కొత్త మండలాల ఏర్పాటుకు కసరత్తు

ABN , First Publish Date - 2021-06-24T06:52:00+05:30 IST

జిల్లాలో మరో రెండు మండలాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కొత్త మండలాల వివరాలు, సంబంధిత మ్యాప్‌, వాటి పేర్లు, జనాభా, గ్రామ పంచాయతీలు తదితర వివరాలతో ప్రభుత్వానికి జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు.

కొత్త మండలాల ఏర్పాటుకు కసరత్తు

- కొత్తగా బీమారం, ఎండపల్లి-రాజారాంపల్లిలకు ప్రతిపాదనలు

- ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉన్న ఫైల్‌

జగిత్యాల, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో రెండు మండలాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది.  ఇప్పటికే కొత్త మండలాల వివరాలు, సంబంధిత మ్యాప్‌, వాటి పేర్లు, జనాభా, గ్రామ పంచాయతీలు తదితర వివరాలతో ప్రభుత్వానికి జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. కొత్త మండలాల ఏర్పాటు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. సాధ్యమైనంత తొందరలో కొత్త మండలాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఉన్న వెల్గటూరు మండలం నుంచి కొత్తగా ఎండపల్లి- రాజారాంపల్లి మండలాన్ని, మేడిపల్లి మండలం నుంచి బీమారం మండలాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దకు వెళ్లాయి. 

- మేడిపల్లి పునర్విభజనతో బీమారం.. 

జిల్లాలో వేములవాడ నియోజకవర్గ పరిధిలో గల మేడిపల్లి మండలాన్ని పునర్విభజన చేసి కొత్తగా బీమారం మండలాన్ని ఏర్పాటు చేయనున్నారు. మేడిపల్లి మండలంలో ఉన్న 29 గ్రామాలను విభజించి 10 గ్రామాలను మేడిపల్లిలో, తొమ్మిది గ్రామాలను కొత్తగా ఏర్పడే బీమారం మండలంలో కలపనున్నారు. బీమారం మండలంలో గోవిందారం, బీమారాం, పసునూరు, మన్నెగూడం, ఒడ్డెడు, లింగంపేట, రాగోజిపేట, రంగాపూర్‌, వెంకట్రావుపేట గ్రామాలు ఉండనున్నాయి. మేడిపల్లి మండలంలో కట్లకుంట, పోరుమళ్ల, తొంబార్రావుపేట, మేడిపల్లి, వల్లంపల్లి, మాచాపూర్‌, దమ్మన్నపేట, కల్వకోట, కాచారం గ్రామాలు ఉండేవిధంగా ప్రతిపాదనలు పంపారు. మేడిపల్లి మండ లంలో 10 గ్రామాలు, 23,796 ఎకరాల స్థలం, 29,847 జనాభా ఉండనుంది. అదే విధంగా బీమారం మండలంలో తొమ్మిది గ్రామాలు, 27,784 ఎకరాల స్థలం, 21,362 మంది జనాభా ఉండనుంది. ఈ రెండు మండలాలను ఇటీవల కొత్తగా ఏర్పడ్డ కోరుట్ల రెవెన్యూ డివిజన్‌ పరిధిలో కొనసాగించే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరాయి.

- వెల్గటూరు పునర్విభజనతో ఎండపల్లి-రాజారాంపల్లి..

జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గ పరిధిలో గల వెల్గటూరు మండలాన్ని పునర్విభజన చేసి కొత్తగా ఎండపల్లి-రాజారాంపల్లి మండలాన్ని ఏర్పాటు చేయను న్నారు. ప్రస్తుతం వెల్గటూరు మండలంలో 27 గ్రామ పంచాయతీలున్నాయి. 15 గ్రామపంచాయతీలతో ఎండపల్లి-రాజారాంపల్లి మండల ఏర్పాటుకు ప్రతిపాదనాలు పంపారు. ఇందులో ఎండపల్లి, రాజారాంపల్లి, గుల్లకోట, చెర్లపల్లి, అంబారిపేట, కొత్తపేట, పడ్కల్‌, గొడిశెలపేట, శానబండ, పాతా గూడూర్‌, సూరారం, కొండాపూర్‌ గ్రామాలతో పాటు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పరిధిలో ప్రస్తుతం ముంజపల్లి, మారేడుపల్లి, ఉండెడ గ్రామాలతో మండలాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపారు. కొత్తగా ఏర్పాటు కాబోయే ఎండపల్లి-రాజారాంపల్లి మండలంలో 25,277.17 ఎకరాలు, 27,758 జనాభాను ప్రతిపాదించారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న వెల్గటూరు మండలంలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. పునర్విభజన తదుపరి వెల్గటూరు మండలంలో 15 గ్రామ పంచాయతీలుండనున్నాయి. వెల్గటూరు, కుమ్మరిపల్లి, స్తంబంపల్లి, వెంకటాపూర్‌, పాశిగాం, కిషన్‌ రావుపేట, జగదేవ్‌పేట, కప్పారావుపేట, ముక్కట్‌రావుపేట, ముత్తనూర్‌, రామ్‌నూర్‌, చెగ్యాం, శాఖాపూర్‌, పైడిపల్లిలతో పాటు ప్రస్తుత బుగ్గారం మండలంలో గల బీరసాని గ్రామ పంచాయతీలతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు వెళ్లాయి. పునర్విభజన తదుపరి వెల్గటూరు మండలంలో 26,452 ఎకరాల స్థలం, 26,028 మంది జనాభా ఉండే విధంగా ప్రతిపాదించారు. వెల్గటూరు, ఎండపల్లి-రాజారాంపల్లి మండలాలు జగిత్యాల రెవెన్యూ డివిజన్‌ పరిధిలో పనిచేసే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి.  వారం రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లయితే ప్రస్తుతం ఉన్న 18 మండలాలకు తోడు కొత్త మండలాలు 2 కలుపుకొని 20 మండలాలతో జిల్లా స్వరూపం మారనుంది. 

- ధర్మపురి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు డిమాండ్‌..

జిల్లాలో కొత్తగా ధర్మపురి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు డిమాండ్‌ ఉంది. కొత్తగా ధర్మపురి, బుగ్గారం, బీర్పూర్‌, గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూరు తదితర మండలాలతో ధర్మపురి డివిజన్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఉంది. అదే విదంగా మెట్‌పల్లి, రేగుంట, ఆరపేట, వెంకట్రావుపేట గ్రామాలతో మెట్‌పల్లి అర్బన్‌ మండలం, కోరుట్ల, ఎకిన్‌పూర్‌ గ్రామాలతో కోరుట్ల అర్బన్‌ మండలాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఉంది. కొత్తగా మరో రెవెన్యూ డివిజన్‌, అర్బన్‌ మండలాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు మరింత పరిపాలన సౌలభ్యం ఉంటుందన్న అభిప్రాయాలున్నాయి.


Updated Date - 2021-06-24T06:52:00+05:30 IST