చిరుద్యోగులపై అధికార జులుం

ABN , First Publish Date - 2021-04-16T05:32:25+05:30 IST

చాలీచాలని వేతనాలతో బతుకుబండిని లాగుతున్న చిరుద్యోగులపై రాజకీయ నేతల అగడాలు కొనసాగుతూనే ఉన్నాయి.

చిరుద్యోగులపై అధికార జులుం

ఓటు వేయలేదని వేటు

 ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు


వరికుంటపాడు, ఏప్రిల్‌ 15 : చాలీచాలని వేతనాలతో  బతుకుబండిని లాగుతున్న చిరుద్యోగులపై రాజకీయ నేతల అగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ మద్దతు అభ్యర్థులకు ఓటు వేయలేదనే ఆక్రోశంతో అలాంటి చిరుద్యోగులపై వేటు వేశారు. దీంతో ప్రతినిత్యం ఎంతోమంది విద్యార్థుల కడుపులు నింపే భోజన నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. మండలంలోని వరికుంటపాడు, తిమ్మారెడ్డిపల్లి, పెద్దిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలతోపాటు భోగ్యంవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో  భోజన నిర్వాహకులను ఈ నెల 1 నుంచి విధుల నుంచి తొలగించారు. అలాగే తిమ్మారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వీపర్‌నూ తొలగించారు. రాజకీయ నాయకులతోపాటు సర్పంచులు కూడా ఏళ్ల తరబడి విధుల్లో ఉన్న చిరుద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా తొలగించడంతో ప్రశాంత పల్లెల్లో రాజకీయ కక్షలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. 


నోటీసులు లేకుండానే..

ముందస్తు నోటీసులు ఇవ్వకనే విధులకు రావొద్దని చెప్పడంతో మండలస్థాయి అధికారి, ప్రధానోపాధ్యాయుల నడుమ వాదనలు కూడా చోటుచేసుకొన్నట్లు సమాచారం.  మరోవైపు బాధితులు కూడా తాము చేసిన తప్పు ఏంటో చెప్పాలని పట్టుబట్టుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు డీఈవోతోపాటు ఆర్డీవో, మండల స్థాయి అధికారుల ఎదుట తమ గోడు వెల్లబోసుకొన్నప్పటికి ఫలితం లేకుండాపోయింది.  

Updated Date - 2021-04-16T05:32:25+05:30 IST