ఐఐటీహెచ్‌లో కాంటినెంటల్‌ హాస్పిటల్‌ సూపర్‌స్పెషాలిటీ క్లినిక్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2021-10-22T05:48:03+05:30 IST

సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్‌లో గురువారం ఉదయం కాంటినెంటల్‌ హాస్పిటల్‌ సూపర్‌స్పెషాలిటీ క్లినిక్‌ను ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి, కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌ సీఈవో రియాజ్‌ఖాన్‌ ప్రారంభించారు.

ఐఐటీహెచ్‌లో కాంటినెంటల్‌ హాస్పిటల్‌ సూపర్‌స్పెషాలిటీ క్లినిక్‌ ఏర్పాటు
సూపర్‌స్పెషాలిటీ క్లినిక్‌ను ప్రారంభిస్తున్న ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి, హాస్పిటల్స్‌ సీఈవో రియాజ్‌ ఖాన్‌

కంది, అక్టోబరు 21: సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీహెచ్‌లో గురువారం ఉదయం కాంటినెంటల్‌ హాస్పిటల్‌ సూపర్‌స్పెషాలిటీ క్లినిక్‌ను ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి, కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌ సీఈవో రియాజ్‌ఖాన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఎస్‌ మూర్తి మాట్లాడుతూ.. ప్రస్తుత యంత్రిక జీవన విధానంలో ఆరోగ్యంపై అశ్రద్ధ వహించడం మంచిదికాదని అభిప్రాయపడ్డారు. తమ క్యాంప్‌సలోని విద్యార్ధులు, అధ్యాపకులు, సిబ్బందికి ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఇక నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. అందుకే క్యాంపస్‌ ఆవరణలోనే క్లినిక్‌ను ఏర్పాటు చేయాలని కాంటినెంటల్‌ హాస్పిటల్‌ వారిని కోరామని బీఎస్‌ మూర్తి చెప్పారు. అడిగిన వెంటనే కాంటినెంటల్‌ హాస్పిటల్‌ వారు క్లినిక్‌ను ఏర్పాటు చేయడంతో బీఎస్‌ మూర్తి హాస్పిటల్‌ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌ సీఈవో రియాజ్‌ఖాన్‌ మాట్లాడుతూ  నాలుగు వేల మంది విద్యార్ధులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నారని, అలాగే ఐఐటీహెచ్‌ ఉద్యోగులు దాదాపు వెయ్యి మంది కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నారని, వారందరి ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని, అందరికీ మెరుగైన వైద్యం అందించాలనే ఉద్ధేశంతో క్యాంపస్‌ లోపలే సూపర్‌ స్పెషాలిటీ క్లినిక్‌ ఏర్పాటు చేశామని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం 83310 36099 నంబరుకు సంప్రదించాలని ఆయన కోరారు.  

Updated Date - 2021-10-22T05:48:03+05:30 IST