట్‌కు అదనంగా  మరికొంత చెల్లించాలి. దీనికి సర్దుబాటు అని చక్కగా పేరు పెట్టి మరీ బాదేస్తున్నారు. విద్యుత్‌ సంస్థలో ఖర్చులు ఎక్కువయ్యానే కారణంతో ఆ ఖర్చుల డబ్బును పూరించుకోవడానికి ఇలా వినియోగదారులకు సర్దేస్తున్నారు. దీంతో ప్రతీ వినియోగదారుడు తీవ్ర షాక్‌కు గురయ్యాడు. 


గడిచిన ఆగస్టు నెలలో వాడిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లు నుంచే ఈ బాదుడు మొదలవుతోంది. అంటే రేపోమాపో వచ్చే విద్యుత్‌ బిల్లులలో ఈ అదనపు సర్దుబాబు ఉంటుంది. బిల్లు బరువు పెరుగుతుంది. ఆగస్టు నెల నుంచి వచ్చే మార్చి నెల వరకూ ఈ బాదుడు తప్పదు. అంటే ఆగస్టులో వాడుకున్న యూనిట్లకు సంబంధించి సెప్టెంబరులో బిల్లు వస్తుంది. మార్చిలో వినియోగించిన వాటికి ఏప్రిల్‌లో బిల్లు వస్తోంది. వ్యవసాయ వినియోగదారులు, 200 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే ఎస్‌సీ, ఎస్‌టీ వినియోగదారులకు మాత్రం ఈ బాదుడు నుంచి మినహాయింపు ఉంది.


జిల్లాలో మొత్తం 18 లక్షల 40 వేల మంది విద్యుత్‌ వినియోగదారులు ఉన్నారు. అందులో 46 వేల 290 మంది వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులు ఉన్నారు. ఎస్‌సీ వినియోగదారులు 1,76,115 మంది ఉండగా, అందులో 200 యూనిట్లలోపు వాడుకునేవారు 1,70,400 మంది ఉన్నారు. ఎస్‌టి వినియోగదారులు మొత్తం 65,860 మంది ఉండగా, అందులో 200 యూనిట్లలోపు వాడుకునే వారు 64,535మంది ఉన్నారు. వీరికి మినహాయింపు ఉంటుంది. మిగతావారందరికీ బాదుడే. సుమారు 16 లక్షల మంది వినియోగదారులకు బాదుడేబాదుడు. జిల్లాలో రోజు 30 కోట్ల యూనిట్ల విద్యు త్‌ వినియోగం ఉంటుంది. ఆగస్టు నెలలో యూనిట్‌కు రూ.0.44 పైసలు అదనంగా వసూలు చేస్తారు. ఈ లెక్క సుమారు రూ.15 కోట్ల వరకూ అదనంగా ప్రజలు డబ్బు చెల్లించవలసి ఉంది.


ఎనిమిది నెలల్లో బాదుడు వివరాలివే..

ఎనిమిది నెలలపాటు అదనపు వసూళ్ల మోత మోగుతుంది. ఆగస్టు నెలలో రూ.0.44 పైసలు వంతున యూనిట్‌కు అదనంగా వసూలు చేస్తారు. సెప్టెంబరులో యూనిట్‌కు రూ.0.42 పైసలు, అక్టోబరులో రూ.0.44పైసలు, నవంబరులో రూ.0.43 పైసలు, డిసెంబరులో రూ.0.45 పైసలు,  జనవరిలో రూ.0.43 పైసలు, ఫిబ్రవరిలో రూ.0.42 పైసలు, మార్చి నెలలో రూ.0.40 పైసలు వసూలు చేస్తారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి రాబోయే ఎనిమిది నెలలపాటు మొత్తం రూ.79.09 కోట్లు వసూలు లక్ష్యంగా నిర్ణయించారు.

Updated Date - 2021-09-05T07:20:34+05:30 IST