నకిలీ దందా

ABN , First Publish Date - 2021-06-14T04:55:55+05:30 IST

నకిలీ దందాలపై ప్రభుత్వం ఓవైపు కొరడా ఝలిపిస్తుంటే.. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా నకిలీ దందాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నకిలీ దందాలు రైతులను వదలడం లేదు. జిల్లా ప్రతీయేడు ఎంతో మంది మోసపోతూనే ఉన్నారు. విత్తనాలు మొదలు కొని పురుగుల మందుల వరకు

నకిలీ దందా
సాలూర క్యాంప్‌లో పట్టుబడిన నిషేధిత పురుగుల మందులు(ఫైల్‌)

- గుట్టుచప్పుడు కాకుండా నకిలీ విత్తనాలు, పురుగుమందుల వ్యాపారం
- మహారాష్ట్ర సరిహద్దులో నిషేధిత పురుగు మందులు
- టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో వెలుగుచూస్తున్న వైనం
- మొక్కుబడిగా వ్యవసాయశాఖ, పోలీసు శాఖల తనిఖీలు
- జిల్లాలో యేటా మోసపోతున్న రైతులు

బోధన్‌, జూన్‌ 13: నకిలీ దందాలపై ప్రభుత్వం ఓవైపు కొరడా ఝలిపిస్తుంటే.. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా నకిలీ దందాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నకిలీ దందాలు రైతులను వదలడం లేదు. జిల్లా ప్రతీయేడు ఎంతో మంది మోసపోతూనే ఉన్నారు. విత్తనాలు మొదలు కొని పురుగుల మందుల వరకు నకిలీవి మార్కెట్‌లో యథేచ్ఛగా విక్రయా లు సాగుతున్నాయి. నకిలీ విత్తనాలు, పురుగుల మందులు, ఎరువుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ పీడీ యాక్టు కేసులకు ఆదేశాలు ఇస్తుంటే.. నకిలీ దందా నిర్వాహకులు మాత్రం అవేమీపట్టన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిషేధిత పురుగుల మందులు బహి రంగ మార్కెట్‌లో విచ్చలవిడిగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాల పురుగుల మందులను పూర్తిస్థాయిలో నిషేధించి, వాటి అమ్మకాలు చేపట్టకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. క్షేత్ర స్థాయిలో అదెక్కడ అమలు కావడం లేదు. నిషేధిత పురుగుల మందులు బహిరంగ మార్కెట్‌లో అమ్మకాలు సాగుతున్నాయి. మహా రాష్ట్ర సరిహద్దు మండలాల్లో ఈ విక్రయలు విచ్చలవిడిగా మారాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం నకిలీ ఎరువులు, పురుగుల మందు లు, విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయశాఖ, పోలీసుశాఖల సం యుక్త ఆధ్వర్యంలో తనిఖీలు దాడులు చేపడుతున్నా.. ఎక్కడా నిషే ధిత మందుల బాగోతాలు వెలుగుచూడడం లేదు. దీంతో సంబంధి త అధికారుల తనిఖీలు మొక్కుబడిగా మారాయి.  రాష్ట్ర సర్కారు కొన్ని రకాల పురుగుల మందులను పూర్తిస్థాయిలో నిషేధించింది. రౌండ్‌అప్‌లాంటి గడ్డి మందులతోపాటు మరికొన్ని రకాల మందుల ను నిషేధిస్తూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నిషేధిత పురుగుల మందులను వినియోగించడం వల్ల నేలలో సారవంతం తగ్గడంతో పాటు వీటి వల్ల అనేక రకాల దుష్పరిణామాలు చోటుచేసుకునే ఆస్కారం ఉందని గుర్తించి వీటిని నిషేధిత జాబితాలోకి చేర్చారు. తెలంగాణలో వీటి విక్రయాలను పూర్తిగా నిషేదించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినా.. ఈ క్రిమిసంహారక మందుల విక్రయాలు మాత్రం మార్కెట్‌లో యథేచ్ఛగా కొనసాగుతూనే ఉండడం గమనార్హం.
మహారాష్ట్ర నుంచి దిగుమతి
మహారాష్ట్రలో ఈ నిషేధిత మందుల విక్రయాలు కొనసాగుతుండడంతో అక్కడి నుంచి వీటిని పెద్ద ఎత్తున ఇక్కడికి తెప్పించి గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు సాగిస్తున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలోని బోధన్‌, బాన్సువాడ డివిజన్‌లు మహారాష్ట్రకు సరిహద్దునే ఉండడంతో నిషేధిత పురుగుల మందులు విచ్చలవిడిగా ఇక్కడికి చేరుకుంటున్నాయి. బోధన్‌ డివిజన్‌ పరిధిలోని రెంజల్‌, ఎడపల్లి, నవీపేట, కోటగిరి, రుద్రూరు, వర్ని, బాన్సువాడ డివిజన్‌ పరిధిలోని బీర్కూర్‌, నసురుల్లాబాద్‌, బాన్సువాడ, బిచ్కుంద, మద్నూర్‌, నిజాంసాగర్‌, పిట్లం మండలాల్లో ఎరువులు, పురుగుల మందుల దుకాణాలలో నిషేధిత పురుగుల మందులు యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నాయి. ఇందుకు నిదర్శనం బోధన్‌ మండలంలోని సాలూర క్యాంప్‌లో మంగళవారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడిలో పెద్దఎత్తున నిషేధిత పరుగుల మందులు పట్టుబడ్డాయి. సాలూర క్యాంప్‌ గ్రామం మహారాష్ట్రకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో మహారాష్ట్ర నుంచి నిషేధిత పురుగుల మందును తెప్పించి మరీ.. ఇక్కడ విక్రయాలు చేపడుతున్నారు.
జిల్లాలో పలుచోట్ల విక్రయాలు
బోధన్‌, బాన్సువాడ డివిజన్‌ పరిధిలలో నిషేదిత పురుగుల మందులు అన్ని దుకాణాలలో యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నాయి. నిషేధిత పురుగుల మందులకు మార్కెట్‌లో తీవ్ర డిమాండ్‌ ఉండడంతో రైతుల నుంచి వాటి అవసరాల డిమాండ్‌ అధికంగా ఉండడంతో.. పురుగుల మందుల దుకాణదారులు ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన నిషేధిత పురుగుల మందులను గుట్టుచప్పుడు కాకుండా దొడ్డిదారిన తెప్పించి గోదాముల్లో నిల్వ చేసి యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. పురుగులు, ఎరువుల మందుల వ్యాపారుల దుకాణ సముదాయాలు ఒక చోట, గోదాములు మరొకచోట ఉండే పరిస్థితులు ఉండడంతో దుకాణ సముదాయాలలో నిషేధిత క్రిమి సంహారక మందులను నిల్వ చేయకుండా గోదాములలో నిల్వ చేసి విక్రయాలు సాగిస్తున్నారు. అధికారులు షాపులలో తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటుండడంతో వ్యాపారులు సైతం తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు.
అధికారుల తనిఖీలు పైపైనే..
నిషేధిత పురుగుల మందుల అక్రమ దందా సైతం వెలుగు లోకి రావడం లేదు. వ్యవసాయశాఖ, పోలీసు శాఖల తనిఖీలు జరుగుతున్నా.. ఇదంతా పైపైనే కొనసాగుతోంది. ఎక్కడా నకిలీ విత్తనాలు, క్రిమిసంహారక మందులు ఈ అధికారుల బృందా లకు తనిఖీలలో పట్టుబడడం లేదు. కానీ టాస్క్‌ఫోర్సు, విజి లెన్స్‌ పోలీసులు దాడులు చేపడితే మాత్రం పెద్దమొత్తంలో నిషేధిత పురుగుల మందులు, నకిలీ విత్తనాలు పట్టుబడడం  గమనార్హం. వ్యవసాయశాఖ, పోలీసు శాఖలు ఇప్పటికైనా మహారాష్ట్ర సరిహద్దు మండలాల్లోని ఎరువులు, పురుగుల మందుల దుకాణాలపై ప్రత్యేకదృష్టిని పెట్టాల్సి ఉంది. నిషేధిత పురుగుల మందుల విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచాల్సి ఉంది. లేనట్లు అయితే ప్రభుత్వం నిషేధించిన మందులు మార్కెట్‌లో యథేచ్ఛగా విక్రయాలు జరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పట్టే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరిహద్దు మండలాల్లో నిషేధిత క్రిమిసంహారక మందుల విక్ర యాలు జరుగకుండా ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉనా ఇకనైనా పురుగుమందుల వ్యాపారుల గోదాములు, అంతేకాకుండా వారి రహస్య గోదాములపై ప్రత్యేక నిఘా సారించాల్సి అవసరం ఎంతైనా ఉంది. 

Updated Date - 2021-06-14T04:55:55+05:30 IST