Abn logo
Oct 22 2021 @ 00:05AM

మహిళా కూలీలపై దూసుకెళ్లిన ఎక్సకవేటర్‌

ముగ్గురి మృతికి కారణమైన ఎక్సకవేటర్‌

ముగ్గురి మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

మైదుకూరు, అక్టోబరు 21: వ్యవసాయ పనులకు వెళ్లిన మహిళలు తిరిగి ఇంటికి చేరేందుకు ఆటో కోసం ఎదురు చూస్తూ మోరీపై కూర్చుని ఉండగా ఎక్సకవేటర్‌ దూసుకురావడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద సంఘటన గురువారం సాయంత్రం కడప జిల్లా మైదుకూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల సమాచారం మేరకు...

మైదుకూరు మున్సిపల్‌ పరిధిలోని కేశలింగాయపల్లెకు చెందిన పలువురు మహిళలు నిత్యం  వ్యవసాయ పనుల కోసం ఇతర గ్రామాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో సింగంశెట్టి మహాలక్షుమ్మ (40), గవ్వల శేషమ్మ (65), గవ్వల పుల్లమ్మ (60), పసల బాలగుర్రమ్మ, బండి పుల్లమ్మ, తుపాకుల వీరమ్మ, మరి కొందరు గురువారం ఉదయం పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని సాయంత్రం స్వగ్రామం వచ్చేందుకు ఆటోకోసం ఎదురుచూస్తూ ఆదిరెడ్డిపల్లె సమీపంలో వంక కల్వర్టుపై కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో మైదుకూరు వైపు వస్తున్న ఓ ఎక్సకవేటర్‌ వీరిపైకి దూసుకొచ్చింది. దీంతో మహాలక్షుమ్మ, శేషమ్మ, పుల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ బాలగుర్రమ్మ, బండి పుల్లమ్మ, వీరమ్మను 108 ద్వారా ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఎక్సకవేటర్‌ను స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అరెస్టు చేశారని సమాచారం.


అందరిదీ ఒకే గ్రామం..

కేశలింగాయపల్లెకు చెందిన దాదాపు 100 మంది మహిళలు తమ ఊరిలో పనులు లేక   నిత్యం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్తుంటారు. గురువారం అలా వెళ్లిన వారిలో ముగ్గురిని ఎక్సకవేటర్‌ బలితీసుకుంది. మృత్యువాత పడ్డ ముగ్గురూ వితంతువులు. వీరిలో గవ్వల శేషమ్మ, గవ్వల పుల్లమ్మ తోడికోడళ్లు. శేషమ్మకు ముగ్గురు కూతుళ్లు, గవ్వల పుల్లమ్మకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురుండగా, కొడుకు నాగేంద్ర ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. తల్లి మృత్యువాత పడటంతో హుటాహుటిన గ్రామానికి బయలు దేరాడు. మహాలక్షుమ్మకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. మృతులందరిదీ ఓకే గ్రామం కావడంతో ఆ ఊరంతా విషాదం అలుముకుంది.