అసాధారణ భద్రత.. అప్రకటిత కర్ఫ్యూ

ABN , First Publish Date - 2020-09-19T10:16:24+05:30 IST

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దివ్యరథం దగ్థం ఘటన అనంతర పరిస్థితుల్లో బీజేపీ నాయకులపై పెట్టిన అక్రమ

అసాధారణ భద్రత.. అప్రకటిత కర్ఫ్యూ

బీజేపీ చలో అమలాపురంలో అరెస్టుల పర్వం

ఎమ్మెల్సీ మాధవ్‌ సహా 60మంది బీజేపీ నేతలు అరెస్టు

పోలీసు దిగ్బంధనంలో అమలాపురం 12:12 అక 19ఖ్ఛిఞ20

పరిస్థితిని సమీక్షించిన డీఐజీ కేవీ.మోహనరావు 

నేతల కోసం పోలీసుల జల్లెడ.. ఇటు గృహనిర్భందాలు


అమలాపురం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దివ్యరథం దగ్థం ఘటన అనంతర పరిస్థితుల్లో బీజేపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండు చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు శుక్రవారం చేపట్టిన ‘చలో అమలాపురం’ ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసుల నిషేధాజ్ఞలు సైతం ఉల్లంఘించి ఆందోళనకు దిగిన 60 మందికి పైగా బీజేపీ రాష్ట్ర నాయకులను అరెస్టుచేసి జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ముఖ్యమంత్రి జగన్మోన్‌రెడ్డి డౌన్‌డౌన్‌ అంటూ బీజేపీ నాయ కులు పెద్దపెట్టున నినాదాలు ఇవ్వడంతోపాటు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీని వాస్‌ను తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండు చేస్తూ ప్రభుత్వం హిందూ దేవాలయాల విషయంలో అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. అసాధారణ భద్రతను సైతం ఛేదించి గడియార స్తంభం సెంటర్‌లో వేర్వేరుగా బీజేపీ నాయకులు ఆందోళనకు సిద్ధమయ్యారు. వారిని వెంటనే పోలీసులు అరెస్టుచేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.


తొలుత బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు, ఆ పార్టీ మహిళానేత సాధినేని యామినీశర్మల ఆధ్వర్యంలో కొందరు బీజేపీ నాయకులు ప్రభు త్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేస్తూ వెంకటరమణ థియేటర్‌ సందు వైపు నుంచి గడియార స్తంభం సెంటర్‌కు వస్తున్నప్పుడు వారిని పోలీసులు అడ్డగించారు. కొద్దిసేపు తోపులాట అనంతరం వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కె అగ్రహారం నుంచి బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయ ణరాజు, రాష్ట్ర కోశాధికారి వామరాజు సత్యమూర్తి, రాష్ట్ర కార్యదర్శి నీలకంఠ హరీష్‌లతో పాటు పలువురు నాయకులు నినాదాలు ఇస్తూ బ్యాంకు స్ర్టీట్‌ మీదు గా గడియార స్తంభం సెంటర్‌కు చేరుకున్నారు. పోలీసులు వారిని తీవ్రంగా ప్రతిఘటించే సమయంలో మాధవ్‌, సూర్యనారాయణరాజు, నాయకులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారందరినీ అదుపు లోకి తీసుకుని ప్రత్యేక వాహనాల్లో తరలించారు.


ఎమ్మెల్సీ మాధవ్‌ను తుని తీసుకువెళ్లి అక్కడినుంచి కోటనందూరు  తీసుకువెళ్లారు. యామినీని అంబాజీపేట, రమేష్‌నాయుడును పి.గన్నవరం పోలీస్‌ స్టేషన్లకు తీసుకువెళ్లారు. వీరితోపాటు అమలాపురం పార్లమెంటరీ పార్టీ బీజేపీ అధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీవేమా, పార్టీ నాయకులు కాటా బాలయ్య, ఆకుల వీరబాబు, పాలూరి సత్యానందం, కటికిరెడ్డి గంగాధర్‌, పాలూరి శ్రీనివాస్‌, అయ్యల బాషా, నాగరాజు, గనిశెట్టి బాబి, దుర్గాప్రసాద్‌ తదితరులను పోలీసులు అరెస్టుచేశారు. అర్ధరాత్రి వేళ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.విష్ణువర్థన్‌రెడ్డిని ఒక అపార్టుమెంటులో అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తర లించారు. ఎనిమిది కేసుల్లో 60 మంది బీజేపీ నేతలను అరెస్టు చేసినట్టు అమలాపురం డీఎస్పీ షేక్‌ మసూమ్‌బాషా తెలిపారు. శుక్రవారం కోనసీమ వ్యాప్తంగా పోలీసులు అసాధారణ రీతిలో భద్రతా చర్యలు చేపట్టారు. సుమారు వెయ్యి మంది పోలీసులతో చలో బీజేపీ కార్యక్రమాన్ని జరగనివ్వకుండా అడ్డుకునేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు.


ఈ క్రమంలో అమలాపురం పట్టణంలో అప్రకటిత కర్ఫ్యూ అమలయ్యింది. పట్టణంలోకి వచ్చే అన్ని రహదా రులపై ప్రతి కూడలిలోను డీఎస్పీ స్థాయి అధికారులతో పోలీస్‌ పికెట్‌లు, బారికేడ్లు, ఇనుప కంచెలు ఏర్పాటుచేసి నిలువరింపచేశారు. ఆర్డీవో కార్యాలయానికి వెళ్లే నల్లవంతెన-ఎర్రవంతెన మధ్య ఉన్న ఎన్టీఆర్‌ మార్గ్‌ రహదారిపై ఇనుప కంచెలను సైతం ఏర్పాటుచేసి ఎవరినీ రాకుండా అడ్డగించారు. పట్టణంలో ఆర్టీసీ బస్సులతో పాటు వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థల న్నింటినీ సంపూర్ణంగా మూయించివేశారు. ముఖ్యం గా ఎంసెట్‌, డిగ్రీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు పడ్డ కష్టాలు వర్ణనాతీతం. ఏలూరు  రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు అమలాపురంలోనే మకాంవేసి భద్రతా చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నారాయణన్‌నాయక్‌తోపాటు ఇద్దరు ఎస్పీలు, నలుగురు ఏఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 29మంది సీఐలు, 30 మంది ఎస్‌ఐలు, 450 మంది మహిళా, కానిస్టేబుళ్లు, 150మంది హోం గార్డులను అమలాపురంలో బందోబస్తుకు వినియో గించారు. మరో 250 మందిని కోనసీమ వ్యాప్తంగా ప్రధాన రహదారులపై పికెట్‌ల్లో వినియోగించారు. 

Updated Date - 2020-09-19T10:16:24+05:30 IST