సాగునీటిపై సీఎం స్పందించాలి

ABN , First Publish Date - 2020-09-20T17:06:40+05:30 IST

జిల్లాలో సాగర్‌ ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై కలెక్టర్‌ ప్రకటన మొత్తం రైతాంగాన్ని..

సాగునీటిపై సీఎం స్పందించాలి

కలెక్టర్‌ ప్రకటనతో రైతుల్లో నైరాశ్యం 

ఓవైపు సముద్రం పాలౌతున్న నీరు

ఇక్కడ మాత్రం ఆరుతడికే పరిమితం 

స్పందించకపోతే  ఆందోళన 

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు


ఒంగోలు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాగర్‌ ఆయకట్టుకు సాగునీటి సరఫరాపై కలెక్టర్‌ ప్రకటన మొత్తం రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు, నైరాశ్యానికి గురి చేసిందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. డ్యాంలు నిండి కృష్ణా నీరు లక్షల క్యూసెక్కులు సముద్రం పాలౌతున్నా సాగుకు ఇవ్వరా అని ప్రశ్నించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి, ఇరిగేషన్‌ మంత్రి అనిల్‌కుమార్‌, జిల్లా మంత్రులు జోక్యం చేసుకొని రైతులకు మాగాణి సాగుకు వీలుగా సాగర్‌ నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


ఈమేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో దాదాపు నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టు సాగర్‌ కాలువల పరిధిలో ఉన్నదన్నారు. ఎగువ నుంచి కృష్ణానదిలో భారీగా వరద నీరు వస్తుండటంతోపాటు శ్రీశైలం, సాగర్‌ డ్యాంలు నిండి సముద్రానికి కూడా నీరుపోతున్నదన్నారు. దీంతో నెలక్రితమే సాగర్‌ ఆయకట్టు రైతులు నీటి సరఫరాపై నమ్మకంతో వరినారు పోసుకున్నారని తెలిపారు. ఇప్పటికే వేలాది రూపాయలు సాగు కోసం ఖర్చు చేశారన్నారు. ఒక్క పర్చూరు నియోజకవర్గంలోనే దాదాపు 40వేల ఎకరాల్లో మాగాణి సాగుకు రైతులు ఏర్పాట్లు చేసుకున్నారని తెలిపారు.


ఇతర ప్రాంతాలలో ఆయితే కొందరు ఏకంగా నాట్లు వేయగా, మరికొన్ని చోట్ల దమ్ము చేస్తున్నారని వివరించారు. ఈ పరిస్థితుల్లో ఆరుతడి పంటలకు మాత్రమే సాగర్‌ నీరు ఇవ్వనున్నట్లు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ నాలుగు రోజుల క్రితం చేసిన ప్రకటన ఆయకట్టు రైతుల్లో తీవ్ర నైరాశ్యాన్ని కలిగించిందని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు. తక్షణం ముఖ్యమంత్రి, మంత్రులు దీనిపై దృష్టి సారించి మాగాణి సాగుకు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో సాగర్‌ ఆయకట్టు రైతుల పక్షాన పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 

Updated Date - 2020-09-20T17:06:40+05:30 IST