రైతు మెడపై నకిలీ క(ప)త్తి

ABN , First Publish Date - 2021-06-12T05:18:42+05:30 IST

వానాకాలం సీజన్‌తో పాటే ఆసిఫాబాద్‌ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల పడగ పరుచుకుంటోంది.

రైతు మెడపై నకిలీ క(ప)త్తి

- భారీగా వెలుగు చూస్తున్న నకిలీ బీటీ-3 విత్తనాలు

- టాస్క్‌ఫోర్స్‌ దాడులతో కదులుతున్న డొంక

- రక్షణ ఇవ్వని విత్తన చట్టం

- నిఘా పెట్టామంటున్న వ్యవసాయశాఖ

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

వానాకాలం సీజన్‌తో పాటే ఆసిఫాబాద్‌ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల పడగ పరుచుకుంటోంది. జిల్లాలో 80శాతం పైగా విస్తీర్ణంలో పత్తిపంట సాగు చేస్తున్న నేపథ్యంలో పత్తి రైతులను నకిలీ వ్యాపారులు బీటీ-3 పేరిట బురిడీ కొట్టిస్తున్నారు. గతేడాది కూడా ఇదే తరహాలో సాగిన చీకటి వ్యాపారం రైతుల నెత్తిన నష్టాల రూపంలో అప్పులను మూటకట్టింది. ఇటు రైతులు కూడా కలుపు నివారిస్తుందన్న ఒకే ఒక అభిప్రాయంతో అనుమతి లేని గ్లైసిల్‌ విత్తనాలు కొనుగోలు చేస్తూ సాగు చేస్తున్నారు. దాంతో ఈ తరహాలో సాగుచేసిన పంట భూముల భూసారం దారుణంగా దెబ్బ తినడంతో పాటు వాతావరణం విషతుల్యంగా మారి ఆరోగ్యంపై పెనుప్రభావం చూపుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ సారి నకిలీ విత్తనాలను నిరోధించేందుకు ఇటు వ్యవసాయ శాఖ అటు పోలీస్‌ యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టినట్టు చెబుతున్నా చీకటి మాటున పత్తి విత్తనాల స్మగ్లింగ్‌, విక్రయాల దందా జోరుగానే సాగుతున్నట్లు తరుచూ వెలుగులోకి వస్తున్న ఘటనలే రుజువు చేస్తున్నాయి. ఇటీవల కాగజ్‌నగర్‌ పోలీసులు జరిపిన దాడుల్లో చింతలమానేపల్లిలో సుమారు 42లక్షల విలువైన 21క్వింటాళ్ల నకిలీ బీటీ-3 విత్తనాలను పట్టుకున్నారు. అలాగే సిర్పూర్‌(టి)లో 4 క్వింటాళ్లు , దహేగాం మండలంలో 4క్వింటాళ్లు, బెజ్జూర్‌లో 3క్వింటాళ్లు చొప్పున మరో 20లక్షల విలువైన విత్తనాలు టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో పట్టుబడ్డాయి. ఇక పోలీసుల కళ్లు కప్పి రైతుల చెంతకు చేరిన విత్తనాల పరిమానానికి లెక్కేలేదు. ఇలా పట్టుబడిన విత్తనాల ద్వారా దాదాపు 35వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగుకు బ్రేక్‌ పడినట్లయంది. ఇక అసిఫాబాద్‌ డివిజన్‌లో బీటీ-3 ఎంత విస్తీర్ణంలో సాగు జరుగుతోందనేది  అంతుచిక్కకుండా ఉంది. ఇక్కడ స్మగ్లర్లు వ్యూహాత్మకంగా మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో స్టాక్‌ పాయింట్లను ఏర్పాటు చేసుకొని రైతుల వారీగా విత్తనాలను విక్ర యిస్తున్నట్లు చెబుతున్నారు. 


స్మగ్లింగ్‌  జరుగుతోందిలా..

నిషేధిత గ్లైసిల్‌ పత్తి విత్తనాలను గుంటూరు, కర్నూలు, సూర్యాపేట, గద్వాల ప్రాంతాలకు చెందిన వ్యాపారులు అత్యంత పకడ్బందీగా వానాకాలానికి రెండు నెలల ముందే వివిధ జిల్లాలకు సరఫరా చేసి ఏజెంట్ల సహాయంతో విక్రయాల తంతు సాగిస్తున్నారు. 

మరీముఖ్యంగా మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న చింతలమానేపల్లి, పెంచికలపేట, బెజ్జూరు, దహెగాం ప్రాంతాల గుండా జిల్లాలోకి నకిలీ విత్తనాలు పెద్దఎత్తున ప్రవేశిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుతం మార్కెట్‌లో బీటీ-1, బీటీ-2 మాత్రమే అందుబాటులో ఉండగా కొత్తగా బీటీ-3 పేరుతో చింతలమానేపల్లి, పెంచికలపేట మండలాల్లో వ్యాపారులు సంచరిస్తూ విత్తనాలు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. బీటీ-3 ఇంకా పరిశోధన దశలోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. విత్తన చట్టం అనుసరించి సెంట్రల్‌ ల్యాబరేటరీ ధ్రువీకరణ, విక్రయాలకు అనుమతి లేకుండా ఎలాంటి సాగు చేయరాదన్న నిబంధన స్పష్టంగా ఉంది. కుమరం భీం జిల్లాలో ఈ ఏడాది 75నుంచి 80వేల హెక్టర్లలో పత్తిపంట సాగు చేయవచ్చని అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం సుమారు 3.50లక్షల ధ్రువీకరించిన పత్తి విత్తనాలను అందుబాటులోకి తెచ్చేందుకు వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. 


రైతుల క్రేజ్‌ను సొమ్ము చేసుకునే యత్నం..

పత్తిపంట సాగులో బీటీ సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టిన తరువాత పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో గడిచిన పదేళ్లుగా రైతాంగం బీటీ విత్తనాల పట్ల మక్కువ చూపుతోంది. ఈ టెక్నాలోజీ అందుబాటులోకి వచ్చిన తరువాత బ్రాండ్లతో నిమిత్తం లేకుండా ఇంచుమించు అన్ని ఒకే రకమైన దిగుబడులు ఇస్తుండడంతో బీటీ విత్తనాలపై రైతుల్లో భారీక్రేజ్‌ ఏర్పడింది. దానిని ఆసరాగా చేసుకుంటున్న చిన్నాచితక కంపెనీలు కూడా బీటీ పరిజ్ఞానాన్ని వినియోగించి విత్తనాలు తయారు చేసినట్లుగా చూపుతూ రైతులకు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. జన్యుపరమైన సంకరం చేసిన బీటీ(బ్యాసిల్లస్‌ తురుంజెనిసిస్‌) టెక్నాలజీ 1999-2000 సంవత్సరంలో మైకో-మోన్‌సాంటో ద్వారా ఇండియాలోకి ప్రవేశించింది. మొదట్లో మైకో విత్తనాలకు భారీ గిరాకీ ఏర్పడడంతో క్రమంగా మోన్‌సాంటో తన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి పరిచి బీటీ-2 పేరుతో సరికొత్త వంగడాలను మార్కెట్‌లోకి తెచ్చి బీటీ-1 పరిజ్ఞానాన్ని చిన్నా చితక కంపెనీలకు కూడా ఇచ్చి ఒప్పందం చేసుకుంది. నాటి నుంచి నేటి వరకు మార్కెట్‌లో బీటీ-1, బీటీ-2 అందుబాటులో ఉండగా తాజాగా గ్లైసిల్‌ బీటీ-3 పేరుతో విత్తనాలను జన్యుపరంగా సంవర్థనం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇది ఇంకా పరిశోధన దశలోనే ఉంది. కానీ దీనిపై రైతుల్లో విస్తృతంగా ప్రచారం జరగడంతో దీనిని ఆసరాగా చేసుకుని నకిలీ ముఠాలు బీటీ-3 పేరుతో రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తుండడం కలకలం సృష్టిస్తోంది.


నకిలీలకు వరంగా మారిన విత్తన చట్టం లొసుగులు..

ఏ యేటికాయేడు నకిలీ విత్తనాలతో నష్టపోతున్న రైతుల జాబితా పెరుగుతూ పోతున్నప్పటికీ ప్రభుత్వాలు నకిలీ విత్తన కంపెనీల నియంత్రణకు ప్రయత్నాలు ప్రారంభించక పోవడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి 1966 విత్తన చట్టం ప్రకారం విత్తన కంపెనీలు కేవలం జన్యుపరమైన స్వచ్ఛత, మొలకెత్తే శాతానికి మాత్రమే హామీ ఇస్తున్నాయి. ఆ తరువాత పూత, కాత దశ వరకు వచ్చే సరికి విత్తన కంపెనీలకు సంబంధం లేకుండా ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తుండడంతో నకిలీ కంపెనీలకు ఈ లొసుగు వరంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా పత్తి పంటలో నకిలీల బెడద అధికంగా ఉండడంతో 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కాటన్‌ సీడ్‌ యాక్ట్‌-2007 పేరుతో తెచ్చిన చట్టం కూడా రైతులకు కేవలం ధరల నియంత్రణకు మాత్రమే పనికొస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విత్తనాలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల పట్టిక ఇలా ఉంది.


విత్తనం మొలకెత్తే శాతం జన్యుస్వచ్ఛత శాతం

పత్తి (హైబ్రిడ్‌)         75 98

పత్తి(సాదారణ) 65 98

వరి         80 98

జొన్న(సాదారణ) 75 98

జొన్న(హైబ్రిడ్‌)         75 98

మొక్క జొన్న(హై) 90 98

మొక్కజొన్న(ఒక్కసారి సంకరం చేసినవి)80 98

సజ్జ(హైబ్రిడ్‌)         75 98

కందులు 75 98

పెసర         75 98

మినుములు         75 98

శనగ         85 98

ఆముదం 70 98

పొద్దు తిరుగుడు 70 98

సోయాబీన్‌         70 98

జనుము 80 97

బెండ         65 99

వంకాయ 70 98

టమాట 70 98

క్యాప్సికం 60 98

బఠానీ         70 98

సోరకాయ         60 98

పుచ్చ         60 98


రశీదు లేకుండా కొనుగోలు చేయవద్దు..

- శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయాధికారి, కుమరం భీం

జిల్లాలో పత్తి విత్తనాల పేరిట నకిలీ విత్తనాలు అంటగట్టే దళారులు ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ అనుమతి పొందిన విత్తన దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి. కొనుగోలు సందర్భంగా విత్తన ప్యాకెట్లపై బ్యాచ్‌ నంబర్‌, కంపెనీ, తదితర వివరాలు కలిగిన రశీదును తప్పని సరిగా తీసుకోవాలి. జిల్లాలో అక్కడక్కడ అనుమతి లేని కంపెనీలు ఫీల్డ్‌ ట్రయల్స్‌ పేరిట రైతులకు అంటగట్టే ప్రయత్నం చేయవచ్చు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండి సమాచారం ఇవ్వాలి. అలాంటి వారిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకునే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటివరకు అయిదు నకిలీ విత్తన కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-06-12T05:18:42+05:30 IST