కేంద్రం ఆధీనంలో ‘ఉపాధిహామీ’

ABN , First Publish Date - 2022-04-14T04:39:05+05:30 IST

ఉపాధిహామీ పథకంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కొనసాగిన పథకం ఇకపై కేంద్రం అజమాయిషీలోకి వెళ్లనుంది. కొత్తగా తీసుకొచ్చిన ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌) సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా పనులు చేప ట్టనున్నారు.

కేంద్రం ఆధీనంలో ‘ఉపాధిహామీ’
రెబ్బెనలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు

- ఉపాధి హామీలో సమూల మార్పులు

- ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌లో పనులు

- కేంద్రం కనుసన్నల్లోనే నిధుల చెల్లింపు

- అడిగిన కూలీకి పని కల్పించకపోతే జరిమానా

రెబ్బెన, ఏప్రిల్‌ 13: ఉపాధిహామీ పథకంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కొనసాగిన పథకం ఇకపై కేంద్రం అజమాయిషీలోకి వెళ్లనుంది. కొత్తగా తీసుకొచ్చిన ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌) సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా పనులు చేప ట్టనున్నారు. చేపట్టిన పనులకు కేంద్రం కనుసన్నల్లోనే నిధుల చెల్లింపులుండనున్నాయి. ఇకపై అడిగిన కూలీకి పని కల్పించకపోతే సంబంధిత అధికారికి జరిమానా విధించనున్నారు. జిల్లాలో 2,66,735మంది కూలీలు పని చేస్తుండగా ఇందులో పురుషులు 1,36,361 మంది, మహిళలు 1,30,419 మంది,  2.681 మంది దివ్యాంగ కూలీలు ఉన్నారు. 

పెరగనున్న పారదర్శకత

కొత్తవిధానం ద్వారా ఉపాధిహామీ పనుల్లో పారదర్శకత మరింత పెరిగే అవకాశం ఉంది. గ్రామాల్లో ఇప్పటి వరకు పాత విధానంలో కొనసాగిన పనులు వాటికి సంబంధిం చిన బిల్లులను యుద్ధ ప్రతిపాదికన చెల్లించాలని ఇప్పటికే కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నూతన సర్వర్‌ ఉండడంతో అవకాశం ఉన్న పనులు మాత్రమే గ్రామాల్లో చేపడతారు. ఈ కొత్త విధానాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కొత్త సాఫ్ట్‌వేర్‌పై సిబ్బందికి దశల వారీగా అవగాహన కల్పిస్తున్నారు. 

గ్రామాన్ని ఒక యూనిట్‌గా

ఇప్పటి వరకు ఉపాధి పనులను జిల్లా యూనిట్‌గా నిర్వహిస్తున్నారు. ఇకపై గ్రామాన్ని యూనిట్‌గా చేపట్టను న్నారు. ప్రతి గ్రామంలో కల్పించిన పనుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఎవరైనా కూలీ పని కావాలని అడిగిన 14రోజుల్లోగా కల్పిం చాల్సి ఉంటుంది. లేకపోతే నిరుద్యోగ భృతిని చెల్లించాలి. కూలీ నుంచి డిమాండ్‌ తీసుకున్న అధికారి సకాలంలో పని కల్పించక పోతే ప్రభుత్వం సదరు అధికారికి జరిమానా విధిస్తుంది. ఇలా వసూలు చేసే జరిమానా నుంచి కూలీలకు నిరుద్యోగభృతి చెల్లించనున్నారు. ఉపాధి హామీ పథకంలో 60శాతం నిధులను కూలీలకు, 40శాతం నిధులను మెటీరియల్‌ కంపోనెంట్‌కు ఖర్చు చేయను న్నారు. ఇప్పటివరకు చాలా రాష్ట్రాల్లో ఈ విధానం అమలవుతోంది. 

కొత్త సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ

- కల్పన, ఏపీవో, రెబ్బెన 

ఉపాధి హామీ పథకం నిర్వహణపై గతంలో ఉన్న సాఫ్ట్‌వేర్‌ స్థానంలో కేంద్ర ప్రభుత్వం నూతన ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ తీసుకొచ్చింది. దీనిపై ఇప్పటికే జిల్లా కేంద్రం మొదటి విడత శిక్షణ కూడా ఇచ్చారు. వచ్చే నెల 1నుంచి నూతన విధానం అమలు కానుంది.

Updated Date - 2022-04-14T04:39:05+05:30 IST