ఉపాధి కల్పన కూడా అభివృద్ధిలో భాగమే

ABN , First Publish Date - 2021-07-30T05:55:02+05:30 IST

పట్టణాభివృద్ధి, మౌలిక వసతులతోపాటు ఉపాధి కల్పన కూడా అభివృద్ధిలో భాగమేనని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు.

ఉపాధి కల్పన కూడా అభివృద్ధిలో భాగమే
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలాసత్పథి

కలెక్టర్‌ పమేలాసత్పథి

మునిసిపల్‌ చైర్మన్లు, కమిషనర్లతో సమావేశం

భువనగిరి టౌన్‌, జూలై 29: పట్టణాభివృద్ధి, మౌలిక వసతులతోపాటు ఉపాధి కల్పన కూడా అభివృద్ధిలో భాగమేనని కలెక్టర్‌ పమేలాసత్పథి అన్నారు. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణాలుగా తీర్చిదిద్దే లక్ష్యంగా రూపొందించనున్న ప్రణాళికపై గురువారం నిర్వహించిన మునిసిపల్‌ చైర్మన్లు, కమిషనర్ల సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. బస్తీల పారిశుధ్య పనుల్లో ప్రజలను భాగస్వాములు చేయాలని సూచించారు. సామూహిక మూత్రశాలల నిర్మాణం, జెనరిక్‌ మెడికల్‌ షాపుల నిర్వహణ, శానిటరీ నాప్‌కిన్స్‌ తయారీ తదితర ఉపాధి అవకాశాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇందుకు వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో అమలుచేస్తున్న విధానాన్ని జిల్లా మునిసిపాలిటీల్లో అమలు చేయాలని సూచించారు. ఈమేరకు త్వరలో అవగాహనా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ, డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, అర్బన్‌ మేనేజ్‌మెంట్‌ సెంట్రల్‌ ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ రమణ, చైర్మన్లు, కమిషనర్లు పాల్గొన్నారు. 


నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వాలి : దీపక్‌ తివారీ 

భువనగిరి రూరల్‌: ప్రభుత్వం జారీ చేసిన జీవో 105 ప్రకారం నిబంధనలకు లోబడి లేఅవుట్లకు అనుమతులు జారీచేయాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారీ సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి లేఅవుట్‌ ఆమోదిత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఎస్‌ బీపాస్‌ నిబంధనలమేరకు నిర్మాణాలకు అనుమతులు జారీచేయాలన్నారు. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించవద్దన్నారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈ శంకరయ్య, ఐబీఈఈ రుక్సానా, పీఆర్‌ ఈఈ జోగారెడ్డి, టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారి లక్ష్మీనర్సయ్య, తహసీల్దార్‌ శ్యాంసుందర్‌రెడ్డి, రవికుమార్‌, ఫైర్‌, పోలీస్‌ అధికారులు, మునిసిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-30T05:55:02+05:30 IST