ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ABN , First Publish Date - 2021-08-03T20:23:20+05:30 IST

ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లుకు లోక్‌సభ మంగళవారం

ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ : ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లుకు లోక్‌సభ మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో పని చేసే సిబ్బంది సమ్మె చేయకుండా నిరోధించేందుకు ఈ బిల్లును రూపొందించారు. దేశవ్యాప్తంగా 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో దాదాపు 70 వేల మంది పని చేస్తున్న విషయం గమనార్హం. 


ఈ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దేశ భద్రత, ప్రజల ఆస్తులు, ప్రాణాలను కాపాడటం కోసం అత్యవసర రక్షణ రంగ సేవల నిర్వహణ కోసం ఈ బిల్లును రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ క్రింద ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ పని చేస్తోంది. ఇది చాలా పురాతన, భారీ పారిశ్రామిక వ్యవస్థ. డిఫెన్స్ హార్డ్‌వేర్, ఎక్విప్‌మెంట్‌ను దేశీయంగా ఉత్పత్తి చేయడం కోసం సమగ్ర వ్యవస్థగా ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉపయోగపడుతోంది. సాయుధ దళాలకు యుద్ధ రంగంలో ఉపయోగపడే అత్యంత ఆధునిక ఎక్విప్‌మెంట్‌లో స్వయం సమృద్ధి సాధించడమే ఈ ఫ్యాక్టరీస్ లక్ష్యం. 


ఏదైనా పనిని నిలిపేయడం వల్ల డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ లేదా గూడ్స్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తే, ఆ కార్యకలాపాలను ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్‌గా ప్రకటించే అధికారం ఈ బిల్లు వల్ల ప్రభుత్వానికి లభిస్తుంది. ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్‌తో సంబంధం ఉన్న పారిశ్రామిక సంస్థలు, యూనిట్లను కూడా ఈ బిల్లు పరిధిలోకి తీసుకొచ్చారు. వీటిలో కూడా ఉద్యోగుల సమ్మెను నిషేధించే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది.


ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డును కార్పొరేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం జూన్‌లో ప్రకటించింది. ఇది జరిగితే అమ్యునిషన్, ఇతర ఎక్విప్‌మెంట్‌ను తయారు చేసే 41 ఫ్యాక్టరీలు ప్రభుత్వ యాజమాన్యంలోని 7 కార్పొరేట్ సంస్థల పరిధిలోకి వస్తాయి. 


Updated Date - 2021-08-03T20:23:20+05:30 IST