25 ఏళ్లుగా ల్యాండ్ టైటిల్ కోసం పోరాడుతున్న ఎయిర్‌ఫోర్స్ మాజీ ఉద్యోగి.. కుమారుడి ఆన్‌లైన్ ప్రచారంతో స్పందించిన మంత్రి!

ABN , First Publish Date - 2021-10-10T01:04:22+05:30 IST

ఆయన పేరు కృష్ణమూర్తి ఎస్. భారత వాయుసేనలో పనిచేసి రిటైరయ్యారు. ఇప్పుడాయన వయసు

25 ఏళ్లుగా ల్యాండ్ టైటిల్ కోసం పోరాడుతున్న ఎయిర్‌ఫోర్స్ మాజీ ఉద్యోగి.. కుమారుడి ఆన్‌లైన్ ప్రచారంతో స్పందించిన మంత్రి!

బెంగళూరు: ఆయన పేరు కృష్ణమూర్తి ఎస్. భారత వాయుసేనలో పనిచేసి రిటైరయ్యారు. ఇప్పుడాయన వయసు 82 సంవత్సరాలు. ఉత్తర బెంగళూరులోని వాడెరహళ్లి గ్రామంలో 1995లో అరెకరా భూమిని కొనుగోలు చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సేల్ డీడ్ నమోదు చేసినప్పటికీ ఆయన పేరుపై భూమి టైటిల్ నమోదు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఫలితంగా 25 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. అధికారుల చుట్టూ, ఏజెంట్ల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు. 


ల్యాండ్ టైటిల్ నమోదు కోసం తండ్రి పడుతున్న కష్టాలను చిన్నప్పటి నుంచి చూస్తున్న ఆయన కుమారుడు మోహన్ కె. రంగంలోకి దిగారు. నవంబరు 2017లో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ విషయంపై సమీక్ష జరపాలని బెంగళూరు డిప్యూటీ కమిషనర్ (డీసీ)ని కోర్టు ఆదేశించింది. అంతేకాదు, ఈ విషయంలో దర్యాప్తుకు ఏదైనా కమిటీ అవసరం అనుకుంటే నేటి (ఉత్తర్వులు జారీచేసినప్పటి) నుంచి నాలుగు వారాల్లోగా నియమించాలని, ఆరు నెలల్లో ముగించాలని స్పష్టంగా పేర్కొంది.


కోర్టు ఆదేశాలు కూడా బుట్టదాఖలయ్యాయి. సమస్య డీసీ కార్యాలయంలోనే ఆగిపోయింది. ఆ తర్వాత కృష్ణమూర్తి పార్కిన్సన్స్ బారినపడడంతో ఈ విషయంపై ఆయన శ్రద్ధ చూపలేకపోయారు. దీంతో కొందరు స్థానికులు ఆ భూమిని ఆక్రమించుకున్నారు. అప్పటికే ఆ భూమిలో ఉన్న షెడ్డు పైకప్పును తొలగించి పూర్తిగా తమ స్వాధీనం  చేసుకున్నారు. ఆ తర్వాత దానిని గేదెల షెడ్డుగా మార్చారు. 


సమస్య పరిష్కారం కోసం ఏజెంట్లను ఆశ్రయిస్తే భూమి ప్రస్తుత విలువలో 10-15 శాతం ముట్టజెబితే రెవెన్యూ అధికారులు ఈ విషయంలో దృష్టిసారిస్తారని, ఖాతా రిజిస్టర్ అవుతుందని చెప్పడంతో ఆశ్చర్యపోయానని మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.


ఇలా అయితే లాభం లేదనుకున్న మోహన్ తమ సమస్యను సోషల్ మీడియా వేదికగా పదిమందితో పంచుకున్నారు. అంతేకాకుండా change.org ద్వారా గత కొన్ని రోజులుగా ప్రచారం ప్రారంభించారు. ఫలితంగా ఇప్పటి వరకు దాదాపు 500 మంది మోహన్‌కు అండగా నిలుస్తూ పిటిషన్‌పై సంతకాలు చేశారు. దీంతో విషయం కాస్తా రెవెన్యూ మంత్రి ఆర్ అకోశ్ దృష్టికి చేరింది. వెంటనే స్పందించిన ఆయన వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని డీసీ కార్యాలయాన్ని ఆదేశించారు. 

Updated Date - 2021-10-10T01:04:22+05:30 IST