తులసిపహాడ్‌లో పేలుడు సామగ్రి లభ్యం

ABN , First Publish Date - 2021-10-18T05:53:23+05:30 IST

ఒడిశా రాష్ట్రంలోని తులసిపహాడ్‌ అటవీప్రాంతంలో మావోయిస్టులకు చెందిన మరికొంత సామగ్రిని స్వాధీనపర్చుకున్నట్టు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ ప్రహ్లాద్‌ మీనా ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

తులసిపహాడ్‌లో పేలుడు సామగ్రి లభ్యం
తులసీపహాడ్‌ అటవీప్రాంతంలో లభ్యమైన పేలుడు పదార్థాలు

  


జనజీవన స్రవంతిలో కలిస్తే పునరావాసం కల్పిస్తాం 

మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ ప్రహ్లాద్‌ మీనా వెల్లడి

సీలేరు, అక్టోబరు 17: ఒడిశా రాష్ట్రంలోని తులసిపహాడ్‌ అటవీప్రాంతంలో మావోయిస్టులకు చెందిన మరికొంత సామగ్రిని స్వాధీనపర్చుకున్నట్టు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ ప్రహ్లాద్‌ మీనా ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మావోయిస్టులు విధ్వంసక చర్యలకు పాల్పడడానికి వ్యూహరచన చేసేందుకు మత్తిలి పోలీస్టేషన్‌ పరిధిలోని తులసిపహాడ్‌ అటవీ ప్రాంతంలో సమావేశమయ్యారన్న నిఘా వర్గాలకు అందిన పక్కా సమాచారం మేరకు దాడి చేసినట్టు చెప్పారు.  దట్టమైన అటవీప్రాంతం, ఎత్తయిన కొండలు ఉండడంతో మావోయిస్టులు అక్కడ నుంచి తప్పించుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు. కాల్పుల అనంతరం ఆ ప్రాంతాన్ని తమ గాలింపు బలగాలు  తనిఖీ చేయగా.. మరికొన్ని పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రి లభ్యమైందన్నారు. లభ్యమైన వాటిలో 8 డిటోనేటర్లు, ఒక 12 వాట్స్‌ బ్యాటరీ, మావోయిస్టుల విప్లవ సాహిత్యం, రెండు మావోయిస్టుల కిట్‌ బ్యాగ్‌లు, రెండు యూనిఫారమ్స్‌, ఒక మెడికల్‌ కిట్‌, రెండు టార్చిలైట్లు, ఇతర సామగ్రి ఉన్నాయన్నారు. ఇప్పటికైనా మావోయిస్టులు హింసా మార్గాన్ని విడనాడి జనజీవన స్రవంతిలో కలసిపోవాలని, స్వచ్ఛందంగా లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీని, ఉపాధి కల్పిస్తామని ఎస్పీ ప్రహ్లాద్‌ మీనా పిలుపునిచ్చారు.

Updated Date - 2021-10-18T05:53:23+05:30 IST