ఈ ఫంగస్‌తో జరభద్రం.. కంటిచూపును కోల్పోయే ప్రమాదం

ABN , First Publish Date - 2021-06-07T18:33:19+05:30 IST

ఒకవైపు కరోనా వైరస్‌.. మరోవైపు..

ఈ ఫంగస్‌తో జరభద్రం.. కంటిచూపును కోల్పోయే ప్రమాదం

  • సకాలంలో గుర్తించకపోతే ముప్పు
  • రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపైనే ప్రభావం ఎక్కువ
  • ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ 
  • రెటీనా స్పెషలిస్టు డాక్టర్‌ వివేక్‌ ప్రవీణ్‌ దావే


హైదరాబాద్‌ సిటీ : ఒకవైపు కరోనా వైరస్‌.. మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ జనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎంతోమంది బ్లాక్‌ ఫంగ్‌సతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వైట్‌ ఫంగస్‌, ఎల్లో ఫంగ్‌సల ముప్పు కూడా పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైట్‌ ఫంగ్‌సను ముందే గుర్తిస్తే ప్రమాదం నుంచి బయట పడొచ్చని, ఏ మాత్రం నిర్లక్ష్యం చేపినా ముప్పు తప్పదని అంటున్నారు. ఇప్పుడు బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారిలో, వైట్‌ ఫంగస్‌ కూడా బయటపడుతోంది. అయితే వైట్‌ ఫంగ్‌సతో భయపడాల్సిందేమీ లేదని ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ రెటీనా స్పెషలిస్టు డాక్టర్‌ వివేక్‌ ప్రవీణ్‌ దావే అన్నారు. దాని లక్షణాలు, తీవ్రత, కంటిలోని ఏ భాగాలు ప్రభావితమవుతాయనే వివరాలు ఆయన మాటల్లోనే..  


వైట్‌ ఫంగస్‌ అంటే..

వైట్‌ ఫంగస్‌ శాస్త్రీయ నామం కాండిడా అల్బికాన్సీ. ఇది ఒక రకమైన ఫంగస్‌. శరీరం బయట, లోపల ఎక్కడైనా తిష్ట వేయగలదు. దీని తీవ్రత పెరిగితే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీన్ని పరీక్షించిన సమయంలో తెలుపు రంగులో కనిపించడం వల్ల ‘వైట్‌ ఫంగస్‌’ అనే పేరొచ్చింది. ఇది శరీరంలోని ఏ భాగంపై అయినా దాడి చేసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కనుపాపలోని పలు భాగాలను ప్రభావితం చేస్తుంది. బ్లాక్‌ ఫంగస్‌ వల్ల కంటి చుట్టూ ఉండే కణజాలం, ముక్కులోని సైన్‌సపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే వైట్‌ ఫంగస్‌ అందుకు భిన్నంగా కంటి లోపలి కణజాలాన్ని ముఖ్యంగా విట్రస్‌ జల్‌, రెటీనాను దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితుల్లో సకాలంలో చికిత్స అందించకపోతే దృష్టిలోపం ఏర్పడుతుంది. శరీరం మొత్తానికి వ్యాపించినప్పుడు ప్రాణాంతకమవుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలోనే వైట్‌ ఫంగస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొవిడ్‌ నుంచి కోలుకున్న రోగుల్లో వైట్‌ ఫంగస్‌, బ్లాక్‌ ఫంగ్‌సను పోల్చడానికి సరైన గణాంకాలు అందుబాటులో లేవు. వైట్‌ ఫంగస్‌ కేసులు చాలా అరుదుగా ఉంటాయి.


ఇదీ పరిస్థితి..

కొవిడ్‌ నుంచి కోలుకున్న వారికి వైట్‌ ఫంగస్‌ సోకితే.. 1 నుంచి 3నెలల్లో కంటిచూపు మందగించే అవకాశాలు ఉంటాయి. ఇది కంటిలోని రెటీనాపై ప్రభావం చూపడంతో సెంట్రల్‌ విజన్‌కు ఎక్కువనష్టం వాటిల్లుతుంది. కంటి ముందు నల్లని నీడ తేలియాడుతున్నట్లు ఉంటుంది. ఫలితంగా కంటిచూపునకు నష్టం వాటిల్లుతుంది. కొందరు బాధితుల్లో.. నొప్పితో కన్ను ఎర్రగా మారుతుంది. కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ ఉన్న సమయంలో కానీ, కోలుకున్న తర్వాత కానీ ఇబ్బందులు ఏర్పడొచ్చు. కోమార్బిడిటీస్‌ (దీర్ఘకాలిక జబ్బులు) ఉన్నట్లయితే నియంత్రణ లేని మధుమేహం వల్ల కంటిచూపు తీవ్రంగా ప్రభావితం కావచ్చు. బ్లాక్‌ ఫంగస్‌లా కాకుండా వైట్‌ఫంగస్‌ ప్రభావం కనుపాప లోపలి భాగానికి పరిమితమవుతుంది. 


6 నుంచి 8 వారాల్లోగా జ్వరం..

వైట్‌ ఫంగస్‌ సోకితే.. కొవిడ్‌ పాజిటివ్‌గా ఉన్న సమయంలో లేదా కోలుకున్న తర్వాత 6 నుంచి 8 వారాల్లోగా జ్వరం రావచ్చు. అంతకుముందు కొవిడ్‌ చికిత్సలో భాగంగా వినియోగించిన స్టెరాయిడ్ల వల్ల రోగనిరోధక శక్తి సన్నగిల్లుతుంది. మధుమేహం, సిస్టమిక్‌ ఇమ్యూనో సప్రెషన్‌, ఇతర దీర్థకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, స్టెరాయిడ్లను విచ్చలవిడిగా వినియోగించే వారు వైట్‌ ఫంగస్‌ బారినపడే అవకాశాలు ఎక్కువ. దీన్ని చికిత్సలో భాగంగా కంట్లోకి యాంటీ ఫంగల్‌ ఇంజెక్షన్లు, నోటి ద్వారా యాంటీ ఫంగల్‌ ఏజెంట్లను అందించాలి. అవసరమైన సమయంలో కంటిలోపలి భాగాలకు 4 నుంచి 6 వారాల్లోగా సర్జరీ చేయాలి. ఈక్రమంలో రోగుల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలి. రోగ నిరోధక శక్తిని పెంచడంపై దృష్టిపెట్టాలి.

Updated Date - 2021-06-07T18:33:19+05:30 IST