Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతుల మహాపాదయాత్రకు మాజీ జేడీ లక్ష్మీ నారాయణ మద్దతు

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉండాలని కోరుతూ ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరిట మహా పాదయాత్ర చేపట్టిన రైతులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి గ్రామంలో వెంకటేశ్వరస్వామి రథానికి పూజలు చేసి, రైతులకు మంగళహారతులు పడుతున్నారు. కాగా.. ఇవాళ పాదయాత్రలో మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ను ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేకంగా పలకరించింది. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తేనే అభివృద్ధి అని ఆయన చెప్పుకొచ్చారు. 


అన్ని ప్రాంతాల్లో అక్కడి వనరులు, సౌలభ్యం మేరకే అభివృద్ధి అని మాజీ జేడీ చెప్పుకొచ్చారు. అయితే.. అవసరమైన చోట హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయొచ్చని లక్ష్మీనారాయణ తెలిపారు. పాదయాత్రకు మద్దతిచ్చినవారిపై కేసులు పెట్టడం సరికాదని.. అమరావతి ఉద్యమం ఏ ఒక్కరికో చెందినది కాదని మాజీ జేడీ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలుమార్లు మీడియా మీట్‌లు పెట్టి మరీ రైతులకు తాను మద్దతుగా నిలుస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాదు.. అప్పట్లో రైతుల శిబిరాల దగ్గరికెళ్లి మరీ లక్ష్మీనారాయణ సంఘీభావం తెలిపారు.

కాగా.. పాదయాత్రకు 35 రోజులు పూర్తయ్యాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లా గూడూరు మండలం పుట్టం వారి కండ్రిగలో మహాపాదయాత్ర సాగుతోంది. ఈ యాత్రకు పలు సంఘాల నాయకులు, ఐక్య కార్యచరణ సమితి నేతలు పాల్గొని రైతులతో కలిసి అడుగులేశారు. శనివారం నాడు పాదయాత్రలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాశిం సునీల్‌కుమార్‌, నెలవల సుబ్రహ్మణ్యం, కురుగొండ్ల రామకృష్ణ, పరసారత్నం, టీడీపీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌, తెలుగు మహిళ అధ్యక్షురాలు ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement