మారుమూల పల్లెల్లోకి మహమ్మారి

ABN , First Publish Date - 2021-04-12T06:01:38+05:30 IST

కరోనా మహమ్మారి క్రమంగా ఉగ్రరూపం దాల్చుతోంది. గత వారం పది రోజుల నుంచి కరోనా వైరస్‌ ఇక్కడి పల్లెలను చుట్టుముట్టి అతలాకుతలం చేస్తోంది. జిల్లావ్యాప్తంగా గల 19 పీహెచ్‌సీ ల పరిధిలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరిగిపోవ డం ఆందోళనకు గురి చేస్తోంది. సారంగాపూర్‌ మం

మారుమూల పల్లెల్లోకి మహమ్మారి
కరోనా బాధితురాలిని అంబులెన్స్‌లో నిర్మల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్న దృశ్యం

గ్రామాలను చుట్టుముడుతున్న కరోనా రక్కసి 

 కుప్పలుతెప్పలుగా పాజిటివ్‌ కేసులు 

 వీడీసీల ఆధ్వర్యంలో సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ల ప్రకటన 

 సారంగాపూర్‌ మండలం గోపాల్‌పేట్‌లో కరోనా విలయ తాండవం 

 ఒకరి మృతి, పలువురు బాధితులు ఆసుపత్రికి తరలింపు 

ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్న కలెక్టర్‌ 

నిర్మల్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి క్రమంగా ఉగ్రరూపం దాల్చుతోంది. గత వారం పది రోజుల నుంచి కరోనా వైరస్‌ ఇక్కడి పల్లెలను చుట్టుముట్టి అతలాకుతలం చేస్తోంది. జిల్లావ్యాప్తంగా గల 19 పీహెచ్‌సీ ల పరిధిలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరిగిపోవ డం ఆందోళనకు గురి చేస్తోంది. సారంగాపూర్‌ మండలంలోని గోపాల్‌పేట్‌ గ్రామంలో విపరీతంగా కేసుల సంఖ్య పెరిగిపోవడంతో ఆ గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అలాగే మరికొన్ని గ్రామాల్లో కూడా కరోనా తన పంజా విసురుతూ జనాన్ని అవస్థల పాలు చేస్తోంది. గోపాల్‌ పేట్‌ తండాలో ఓ వ్యక్తి కరోనా పాజిటివ్‌తో బాధపడుతూ మరణించగా.. మరికొంత మంది పరిస్థితి క్షీణించడంతో వారిని జిల్లా ఆసుపత్రి కి, అక్కడి నుంచి హైదరాబాద్‌ ఆసుపత్రులకు తరలిస్తున్నారు. గ్రామాల్లో కరోనా విస్తరిస్తున్న కారణంగా స్థానిక గ్రామాభివృద్ది కమిటీలు (వీడీసీ) స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే గుండంపల్లి, కడ్తాల్‌తో పాటు మరికొన్ని గ్రామాల్లోనూ అనధికారిక లాక్‌డౌన్‌ను గ్రామస్థులే ప్రకటించుకున్నా రు. జనం ఎక్కువగా ఒకే చోట గుమిగూడకుండా చూసుకునేందుకే ఈ తరహా చర్యలను వీడీసీలు చేపడుతున్నాయి. ఇదిలా ఉండగా  కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ సైతం వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇద్దరు అడిషనల్‌ కలెక్టర్‌ల ను పర్యవేక్షణ కోసం పురమాయిస్తూ.. కలెక్టర్‌ మానిటరింగ్‌ను నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం 300వరకు వచ్చిన పాజిటివ్‌ కేసులు క్రమంగా దాదాపు 600వరకు చేరుకుంటుండడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమంటున్నారు. మొదట పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కరోనా వైరస్‌ తన రూపురేఖలు మార్చుకొని మళ్లీ సెకండ్‌ వేవ్‌ రూపంలో గ్రామాలను చుట్టుముడుతోంది. నిన్న మొన్నటి వరకు కరోనాపై పెద్దగా అవగాహన లేని పల్లె ప్రజలు తమ గ్రామాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతున్న కారణంగా స్వచ్ఛంధ టీకాల వైపు దృష్టి సారిస్తున్నారు. కరోనా పరీక్షల సంఖ్య ను పెంచిన వైద్యారోగ్య శాఖ అదేస్థాయిలో వ్యాక్సినేషన్‌ను కూడా చేపడుతోంది. మొదటి వేవ్‌ కరోనా పరిస్థితులకు భిన్నంగా ప్రస్తుత పరిస్థితులు నెలకొనడం ప్రజలనే కాకుండా.. యంత్రాంగాన్ని సైతం వణికిస్తోంది. అయి తే ప్రజలు మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్‌లను వినియోగించాలని, భౌతిక దూరం పాటించాలని కోరుతూ పోలీసులు, మున్సిపాలిటీలు ప్రచారా న్ని చేపడుతున్నాయి. ముఖ్యంగా పోలీసులు ప్రధాన చౌరస్తాల్లో మైకులను ఏర్పాటు చేసి మైకుల ద్వారా ప్రజలను అప్రమత్తం  చేస్తున్నారు. దీంతో పాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. 

గ్రామాల్లో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

గత నాలుగైదు రోజుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడం ఆందోళనకు కారణమవుతోంది. మొదట సోన్‌ మండలంలోని మాదాపూర్‌లో ప్రార్థనలు నిర్వహించిన 30 మందికి పాజిటివ్‌ రాగా.. గుండంపల్లిలో కూడా 30మందికి పైగా పాజిటివ్‌ వచ్చింది. ఆ తరువాత అన్ని గ్రామాల్లో ఇదే రీతినా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఆయా పీహెచ్‌సీల పరిధిలో రోజురోజుకు రెట్టింపవుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య యంత్రాంగాన్ని హడలెత్తిస్తుండగా.. పల్లె జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. అధికారులు పీహెచ్‌సీల పరిధిలో కరోనా టెస్టు సెంటర్‌లను ఏర్పాటు చేయడమే కాకుండా వ్యాక్సినేషన్‌ ను చేపట్టడంతో జనం దృష్టి అటు వైపు మరలుతోంది. దీంతో పాటు వైద్యారోగ్య శాఖ గ్రామ పంచాయతీ పరిధిలోనే వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను వ్యాక్సినేషన్‌లో భాగస్వాములను చేస్తున్నారు. వ్యాక్సినేషన్‌ చేయించుకున్న  వారు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. 

స్వచ్ఛంద లాక్‌డౌన్‌లకు వీడీసీల నిర్ణయం

 జిల్లాలోని పలు గ్రామాల్లో సమాంతర వ్యవస్థ నిర్వహిస్తున్న అక్కడి వీడీసీ(విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ)లు తమ తమ గ్రామాల్లో కరోనా కట్టడి చర్యలకు శ్రీకారం చుడుతున్నాయి. వీడీసీల మాట జవదాటేవారేవరు ఉండరు కనుక వారి మాటే శాసనంగా చెలామణి అవుతోంది. ఈక్రమంలో చాలా గ్రామాల్లోని వీడీసీలు కరోనా విషయంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా తమ గ్రామాల్లో ఉదయం నుంచి సాయంత్రం వర కు లాక్‌డౌన్‌ విధిస్తుండడమే కాకుండా పొరుగు జిల్లాల నుంచి వచ్చే వారి ని అడ్డుకుంటున్నారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో వీడీసీలు అత్యంత చొరవ తీసుకొని కరోనా కట్టడి చర్యలను అమలు చేస్తున్నాయి. గ్రామాల్లో సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని వ్యాక్సినేషన్‌తో పాటు ఉచితంగా శానిటైజర్‌లను అందించడం, మాస్క్‌లు అందించడం, ఇతర అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతున్నాయి. 

తండాలను వణికిస్తున్న కరోనా

జిల్లాలోని అనేక గిరిజన తండాలు, గూడాలను సైతం కరోనా మహమ్మారి వదిలిపెట్టడం లేదంటున్నారు. తండాలు, గూడాలకు చెందిన ఎక్కు వ మంది జనం కూలీ పనులకు వెళుతుండడంతో వారి ద్వారా వైరస్‌ మ రింత వేగంగా వ్యాపించే అవకాశం ఉందంటున్నారు. వైద్యారోగ్య శాఖ మారుమూల తండాలు, గూడాలకు సైతం చేరుకొని అక్కడ కరోనా కట్టడి చర్యలను చేపడుతోంది. అలాగే కరోనా తీవ్రతపై తండాల ప్రజలకు సరైన  అవగాహన లేని కారణంగా అనేక ప్రతికూలతలు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రజల్లో వ్యాధి తీవ్రతతో పాటు చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించే కార్యాచరణ మొదలైదంటున్నారు.

జిల్లాలో ఎప్పటికప్పుడు హైఅలర్ట్‌

కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ, డీఎంహెచ్‌వో ధన్‌రాజ్‌, డీసీహెచ్‌ దేవేంధర్‌రెడ్డిలు కరోనా కట్టడికి ఉమ్మడి యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయతలపెట్టారు. దీనిలో భాగంగా తండాల్లో కరోనా వైరస్‌ తీవ్రతను వారి దృష్టికి తీసుకురావాలని ఆశిస్తున్నారు. కలెక్టర్‌ ఇద్దరు అడిషనల్‌ కలెక్టర్‌లను కరోనా కట్టడి చర్యల కోసం పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. వీరు ప్రతిరోజూ అన్ని పీహెచ్‌సీల వారిగా పర్యటిస్తూ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని ముందు జాగ్రత్త చర్యలు ఎలా అమలవుతున్నాయనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఈ నివేదికలన్నీ సాయంత్రంలోగా సర్కారుకు చేరుకుంటున్నాయి. అలాగే పోలీసులు, గ్రామ పంచాయతీ అధికారు లు, రెవెన్యూ, మున్సిపల్‌ సిబ్బందిలు వైద్యారోగ్య శాఖలతో కలిసి ఉమ్మడి కట్టడి యాక్షన్‌ ప్లాన్‌ను అమలు చేయబోతున్నాయి. 

Updated Date - 2021-04-12T06:01:38+05:30 IST