Abn logo
Aug 3 2021 @ 00:20AM

వలసకు సిద్ధం..బతుకొక యుద్ధం!

గుజరాత్‌లో అరేబియా సముద్రంలో చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులు

మత్స్యకారులకు తప్పని వలస బతుకులు

నెలల తరబడి కుటుంబాలకు దూరం

పూర్తికాని కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ

అయినా వలసలకు సన్నద్ధం


(ఎచ్చెర్ల): సుదీర్ఘ తీర ప్రాంతం జిల్లా సొంతం. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి రణస్థలం మండలం దోనిపేట వరకూ 193 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. 104 మత్స్యకార గ్రామాల్లో లక్షకుపైగా జనాభా ఉండగా.. 6,211 మంది వేటకు వెళ్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అపారమైన మత్స్య సంపద ఉన్నా..జెట్టీలు, హార్బర్లు లేక మత్స్యకారులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. స్థానికంగా గిట్టుబాటుకాక సుదూర ప్రాంతాలకు ‘ఉపాధి’ బాట పడుతున్నారు. ఏటా ఆగస్టులో వెళ్లి.. మార్చిలో స్వగ్రామాలకు చేరుతారు. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టకున్నా, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తికాకున్నా... ప్రత్యామ్నాయ ఉపాధి లేక గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. 


ఏటా ఆగస్టు, మార్చి నెలల మధ్య మత్స్యకార గ్రామాలు ఖాళీగా దర్శనమిస్తాయి. కేవలం వృద్ధులు, చిన్నారులు, మహిళలతోనే కనిపిస్తాయి. యువకుల జాడ అసలు ఉండదు. నడి వయస్కులు మాత్రం సంప్రదాయ పడవలతో వేటకు వెళ్తుంటారు. గ్రామాల్లో జన సమ్మర్థం అసలు ఉండదు. ఎవరిని కదిలించినా కుటుంబాలతో పడే బాధలు వర్ణిస్తారు. ప్రస్తుతం వలస సమయం రావడంతో..సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు మత్స్యకార యువకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాలో ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం రూరల్‌, ఎచ్చెర్ల, రణస్థలంలో వందలాది తీర గ్రామాలు ఉన్నాయి. ఏటా ఈ గ్రామాల నుంచి గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు మత్స్యకారులు వలస వెళ్తారు. ఎక్కువ మంది గుజరాత్‌ వెళ్లేందుకే ఆసక్తి చూపుతారు. ఏటా ఆగస్టు మొదటి వారంలో ఇక్కడి నుంచి పయనమవుతారు. ఈ ఏడాది కూడా వలసకు సిద్ధమవుతున్నారు. కరోనా పరిస్థితులు ఇంకా కుదుటపడకపోయినా.. బతుకు తెరువు కోసం తప్పడం లేదని చెబుతున్నారు.


ఒప్పందం ప్రకారమే

బోటు యజమానులతో ముందుగా ఒప్పందం కుదుర్చుకొని మత్స్యకారులు ఇక్కడి నుంచి బయలుదేరుతారు. సుమారు ఏడెనిమిది నెలలు కుటుంబానికి దూరంగా ఉండేందుకు మానసికంగా సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇందులో బోటు డ్రైవర్‌ పాత్ర చాలా కీలకం.  ఒక్కో బోటులో 7 నుంచి 9 మంది వరకూ వేటకు వెళ్తుంటారు. సీజన్‌కు  రూ.ఐదు లక్షల నుంచి రూ.ఆరు లక్షల వరకు చెల్లించేందుకు బోటు డ్రైవర్‌తో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇందులో డైవ్రర్‌ (గుజరాత్‌లో తండేలు అంటారు) అసిస్టెంట్‌ డ్రైవర్‌, కలాసీలు, వంట మనిషి (బండారి) ఉంటారు. మత్స్యకారులు స్వగ్రామంలో బయలుదేరినప్పుడే ముందుగా కొంత అడ్వాన్స్‌ చెల్లిస్తారు. సీనియర్‌ డ్రైవర్‌కు నెలకు రూ.20  వేల నుంచి రూ.25 వేలు, అసిస్టెంట్‌ డ్రైవర్‌కు రూ.10 వేల నుంచి రూ.12 వేలు, కలాసీ, వంట మనుషులకు రూ.8 వేల వంతున చెల్లిస్తారు. ఆశించిన స్థాయిలో చేపల వేట జరిగితేనే ఒప్పందం ప్రకారం నగదు చెల్లిస్తారు. లేదంటే ఒప్పందాన్ని కూడా లెక్కచేయరు. 


ఎన్ని సమస్యలో...

గుజరాత్‌లో అరేబియా సముద్రంలో బోటుపై ఒకసారి బయలుదేరితే 20 నుంచి 25 రోజుల వరకు చేపల వేట సాగిస్తారు. బోటులో ఉన్నన్ని రోజులు స్నానం ఉండదు. దీని వల్ల చర్మవ్యాధులు సంక్రమిస్తాయి.  బోటులో ఉండగా జబ్బుపడితే సరైన మందులు కూడా లభించవు. పొరపాటున బోట్లు ఢీకొన్నట్టయితే గాయాలపాలైనా మందులు ఉండవు. ఒడ్డుకు చేరిన తర్వాత కూడా ఒకటి రెండు రోజులు బయట ఉన్నా... బోటులోనే విశ్రాంతి తీసుకోవాలి. ప్రత్యేకించి వీరికి విశ్రాంతి గదులు ఉండవు. ఎన్ని కష్టాలకు గురైనా చేపల వేట నుంచి ఒడ్డుకు చేరుకోలేరు. సముద్రంలో ఉండగా కొద్ది దూరం మాత్రమే మొబైల్‌ నెట్‌ వర్క్‌ ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా వైర్‌లెస్‌పై ఆధారపడాలి.


పొరపాటున సరిహద్దు దాటితే...

గుజరాత్‌లో అరేబియా సముద్రంలో చేపల వేట సాగించే క్రమంలో పొరపాటున సరిహద్దు దాటితే పాక్‌ కోస్ట్‌గార్డులకు చిక్కే ప్రమాదం ఉంది. 2018లో ఈ ప్రాంతానికి చెందిన 21 మంది మత్స్యకారులు పాక్‌కోస్ట్‌ గార్డులకు చిక్కారు. వీరంతా 14 నెలల పాటు పాక్‌బందీలుగా ఉండి 2020 జనవరి నెలలో విడుదలయ్యారు. ఇలాంటి సంఘటనలు అంతకుమునుపు కూడా జరిగాయి. ఇన్ని ఇబ్బందులున్నా వలసపోవడం మాత్రం తప్పడంలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 


సరైన సదుపాయాలు లేకనే

జిల్లాలో చేపల వేటకు సరైన సదుపాయాలు లేవు. చేపల వేటకు మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం పంచాయతీ రాళ్లపేట వద్ద జెట్టీ నిర్మిస్తామని నాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రాజీవ్‌ పల్లెబాటలో హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతిపాదన దశ దాటలేదు. అలాగే టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించేందుకు ప్రతిపాదన వచ్చింది. కేంద్ర కమిటీ కూడా పర్యటించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బుడగట్లపాలెంలో గ్రామసభ  నిర్వహించి ప్రజల అంగీకారం తీసుకున్నారు. ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంపై సీఎం హామీ ఇచ్చారు. అయినా ఇప్పటికీ ఎటువంటి కదలిక లేదు. 


ఇబ్బందిగా ఉంది 

కొన్నేళ్లుగా జిల్లా నుంచి వేలాది మంది మత్స్యకారులు గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాలకు వలసపోతున్నారు. ప్రతి ఏటా ఆగస్టులో ఇక్కడి నుంచి బయలుదేరిన మత్స్యకారులు తిరిగి ఏప్రిల్‌ నెలలో స్వగ్రామాలకు చేరుకుంటారు. సుమారు 8 నెలల పాటు ఈ ప్రాంత మత్స్యకారులు ఇతర ప్రాంతాల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. 

-మూగి శ్రీరాములు, మాజీ సర్పంచ్‌, డి.మత్స్యలేశం, ఎచ్చెర్ల మండలం 


వలసలు తప్పడం లేదు 

సుమారు పదేళ్లుగా గుజరాత్‌కు వలసపోతున్నాను. అక్కడ బోటు డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. నెలకు రూ.20 వేల వరకు జీతం వస్తుంది. ఈ ప్రాంతంలో జెట్టీలు, ఫిషింగ్‌ హార్బర్‌లు నిర్మిస్తే ఇతర ప్రాంతాలకు వలసలను నివారించవచ్చు. మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. 

-దుమ్ము అప్పన్న, మత్స్యకారుడు, డి.మత్స్యలేశం, ఎచ్చెర్ల మండలం

TAGS: SRIKAKULAM