ఆ ఫ్రెండ్‌ రిక్టెస్ట్‌.. డోంట్‌ యాక్సెప్ట్‌..!

ABN , First Publish Date - 2021-01-09T06:57:44+05:30 IST

పదుల సంఖ్యలో

ఆ ఫ్రెండ్‌ రిక్టెస్ట్‌..  డోంట్‌ యాక్సెప్ట్‌..!


ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రొఫైళ్లతో సైబర్‌ నేరగాళ్ల వల

ఆన్‌లైన్‌ రిలేషన్‌షిప్‌తో మోసాలు

నైజీరియన్‌ ముఠా ఆటకట్టించిన..

రాచకొండ పోలీసులు 

ఐదుగురి అరెస్టు


హైదరాబాద్‌ సిటీ, జనవరి 8(ఆంధ్రజ్యోతి) : పదుల సంఖ్యలో ఫేస్‌బుక్‌ నకిలీ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేస్తారు.. వివిధ దేశాలకు చెందిన అందమైన అమ్మాయిలు, అబ్బాయిల ఫొటోలు ప్రొఫైల్‌ పిక్‌గా ఉంచుతారు. ఇండియాలోని వివిధ నగరాలకు చెందిన యువకులు, యువతులకు ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపుతారు. యాక్సెప్టు చేసిన వారితో చాటింగ్‌లు చేస్తారు. చక్కటి సందేశాలతో ఆకట్టుకుంటూ, మంచి స్నేహితులుగా నటించి ప్రేమ, పెళ్లి పేరుతో ముగ్గులోకి దింపుతారు. ‘‘అమెరికా నుంచి అనుకోకుండా మీ నగరానికి వస్తున్నాను.. నీ కోసం విలువైన బహుమతులెన్నో తెస్తున్నా’’ అని నమ్మిస్తారు. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టుల నుంచి కస్టమ్స్‌ అధికారులుగా ఫోన్‌లు చేస్తారు. ‘‘మీకు కాబోయే భార్య/భర్త ఫారిన్‌ నుంచి వచ్చారు. కోట్లాది రూపాయల విలువైన బహుమతులు, బంగారం తెచ్చారు. కస్టమ్స్‌ చార్జీల కింద కొంత డబ్బు చెల్లించాలి’’ అని నమ్మించి దండుకుంటారు. ఆ తర్వాత ఫోన్‌లు స్విచాఫ్‌ చేస్తారు. పాత సైబర్‌ మోసాలనే కొత్త పంథాలో చేస్తూ రూ.లక్షలు కొల్లగొడుతున్న ఇటువంటి నైజీరియన్‌ ముఠా ఆటకట్టించారు రాచకొండ పోలీసులు. మొత్తం ఐదుగురిని ఢిల్లీలో అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ ఎల్‌బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. 

ఎల్‌బీనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఫేస్‌బుక్‌లో సోఫియా అలెక్స్‌ అనే యువతి నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్టు వచ్చింది. ఆ యువతి ప్రొఫైల్‌ చూసిన అతను రిక్వెస్టును యాక్సెప్టు చేశారు. తను పుట్టింది ఆస్ట్రేలియాలో.. ప్రస్తుతం ఒక కూతురితో కలిసి లండన్‌లో ఒంటరిగా ఉంటున్నాను అంటూ ఫేస్‌బుక్‌ పేజీలో రాసుకుంది. నగర యువకునితో స్నేహం పెంచుకొని రోజూ చాటింగ్‌ చేసేది. కొద్ది రోజుల్లోనే అతన్ని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపింది. అనుకోకుండా హైదరాబాద్‌ వస్తున్నానని, తన కోసం విలువైన బహుమతులు తెస్తున్నానని చెప్పింది. ఇద్దరం కలుసుకున్నాక పెళ్లి చేసుకుందామని నమ్మించింది. .


రెండు రోజుల తర్వాత..

ఆ యువకుడికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘‘ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్‌ అధికారులం మాట్లాడుతున్నాం.. సోఫియా అలెక్స్‌ అనే యువతి లండన్‌ నుంచి వచ్చింది. ఆమె వద్ద 75000 ఫౌండ్స్‌తో పాటు రూ. కోట్ల విలువైన బంగారం, వజ్రాలు ఉన్నాయి. వాటిని మీ కోసం తెచ్చినట్లు చెబుతోంది. ఆమె ఇప్పుడు మా కస్టడీలో ఉంది. ఇండియన్‌ కరెన్సీ రూపంలో జీఎస్‌టీ, కస్టమ్స్‌ క్లియరెన్స్‌ తదితర చార్జీలు చెల్లించాలి.’’ అన్నారు. వారి మాటలు నమ్మిన యువకుడు విడతల వారీగా రూ. 4.83 లక్షలు వారు చెప్పిన ఖాతాల్లో జమ చేశాడు. ఆ తర్వాత ఇంకా డబ్బులు చెల్లించాలని కోరడంతో అనుమానం వచ్చి సోఫియాకు అలెక్స్‌కు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ చేసి ఉంది. అనుమానం వచ్చిన యువకుడు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీ మహేష్‌ భగవత్‌ ఆదేశాలతో, డీసీపీ క్రైమ్స్‌ యాదగిరి, అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, ఏసీపీ హరినాథ్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ వెంకటేష్‌ తన బృందంతో రంగంలోకి దిగారు. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను సేకరించి ఢిల్లీకి చెందిన సైబర్‌ ముఠా ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించి అక్కడకు వెళ్లారు.


అక్రమంగా ఉంటున్న నైజీరియన్‌లు..

నైజీరియాకు చెందిన అక్పల్‌ గాడ్‌ స్టిమ్‌, అడ్జల్‌ గిఫ్ట్‌ ఓసాస్‌, ఎన్‌కేకీ కాన్ఫిడెన్స్‌ డేవిడ్‌, పి. క్రోమ్హ్‌ఓయూబో, ఎహిగియేటర్‌ డానియెల్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా.. నేరచరిత్ర బయటపడింది. వారంతా టూరిస్టు, బిజినెస్‌, మెడికల్‌ వీసాలపై 2019, 2020లో ఢిల్లీకి వచ్చారు. వీసా గడువు ముగిసినా అక్కడే అక్రమంగా ఉంటున్నారు. వారి నుంచి ఐదు మొబైల్‌ ఫోన్స్‌, 5 పాస్‌పోర్టులు, వైఫై రూటర్‌ స్వాధీనం చేసుకున్నారు. 


ఫ్లాట్‌లోనే నైట్‌ క్లబ్‌...

అక్రమంగా దోచుకున్న డబ్బుతో వారుంటున్న అద్దె ఫ్లాట్‌ను నైట్‌ క్లబ్‌గా మార్చేస్తారు. తాగి తందనాలు ఆడుతూ జల్సాలు చేస్తుంటారు. వారు చేస్తున్న జల్సాలకు సంబంధించిన వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారు దోచేసిన డబ్బంతా నైజీరియన్‌ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ ద్వారా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-01-09T06:57:44+05:30 IST