దర్యాప్తు ఇంతేనా?.. కాడి పడేసిన విచారణ కమిటీలు

ABN , First Publish Date - 2020-09-21T14:08:36+05:30 IST

కనకదుర్గమ్మ వెండి రథంపై మూడు సింహం ప్రతిమల చోరీ కేసు దర్యాప్తు ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. సాక్ష్యాధారాలు లేవనే సాకుతో పోలీసులు దర్యాప్తును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారా? లేక పోలీసులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా?

దర్యాప్తు ఇంతేనా?.. కాడి పడేసిన విచారణ కమిటీలు

ఆధారాల్లేవంటూ చేతులెత్తేస్తున్న పోలీసులు 

వెండి రథంపై మూడు సింహం ప్రతిమల చోరీ కేసులో కానరాని పురోగతి 

గడిచిన 15 రోజుల సీసీ కెమెరాల ఫుటేజీ మాటేమిటి?


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): కనకదుర్గమ్మ వెండి రథంపై మూడు సింహం ప్రతిమల చోరీ కేసు దర్యాప్తు ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. సాక్ష్యాధారాలు లేవనే సాకుతో పోలీసులు దర్యాప్తును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారా? లేక పోలీసులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏటా కనకదుర్గమ్మను ఊరేగించే వెండి రథంపై సింహం ప్రతిమలు మాయమైనట్టు వారం క్రితమే గుర్తించినా, అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం, రెండు రోజులు ఆలస్యంగా ఫిర్యాదు చేసినా, అప్పటికే ఘటనా స్థలంలో ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా చేయడం.. అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు ఎక్కడ నేరం జరిగినా, కొద్ది గంటల్లో ఛేదించే బెజవాడ పోలీసులు ఇక్కడ సాక్ష్యాధారాలు లేవంటూ వేగంగా కదలకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది.


అమ్మవారి వెండి రథంపై మూడు సింహం ప్రతిమలను దుండగులు అపహరించుకు పోయారంటూ ఈ నెల 17వ తేదీన దుర్గగుడి ఏఈవో రమేష్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌, పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. తొలుత దేవస్థానం అధికారులు, సిబ్బంది విచారించి వివరాలు సేకరించారు. ఆ తర్వాత ఇప్పటికి ఐదు రోజులు గడిచిపోయినా కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడంపై అమ్మవారి భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మవారి వెండి రథంపై సింహం ప్రతిమల చోరీ ఘటన గత మంగళవారమే వెలుగు చూసినా దేవస్థానం అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తర్వాత ఈ చోరీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కావడం, ప్రతిపక్షాలు, అమ్మవారి భక్తుల నుంచి పెద్దఎత్తున నిరసన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, కమిషనర్‌ సి.అర్జునరావు రంగంలోకి దిగారు.


అమ్మవారి వెండి రథంపై సింహం ప్రతిమలను దుండగులు అపహరించుకుపోయారా? లేక దేవస్థానం అధికారులే ఎక్కడైనా దాచిపెట్టారా? అనేది నిర్ధారించుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నిర్ధారణ కోసం పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానం ఈవో మూర్తిని విచారణ అధికారిగా నియమించారు. ఆయన ఈనెల 16వ తేదీన దేవస్థానంలో విచారణ నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఆయన విచారణాధికారిగా ఉండకూడదన్న విమర్శలు రావడంతో ఆ తర్వాత ఆయన మళ్లీ దుర్గగుడికి రాలేదు. ఆయన విచారణ ఎంతవరకు వచ్చిందో.. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారో.. లేదో కూడా ఎవరికీ తెలియదు. మరోవైపు దేవస్థానం తరపున ఐదుగురు సభ్యులతో మరో అంతర్గత కమిటీని నియమించారు. ఆ కమిటీ ఏ ఏ కోణాల్లో విచారణ చేసిందో కూడా తెలియదు. ఈ నేపథ్యంలో శాఖాపరంగా నియమించిన విచారణ కమిటీలు అప్పుడే కాడి పడేశాయన్న విమర్శలు వినిపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నేర పరిశోధనలో కీలకమైన పోలీసుల దర్యాప్తులో కూడా ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం.


చోరీ ఘటన గురించి తెలిసిన వెంటనే  దేవస్థానం అధికారులు ఉద్దేశపూర్వకంగానే పోలీసులకు ఫిర్యాదు చేయలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. వెండి రథం పరిశీలనకు అందరినీ అనుమతించడం, ఆ ప్రదేశాన్ని చిందరవందర చేయడం ద్వారా ఘటన స్థలంలో ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లేకుండా చేశారని ఉద్యోగులే ఆరోపించారు. ఇప్పుడు పోలీసులు కూడా సాక్ష్యాధారాలు లభించని కారణంగానే దర్యాప్తు వేగంగా ముందుకు సాగడం లేదనే వాదనను వినిపిస్తున్నారు. ఇంతకంటే పెద్ద పెద్ద చోరీ కేసులనే ఛేదించిన విజయవాడ పోలీసులు కనకదుర్గమ్మ ఆస్తిని అపహరించుకుపోయిన దొంగలను పట్టుకోలేకపోతారా? అనేది అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్న.


అక్కరకురాని నిఘా వ్యవస్థ ఎందుకు? 

నేరపరిశోధనలో పోలీసులు ఎలాంటి కేసునైనా ఛేదించడానికి సీసీ కెమెరాల ఫుటేజీ కీలకంగా మారుతోంది. ఇంద్రకీలాద్రి కొండపై నుంచి దిగువన కృష్ణానది పరిసరాలలో ఏం జరిగినా పసిగట్టేలా మొత్తం 130 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కొండపైన, దిగువన ప్రతి అంగుళాన్ని కవర్‌ చేసేలా వీటిని ఏర్పాటు చేశారు. వీటిలో రూ.25 వేల నుంచి రూ. 80 వేల విలువైన కెమెరాల వరకు ఉన్నాయి. ఇంద్రకీలాద్రిపై నుంచి దిగువన కృష్ణానదీ తీరం వరకూ రికార్డు చేయగల సామర్థ్యం గల కెమెరాలు వీటిలో న్నాయి. చీకట్లో సైతం నేరస్థుల కదలికలను రికార్డు చేయగల నైట్‌ విజన్‌ కెమెరాలూ ఉన్నాయి. వీటిని కొనుగోలు చేయడానికి అమ్మవారి ఖజానా నుంచి రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఇంతా చేసి ఈ సీసీ కెమెరాల ఫుటేజీ డీవీఆర్‌ (డిజిటల్‌ వీడియో రికార్డర్‌)లో కేవలం 15 రోజులు మాత్రమే ఉంటుందట. ఆ తర్వాత అవసరమైనప్పుడు సీసీ ఫుటేజీ కావాలంటే అందుబాటులో ఉండవు. దీంతో కీలక సమయాల్లో అమ్మవారి కొండపై సీసీ కెమెరాల వ్యవస్థ అక్కరకు రావడం లేదు. 2018లో అమ్మవారికి భక్తులు సమర్పించిన ఖరీదైన చీర మాయమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైనప్పుడు కూడా నేరస్థులను పట్టుకోవడానికి ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడలేదు. 


నిర్వహణపై దృష్టి లేదా?

సాధారణంగా అమ్మవారి హుండీ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు, చోరీలు, ఇతర ఘటనలు జరిగినప్పుడు సీసీ ఫుటేజీల బ్యాకప్‌ను సేకరించి భద్రపరుస్తుంటారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమలు చేసినప్పటి నుంచి సీసీ కెమెరాల నిర్వహణ గురించే ఎవరూ పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొండపై సీసీ కెమెరాల వ్యవస్థను పర్యవేక్షించేందుకు కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ సీసీ టీవీ అడ్మిన్‌గా గతంలో ఓ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి పని చేసేవారు. గత జనవరిలో భవానీ దీక్షల ఉత్సవాల అనంతరం ఆ ఉద్యోగిని దుర్గగుడి ఉన్నతాధికారులు నిలిపివేశారు. ఆ తర్వాత శానిటేషన్‌ విభాగంలో పనిచేసే ఒక ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని, మరో ఇద్దరు ఎన్‌ఎంఆర్‌లకు ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. వారికి కనీస సాంకేతిక పరిజ్ఞానం కూడా లేకపోవడంతో ఆరేడు నెలలుగా సీసీ కెమెరాల బ్యాకప్‌ను తీసి భద్రపరచడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి లోపాలతో కొండపై సీసీ కెమెరాల వ్యవస్థ కీలక సమయాల్లో అక్కరకు రాకుండా పోతోందని ఆలయ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పటికైనా సీసీ కెమెరాల వ్యవస్థను పటిష్టం చేసి, కనీసం ఏడాది పాటు ఫుటేజీని భద్రపరిచే ఏర్పాట్లు చేస్తే నేరస్థులను పట్టుకోవడానికి దోహదపడుతుంది. 


గడిచిన 15 రోజుల మాటేమిటి?

అమ్మవారి వెండి రథాన్ని నిలిపిన మహా మండపంలో చుట్టూ సీసీ కెమెరాలున్నాయి. పదిహేను రోజులుగా ఆ కెమెరాలు రికార్డు చేసిన ఫుటేజీ డీవీఆర్‌లో భద్రంగానే ఉంటుంది. కనీసం ఆ ఫుటేజీని పరిశీలించినా, ఈ 15 రోజుల్లో చోరీ జరిగిందా? లేదా? అనే విషయమైనా తెలుస్తుంది. దేవస్థానం అధికారులుగానీ, పోలీసులు గానీ ఈ దిశగా కనీసం ప్రయత్నం కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. 


గత అనుభవాల నుంచి పాఠాలు నేర్వరా?

అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల పాదరక్షలు మొదలుకొని విలువైన సెల్‌ఫోన్లు, నగదు, బంగారు గొలుసులు, మోటారు వాహనాల దొంగతనాలు ఇక్కడ నిత్యకృత్యం. ఈ చిన్నచిన్న దొంగతనాలను కూడా సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నేరస్థులను పట్టుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఏకంగా అమ్మవారి వెండి రథంపై సింహం ప్రతిమలు చోరీకి గురైతే.. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో కూడా చెప్పలేని దుస్థితిలో దేవస్థానం అధికారులున్నారు. అమ్మవారి కొండపై చోరీలు.. నేరాలు నిత్యకృత్యంగా మారినప్పుడు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకునైనా కనీసం ఒక ఏడాది పాటైనా ఫుటేజీని భద్రపరచాలనే ఆలోచన దేవస్థానం అధికారులకు ఇంతవరకు రాలేదా? లేక ఆధారాలు పక్కాగా ఉంటే తమ బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే సాక్ష్యాధారాలను మాయం చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2020-09-21T14:08:36+05:30 IST