వెనక్కి ‘సెట్‌’ చేశారు

ABN , First Publish Date - 2022-04-11T06:03:27+05:30 IST

కొవిడ్‌ కారణమా.. ప్రభుత్వ నిర్ణయమో రానున్న విద్యా సంవత్సరం అడుగులు వెనక్కి పడుతున్నాయి.

వెనక్కి ‘సెట్‌’ చేశారు

రానున్న విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలన్నీ ఆలస్యమే

ఏపీఈఏపీ సెట్‌ జూలై 4 నుంచి 12 వరకు

ఎడ్‌ సెట్‌, లా సెట్‌, పీజీ సెట్‌ జూలై 13

ఈ సెట్‌ జూలై 22, ఐ సెట్‌ 25


భీమవరం ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 10: కొవిడ్‌ కారణమా.. ప్రభుత్వ నిర్ణయమో రానున్న విద్యా సంవత్సరం అడుగులు వెనక్కి పడుతున్నాయి. టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ఆలస్య కావడం ఒక ఎత్తు అయితే.. రానున్న విద్యా సంవ త్సరం వివిధ కోర్సులలో ప్రవేశ పరీక్షలు జూలై జరగనున్నాయి. తరగతులు ప్రారంభం సమయానికి ప్రవేశ పరీక్షలు కూడా జరగని పరిస్థితిలో విద్యార్ధులలో కొంత అయోమయం నెలకొంది. ప్రవేశ పరీక్షలన్ని వెనక్కి వెళ్లాయి. ఏపీఈఏపీ సెట్‌ మొదలుకుని లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీ సెట్‌ ఇలా అన్ని జూలైలో నిర్వహించేలా ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.

ప్రధానంగా రానున్న విద్యా సంవత్సరం ఇంజనీరింగ్‌ తరగతులు బాగా ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీఈఏపీ సెట్‌ 2022–23 విద్యా సంవత్సరానికి జూలై 4 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించేలా నిర్ణయించారు. గతంలో ఏప్రిల్‌ చివరి వారంలో ఏపీఈఏపీ సెట్‌ నిర్వహించి మే నెల రెండో వారంలో ఫలితాలు విడుదల చేసేవారు. ఆ లెక్కన రెండు నెలలుపైగా సెట్‌ ఆలస్యంగా నిర్వహిస్తున్నట్లు అయింది. ఏపీఈఏపీ సెట్‌ ఆలస్యం విద్యార్థులలో కొంత ఒత్తిడి గురిచేసేలా ఉంటుందని తల్లిదండ్రులు ఆందో ళన చెందుతున్నారు. మిగిలిన ప్రవేశ పరీక్షలు మే నెలలో దాదాపు ముగించేవారు. కాగా ఎడ్‌సెట్‌ జూలై 13న, అదేరోజు మధ్యాహ్నం లాసెట్‌, పీజీ సెట్‌ జరుగుతుంది. పీజీ సెట్‌ జూలై 18 నుంచి 21 వరకు నిర్వహిస్తారు. జూలై 22 ఈసెట్‌ జరగనున్నది. ఐసెట్‌ 25న నిర్వహించేలా విద్యామండలి నిర్ణయించింది. ప్రవేశ పరీక్షలు ఆలస్యం ఆ కోర్సుల 2022–23 సంవత్సరం మొదలు వెనక్కి వెళ్లడానికి అవకాశం లేకపోలేదు. ఫలితాలు విడుదల, కౌన్సెలింగ్‌ త్వరితగతిన నిర్వహించగలిగితే విద్యా సంవత్సరం కొంతైనా  ముందుకు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 


ఇంటర్‌ ఆలస్యం.. ఏపీఈఏపీ సెట్‌పై ప్రభావం

ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ పరీక్షలు దాదాపు రెండు నెలలు వెనక్కి వెళ్లాయి. సాధారణంగా మార్చి మొదటి వారంలో జరిగే పరీక్షలు  ప్రస్తుత విద్యా సంవత్సరం మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఏపీఈఏపీ సెట్‌ను రెండు నెలలు వెనక్కి వెళ్లడానికి కారణం కావచ్చని పలువురు భావిస్తున్నారు.

Updated Date - 2022-04-11T06:03:27+05:30 IST