కార్పొరేషన్‌లో సామగ్రి మాయం

ABN , First Publish Date - 2022-04-25T06:13:48+05:30 IST

రామగుండం కార్పొరేషన్‌ స్టోర్‌లో నుంచి సామగ్రి మాయమవుతోంది. దీంతోపాటు ఎలక్ర్టికల్‌, మంచినీటి సరఫరా విభాగాల్లో జరుగుతున్న అవకతవకలు వెలుగుచూస్తున్నాయి.

కార్పొరేషన్‌లో సామగ్రి మాయం

- రూ.10లక్షల విలువైన సీసీ కెమెరాల అడ్రస్‌ గల్లంతు

- మంచినీటి సరఫరా, ఎలక్ర్టికల్‌ విభాగాల్లో అవకతవకలు

- తీరు మార్చుకోని ఇంజనీరింగ్‌ విభాగం 

- అక్రమాలకు దన్ను

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 24:  రామగుండం కార్పొరేషన్‌ స్టోర్‌లో నుంచి సామగ్రి మాయమవుతోంది. దీంతోపాటు ఎలక్ర్టికల్‌, మంచినీటి సరఫరా విభాగాల్లో జరుగుతున్న అవకతవకలు వెలుగుచూస్తున్నాయి.  2020 సమ్మక్క - సారలమ్మ జాతర కోసం కార్పొరేషన్‌ రూ.10లక్షలతో సీసీ కెమెరాలు, మానిటర్లు, ఇతర సామగ్రి కొనుగోలు చేసింది. సమ్మక్క-సారలమ్మ జాతరలో వీటిని వినియోగించారు. అనంతరం కొనుగోలు చేసిన సీసీ కెమెరాలు, సామగ్రిని స్టోర్‌లో స్వాధీన పర్చుకున్నట్టు ధ్రువీకరించి బిల్లులు కూడా చెల్లించారు. ఈ సారి సమ్మక్క-సారలమ్మ జాతరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు పాత కెమెరాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. కానీ అవి స్టోర్‌లో లేకపోవడంతో విషయాన్ని బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తపడ్డారు. మళ్లీ రూ.12లక్షలతో జాతరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు పనులు అప్పగించారు. ఇటీవల సదరు కాంట్రాక్టర్‌కు బిల్లులు కూడా చెల్లించారు. కానీ ప్రస్తుతం స్టోర్‌లో నుంచి సుమారు 50 కెమెరాలు, ఇతర సామగ్రి మాయమయ్యాయి. సాధారణంగా మున్సిపాలిటీ కొనుగోలు చేసిన ప్రతీ వస్తువుకు లెక్క ఉంటుంది. సంబంధిత స్టోర్‌లో స్టోర్‌కీపర్‌ వద్ద స్టాక్‌ రిజిష్టర్‌ కూడా ఉంటుంది. మానిటరింగ్‌ అధికారి బాధ్యుడిగా ఉంటారు. ఒక అధికారి బదిలీ అయితే మరొక అధికారికి స్టాక్‌ రిజిష్టర్‌తో సహా చార్జ్‌ అప్పగించాల్సి ఉంటుంది. కానీ కార్పొరేషన్‌లో ఇవేమి పాటించడం లేదు. కీలకమైన ఎలక్ర్టికల్‌, మంచినీటి సరఫరా విభాగాల్లోనూ అదే తంతు సాగుతోంది. రూ.10లక్షల విలువైన సీసీ కెమెరాలు మాయమైనా ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం లేదు. ఐఏఎస్‌ అధికారి కమిషనర్‌గా వ్యవహరించిన సమయంలో కొనుగోలు చేసిన సీసీ కెమెరాలు ప్రస్తుతం మాయమయ్యాయి. ఎవరు తీసుకెళ్లారు అనే సమాచారం కూడా లేదు. 

 ఎలక్ర్టికల్‌ విభాగంలో అవకతవకలు..

రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎలక్ర్టికల్‌ విభాగంలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా విడి భాగాల కొనుగోళ్లు, కాంట్రాక్టుల విషయంలో గోల్‌మాల్‌ చోటు చేసుకుంది. టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లు సరఫరా చేయాల్సిన సామగ్రి కార్పొరేషన్‌కు చేరకుండానే రికార్డులు చేయడం, కాంట్రాక్టు ఉండగానే నామినేషన్‌ పనులపై అత్యవసర కొనుగోళ్లు జరిపినట్టు రికార్డులు చేశారు. స్టాక్‌ రిజిష్టర్లు మాత్రం కనబడకుండా మాయమయ్యాయి. ఎలక్ర్టికల్‌ విభాగంలోనే 2019-20 ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. 

 తీరుమారని కార్పొరేషన్‌..

రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రోజుకో అవినీతి బాగోతం వెలుగు చూస్తున్నా కార్పొరేషన్‌ తీరు మాత్రం మారడం లేదు. గతంలో స్ర్కాప్‌ చోరీకి గురి కావడం, కార్పొరేషన్‌ కమిషనరే లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. జరుగని పనిని జరిగినట్టు రికార్డులు తయారు చేయడంలో అధికారులు, కాంట్రాక్టర్లు మిలాకత్‌ అయి కార్పొరేషన్‌ ఖజానాకు భారీగా గండికొడుతున్నారు. ఈ పరిణామాల్లో సీసీ కెమెరాలు మాయమైన ఘటన వెలుగు చూసింది.

స్టాపర్స్‌ ఎక్కడ?

రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సమ్మక్క-సారలమ్మ జాతరకు సంబంధించి ట్రాఫిక్‌ నియంత్రణకు స్టాపర్స్‌ను కొనుగోలు చేయడం వినియోగించడం పరిపాటి. కొనుగోలు చేసిన స్టాపర్స్‌ను కార్పొరేషన్‌కు అప్పగించి కాంట్రాక్టర్‌ బిల్లులు తీసుకోవాల్సి ఉంటుంది. జాతర పూర్తయిన తరువాత వాటిని కార్పొరేషన్‌ స్టోర్‌లో భద్రపరుస్తారు. అవసరాన్ని బట్టి వినియోగించుకోవాల్సి వస్తుంది. సమ్మక్క జాతరలో వినియోగించిన స్టాపర్స్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి చేరడం లేదు.

 సీసీ కెమెరాలను చూడనే లేదు..

ఏఈ మునీందర్‌

రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎలక్ర్టికల్‌ స్టోర్‌లో సీసీ కెమెరాలు కానీ, దానికి సంబంధించిన సామగ్రి కూడా చూడలేదు. నాకు గతంలో పని చేసిన అధికారులెవరూ ఈ విషయమై చార్జి కూడా ఇవ్వలేదు. 


Updated Date - 2022-04-25T06:13:48+05:30 IST