రైతులకు అన్నింటా అన్యాయమే...

ABN , First Publish Date - 2021-09-18T05:53:13+05:30 IST

రాష్ట్రంలో రైతులకు అన్నింటా అన్యాయమే జరుగుతున్నదని తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు అన్నారు.

రైతులకు అన్నింటా అన్యాయమే...
చోడవరంలో ర్యాలీ చేస్తున్న టీడీపీ నాయకులు

తెలుగురైతు రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు

రైతు వ్యతిరేక విధానాలపై టీడీపీ శ్రేణుల ఆందోళన

ర్యాలీని అడ్డుకున్న పోలీసులు


చోడవరం, సెప్టెంబరు 17: రాష్ట్రంలో రైతులకు అన్నింటా అన్యాయమే జరుగుతున్నదని తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లునాయుడు మాట్లాడుతూ, రైతులకు అందించే అన్ని పథకాలకు ప్రభుత్వం కోత పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం పండించిన రైతులకు సకాలంలో బిల్లులు చేతికి అందడం లేదని, రాయితీలకు ప్రభుత్వం మంగళం పాడిందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వ హయాంలో రైతు పూర్తిగా దోపిడీకి గురవుతున్నాడని వాపోయారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 


ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా టీడీపీ నాయకులు నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయం నుంచి కొద్ది దూరం రాగానే బలవంతంగా తహసీల్దార్‌ కార్యాలయం వైపుగా మళ్లించారు. ర్యాలీ పూర్తికాకుండానే పోలీసులు అడ్డుకోవడంతో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగి నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్‌ తిరుమలబాబుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జట్పీటీసీ మాజీ సభ్యుడు కనిశెట్టి మత్స్యరాజు, పార్టీ మండల అధ్యక్షుడు బొడ్డేడ నాగగంగాధర్‌, నాయకులు గోకివాడ కోటేశ్వరరావు, దేవపల్లి వెంకట అప్పారావు, రేవళ్లు త్రినాఽథ్‌, ఆర్‌ఆర్‌ పేట సర్పంచ్‌ బొడ్డేడ రామునాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-18T05:53:13+05:30 IST