విహారాలేనా.. ప్రారంభం ఎప్పుడు?

ABN , First Publish Date - 2022-02-17T07:24:46+05:30 IST

జనవరి 28న టీటీడీ ఛైర్మన్‌ ఎస్వీ సుబ్బారెడ్డి శ్రీనివాసం సర్కిల్‌ నుంచి నంది సర్కిల్‌వైపుగా వారధిపై కారులో ప్రయాణించారు.

విహారాలేనా.. ప్రారంభం ఎప్పుడు?
గరుడ వారధి

తిరుపతి వారధిపై ప్రజల్లో పెరుగుతున్న అసహనం


తిరుపతి- ఆంధ్రజ్యోతి

 జనవరి 28న టీటీడీ ఛైర్మన్‌ ఎస్వీ సుబ్బారెడ్డి శ్రీనివాసం సర్కిల్‌ నుంచి నంది సర్కిల్‌వైపుగా వారధిపై కారులో ప్రయాణించారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే వారధి ప్రారంభిస్తామని ప్రకటించారు.

 జనవరి 29 రాత్రి డిప్యూటీ మేయరు అభినయ్‌ రెడ్డి, కమిషనర్‌ గిరీష వారధిపై ప్రయాణించారు. ఫిబ్రవరి 16న సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటుందనీ, చిన్నచిన్న పనులు ఉంటే పూర్తిచేసుకోవాలని సూచించారు.  

 ఫిబ్రవరి 4న ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి, మేయరు  శిరీష ద్విచక్రవాహనాల్లో వారధిపై తిరిగారు. బస్టాండు నుంచి కపిలతీర్థం చేరుకోవాలంటే ప్రస్తుతం 20 నిమిషాలు పడుతోందని, వారధిపై 2 నిమిషాల్లోనే చేరుకోవచ్చన్నారు. 

 2021 నవంబరులో తిరుపతిలో దక్షిణమండలి సదస్సు జరిగింది. ఈ సమయంలో సీఎం జగన్‌ పూర్తయిన మేరకు వారధిని ప్రారంభిస్తారని హడావుడి చేశారు. మున్సిపల్‌ పార్క్‌ ఎదురుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు కూడా చేశారు. 

 గత ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో స్వామికి పట్టువస్త్రాలు అందజేసేందుకు వస్తున్న సందర్భంలో సీఎం జగన్‌ వారధిని ప్రారంభిస్తారని ప్రచారం చేశారు.

ఇవేవీ ఆచరణలో నిజం కాలేదు. వీఐపీలు వారధిమీద విహరిస్తూ నగరాన్ని వీక్షించి మురిసిపోతున్నారు. అధికారులు వారధిమీద తరచూ పర్యటిస్తూ హడావుడి చేస్తున్నారు. పూర్తయిన మేరకు అయినా ప్రారంభం చేయకుండా జాప్యం ఎందుకు చేస్తున్నారని తిరుపతి నగరప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారధి స్తంభాలమీద రేఖాచిత్రాలు, వారధి కింద మొక్కల పెంపకం వంటి ఏర్పాటు చూసి, కనీసం బస్టాండు నుంచి కపిలతీర్థం దాకా అయినా రయ్‌ రయ్‌ మంటూ దూసుకుపోవచ్చని ఆశపడుతున్నారు. శ్రీనివాస సేతుగా పేరు మార్చిన గరుడవారధి నిర్మాణం, ఒప్పందం ప్రకారం నిజానికి ఏడాది కిందటే పూర్తికావాలి. 2019 ఫిబ్రవరిలో అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనికి శంకుస్థాపన చేశారు. ప్రారంభమైన ఆరు నెలలవరకు పనులు వేగంగా సాగాయి. అత్యాధునిక యంత్రాలతో, ఆధునిక నిర్మాణ పరిజ్ఞానంతో పనులు సాగుతున్న తీరును బట్టి గడువు తేదీకన్నా ముందే వారధి నిర్మాణం పూర్తవుతుందని అంచనా వేశారు.  ఇంతలో ఎన్నికలు జరిగాయి. జగన్‌ అధికారంలోకి రాగానే రివర్స్‌ టెండర్‌ అంటూ అన్ని పనులకూ బ్రేక్‌ పడినట్టే గరుడవారధి పనులూ ఆగిపోయాయి. స్థానికంగా దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో మూడు నెలల తర్వాత మళ్లీ పనులు మొదలు పెట్టారు. కరోనా లాక్‌డౌన్‌ రావడంతో కొంతకాలం పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత నిధులు విడుదల చేయకపోవడంతో వేగంగా సాగుతున్న పనులు నత్తలా జరుగుతున్నాయి. ప్రస్తుతం కపిలతీర్థం నుంచి బస్టాండు వరకు రాకపోకలకు అనువుగా నిర్మాణం  పూర్తయింది. ఈ పరిధిలో రాకపోకలను అనుమతించవచ్చు. ఇందువల్ల ట్రాఫిక్‌ చిక్కు నుంచి తిరుపతి ప్రజలు ఎంతో కొంత బయటపడతారు. ప్రస్తుతం పూర్ణకుంభం, టీఎంఆర్‌, లీలామహల్‌ కూడళ్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌ కష్టాలతో ప్రజలు నరకం చూస్తున్నారు. 


జాప్యం ఎందుకు?

వారధిని ప్రారంభించాలని ఎమ్మెల్యే కరుణాకర్‌ రెడ్డితో పాటు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్డారెడ్డి సీఎం జగన్మోహన రెడ్డిని కోరినట్టు తెలిసింది. ఆయన తొలుత అంగీకరించడంతో సీఎం చేతులమీదుగా ప్రారంభిస్తున్నామని ఉత్సాహంగా ప్రకటనలు ఇచ్చేశారు. అయితే 7కి.మీ మొత్తం వారధి కాకుండా 3కి.మీ తొలిదశ వారధి మాత్రమే పూర్తయిందని తెలుసుకున్న సీఎం ప్రారంభానికి ఆసక్తి చూపలేదని అంటున్నారు. దీంతో వర్చువల్‌గా సీఎంకు వివరించి, టీటీడీ, కార్పొరేషన్‌ పెద్దలతోనే ప్రారంభించేద్దామని ఎమ్మెల్యే భావిస్తున్నట్టు చెబుతున్నారు. సీఎం లేకుండా ప్రారంభించాలనుకుంటే ఎవరిని పిలవాలనే సందిగ్ధం అధికారుల్లో ఉంది.  జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటు పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి మేకపాటిని కూడా పిలవాల్సి ఉంటుంది. ఈ బాధ్యతను తీసుకునేందుకు జిల్లా ప్రజాప్రతినిధులు పెద్దగా చొరవ తీసుకోవడం లేదంటున్నారు. దీంతో అధికారులు కూడా మనకెందుకులే అని ఊరుకుంటున్నట్టు తెలుస్తోంది. 


తిరుపతి జనం తిరగబడితే...?

చెన్నైలోని పొరూరు వద్ద ఏడాది క్రితం నిర్మితమైన వారధిని ఈ సందర్భంగా తిరుపతి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అక్కడి ప్రభుత్వ పెద్దలకు పొత్తులు కుదరక, ఎంతకీ వంతెన ప్రారంభించలేదు. దీంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.  ప్రభుత్వంతో పనిలేకుండా ప్రజలే తిరగబడి వాహనాలను వారధిపైకి మళ్లించారు. ఆ తర్వాత పదిరోజులకు చేసేదేమీ లేక ప్రభుత్వం జెండా ఊపి మమ అనిపించుకుంది. గరుడవారధి ప్రారంభంలో ఇంకా జాప్యం జరిగితే పోరూరు వంతెన పరిస్థితే తిరుపతిలోనూ ఏర్పడుతుందని అంటున్నారు. 

Updated Date - 2022-02-17T07:24:46+05:30 IST