ఏమిటీ ఘోరం?

ABN , First Publish Date - 2022-01-05T07:53:34+05:30 IST

కొంతమంది ముస్లిం మహిళల ఫోటోలను ఒక యాప్‌లోకి ఎక్కించి వాళ్ళంతా ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉన్నట్టుగా చిత్రీకరించి అవమానిస్తున్న ‘బుల్లీ బాయ్’ యాప్ నిర్వాహకుల్లో కొందరిని పోలీసులు అరెస్టుచేశారు....

ఏమిటీ ఘోరం?

కొంతమంది ముస్లిం మహిళల ఫోటోలను ఒక యాప్‌లోకి ఎక్కించి వాళ్ళంతా ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉన్నట్టుగా చిత్రీకరించి అవమానిస్తున్న ‘బుల్లీ బాయ్’ యాప్ నిర్వాహకుల్లో కొందరిని పోలీసులు అరెస్టుచేశారు. బెంగుళూరుకు చెందిన విశాల్ కుమార్ అనే ఇంజనీరింగ్ విద్యార్థిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో మరికొందరి పేర్లు బయటపడి, ప్రధాన సూత్రధారి అంటున్న పద్దెనిమిదేళ్ళ యువతిని ఉత్తరాఖండ్ లో అరెస్టుచేశారు. వేలం పేరిట ఒక వర్గానికి చెందిన మహిళల ఫోటోలను ఇలా యాప్‌లో అప్‌లోడ్ చేసి రాక్షసానందం పొందుతున్న ఈ వ్యవహారంమీద దేశంలోని పలువురు మేధావులు మోదీ ప్రభుత్వానికి ఘాటుగా లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సదరు యాప్‌ను దానికి హోస్టింగ్ సేవలు అందిస్తున్న గిట్ హబ్ సంస్థ బ్లాక్ చేసిందని కేంద్రం ప్రకటించినప్పటికీ అది తాత్కాలిక ఉపశమనమే. గతంలో ఇదే తరహా యాప్ పట్ల ప్రభుత్వం ప్రదర్శించిన ఉదాసీనతే ఇప్పుడు అనేకమంది మహిళలు మళ్ళీ అవమానపడేందుకు కారణమైంది.


మోదీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే, తమ గొంతు వినిపించే ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ఈ యాప్ లక్ష్యంగా కనిపిస్తున్నది. హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, ప్రజాఉద్యమాల్లో చురుకుగా ఉండేవారి ఫొటోలను సామాజిక మాధ్యమాలనుంచి సేకరించి, వాటిని మార్ఫ్ చేసి నిర్వాహకులు యాప్‌లో పెడుతున్నారు. ఫోటోల కింద బుల్లీబాయ్ అని ఉండి సదరు మహిళను వేలంలో పాడుకోవచ్చన్నట్టుగా ఈ యాప్ యూజర్లకు చెబుతోంది. క్రియాశీలకంగా వ్యవహరించే ముస్లిం మహిళలను అవమానించడమే నిర్వాహకుల లక్ష్యం కనుక వయసును కూడా వారు గౌరవించడం లేదు. ఇప్పుడు అరెస్టయిన నిర్వాహకుల వయసు పాతికలోపే ఉంటుంది. కానీ, వారు తమ యాప్‌లో అరవైయేళ్ళు పైబడిన అనేకమంది అమ్మలను కూడా అమ్మకానికి పెట్టారు. యాప్ నిర్వాహకుల అమానుషత్వం ఏ స్థాయిలో ఉన్నదంటే, ఉద్యమాల్లో చురుకుగా ఉన్న విద్యార్థినుల తల్లులను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. 


గత ఏడాది జూలైలో సుల్లీ డీల్స్ అనే యాప్ ఇదేతీరున సుమారు ఎనభైమందిని ‘డీల్స్ ఆఫ్ ది డే’ అంటూ అవమానించడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సుల్లి, బుల్లి అనే మాటలను ఎవరు ఎవరిని అవమానించడానికి వాడతారో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. సుల్లీ డీల్స్ కేసులో ఏదో దర్యాప్తు సాగినా, ఇప్పటివరకూ కేసులు నమోదు చేయకపోవడం ఆశ్చర్యం. సుల్లీ డీల్స్ మీద గత ఏడాది ఫిర్యాదు చేసిన కశ్మీరీ జర్నలిస్టు ఒకామె మరోమారు ఇప్పటియాప్‌లో తన పేరుచూసుకొని అవమానపడవలసి వచ్చింది. గత ఏడాది కూడా చాలామంది నాయకులు, మేధావులు కేంద్రంమీద విమర్శలు సంధించారు, చర్యలు తీసుకోమంటూ లేఖలు రాశారు. ఇప్పుడు బుల్లీ యాప్‌కు లక్ష్యంగా మారిన మహిళల ఫిర్యాదులపై కొన్ని రాష్ట్రాలు దర్యాప్తు మొదలెట్టడంతో వ్యవహారం వేగంగా కదులుతున్నట్టు కనిపిస్తున్నా, దానిని కడవరకూ తీసుకుపోయి శిక్షలు వేసినప్పుడు మాత్రమే ప్రభావం ఉంటుంది. ప్రశ్నిస్తున్నవారి గొంతునొక్కడం, అన్యాయం కూడదంటున్నవారిమీద రాజద్రోహం కేసులు పెట్టడం సర్వసాధారణమైపోయింది. వివిధ రకాల వివక్షలనూ, నిర్బంధపూరితమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్న మైనారిటీల గొంతు పెగలనివ్వకుండా చేయడం కోసం విశేష ప్రయత్నాలు జరుగుతున్నాయి. తీవ్ర విద్వేషపూరిత వాతావరణంలో అధికారంలో ఉన్నవారి కోసం అనుయాయులు ఎంతటి అఘాయిత్యానికైనా వెనుకాడటం లేదు. మూకదాడులు, సజీవదహనాలు జరిగిపోయే దేశంలో ఆన్‌లైన్ వేధింపులు ఆశ్చర్యమేమీ కాదు. ‍సమాజానికి జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే ముస్లిం మహిళల గొంతునొక్కేయడానికి బుల్లీబాయ్ వంటి రూపాల్లో వ్యవస్థీకృత ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రెండు యాప్‌లలోనూ వెలుగుచూసిన పేర్లను నిశితంగా గమనించినట్టయితే, అవి ముస్లిం మహిళల పేర్లుగా కాక, తప్పును తప్పని ధైర్యంగా చూపుతున్న స్వతంత్ర గొంతుకలని అర్థమవుతుంది. పెగిలిన ఆ కంఠాలని నులిమేయడం, ఆ ధైర్యాన్ని చంపేయడంకోసం ఈ యాప్ నిర్వాహకులు మహిళల మర్యాదమీద దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఉన్మాదులకు అండగా నిలవకుండా పాలకులు తమ పరువు నిలబెట్టుకోవడం అవసరం.

Updated Date - 2022-01-05T07:53:34+05:30 IST