Abn logo
Sep 18 2021 @ 00:08AM

నేటి వరకు బయోమెట్రిక్‌కు గడువు పెంపు

రాజాం: జిల్లాలో మునిసిపాలిటీల్లోని మహిళా సంఘాల సభ్యుల వేలిముద్రల సేకరణకు గడువును శనివారం వరకు పెంచారు. వేలిముద్రల సేకరణకు సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతుండడంతో మహిళా సంఘ ప్రతినిధులు ఇబ్బందులుపడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 70 శాతం వరకే ఈ ప్రక్రియ సాగింది. దీంతో ఇంకా 30 శాతం వేలిముద్రల సేకరణ చేపట్టాల్సి ఉండడంతో ఈ గడువును పెంచారు.  సర్వస్‌ సమస్య కారణంగా వేలిముద్రలు పడకుంటే ఐరీస్‌ తీసుకోవాలని కూడా ఉన్నతాధికారులు ఆదేశించారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు  రాజాం, ఇచ్చాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస మునిసిపాలిటీలతో పాటు పాలకొండ నగరపంచాయతీలున్నాయి. వీటి పరిధిలో 4,757 సంఘాలలో 47,675 మంది సభ్యులున్నారు.  శుక్రవారం సాయత్రం నాటికి జిల్లా 70 శాతం బయోమెట్రిక్‌ పూర్తి చేశారు. అయితే మిగిలిన వారి బయోమెట్రిక్‌కు సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విషమమై మెప్మాపీడీ కిరణ్‌కుమార్‌ను వివరణ కోరగా ఇప్పటి వరకు 70 శాతం బయోమెట్రిక్‌ పూర్తయిందని, అయితే ఉన్నతాధికారులు ఇచ్చిన గడువు తక్కువగా ఉన్నందున మిగిలిన 30 శాతం బయోమెట్రిక్‌ సేకరణను శనివారం సాయంత్రం వరకు గడువు పెంచినట్లు చెప్పారు. సర్వర్‌ సమస్య ఏర్పడితే  ఐరీస్‌ సేకరించాలని ఆదేశించామన్నారు.