కోరలు చాస్తున్న బర్డ్‌ఫ్లూ

ABN , First Publish Date - 2021-01-09T07:41:05+05:30 IST

బర్డ్‌ఫ్లూ వైరస్‌ కోరల్లో ఇప్పటికి ఆరు రాష్ట్రాలు చిక్కుకున్నాయని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. దీని నుంచి బయట

కోరలు చాస్తున్న బర్డ్‌ఫ్లూ

  • వైరస్‌ బారిన 6 రాష్ట్రాలు: కేంద్రం
  • ఐదు రాష్ట్రాల్లో హై అలర్ట్‌
  • హరియాణాలో 1.60లక్షల కోళ్ల వధ!
  • ఢిల్లీలో 25% తగ్గిన చికెన్‌ అమ్మకాలు
  • తెలంగాణ కాస్త సురక్షితం
  • మెదక్‌ జిల్లాలో ఐదు నెమళ్ల మృతి

 

న్యూఢిల్లీ, (ఆంధ్రజ్యోతి)/ పాపన్నపేట, జనవరి 8: బర్డ్‌ఫ్లూ వైరస్‌ కోరల్లో ఇప్పటికి ఆరు రాష్ట్రాలు చిక్కుకున్నాయని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. దీని నుంచి బయట పడడానికి వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా, గుజరాత్‌లకు సూచించింది. పౌలీ్ట్ర రైతులతోపాటు అందరూ తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని.. కోడి మాంసం, గుడ్లు వాడకంపై వదంతులు వ్యాపించకుండా చూడాలని అన్ని రాష్ట్రాలనూ కోరింది.


ఢిల్లీలోని డీడీఏ పార్క్‌ హాస్త్‌సాల్‌, ద్వారకా, మయూర్‌ విహార్‌ ఫేజ్‌-3 ప్రాంతాల్లో 50కిపైగా పక్షులు మరణించాయని, వాటిలో ఎక్కువగా కాకులే ఉన్నాయని అధికారులు తెలపారు. వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపించామన్నారు. ఢిల్లీలో చికెన్‌ కొనుగోలు 20-25శాతం తగ్గిందని తెలిపారు. ఛత్తీ్‌సగఢ్‌లోని బలోద్‌ జిల్లాలో చనిపోయిన 4కాకుల నమూనాలకు వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు.


హిమాచల్‌ప్రదేశ్‌లోని పోగ్‌ డ్యాం పరిసరాల్లో వైరస్‌ సోకి ఇప్పటి వరకూ 3,400 వలస పక్షులు మృత్యువాత పడ్డాయి. కేరళలో కోళ్లు, బాతులతోసహా వేలాది పక్షుల వధ కొనసాగుతోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. హరియాణాలోని పంచకుల పరిసరాల్లో కోళ్లఫాంలలో గత కొద్దిరోజులుగా 4లక్షల కోళ్లు చనిపోయాయని ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి జేపీ దలాల్‌ ప్రకటించారు.


వైరస్‌ సోకినట్లు భావిస్తున్న మరో 1.66లక్షలకుపైగా కోళ్లను వధించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. రాజస్థాన్‌లోని 11 జిల్లాలకు బర్డ్‌ఫ్లూ వ్యాపించింది. ఇప్పటి వరకూ 223 కాకులు, 11 నెమళ్లు, 55 పావురాలతోసహా 2,166 పక్షులు మృత్యువాత పడ్డాయి. తెలంగాణలో పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. ఇక్కడ బాతుల సంఖ్య అత్యంత తక్కువ కావడమే దీనికి కారణమని పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ వి.లక్ష్మారెడ్డి చెప్పారు. పైగా మాంసాన్ని ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ దిగుమతి చేసుకోదు.


అయితే, 2015లో బర్డ్‌ఫ్లూ వల్ల లక్షలాది పక్షులను వధించాల్సి వచ్చింది. ఆ  అనుభవం దృష్ట్యా అన్ని పౌలీ్ట్ర ఫాంలలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించామని లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రాథమికంగా బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేకుంటే హైదరాబాద్‌ ల్యాబ్‌కు, ఒకవేళ లక్షణాలు ఉంటే భోపాల్‌ ల్యాబ్‌కు మృతి చెందిన పక్షుల నమూనాలను పంపిస్తామని చెప్పారు.


ఈనేపథ్యంలో హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. డిప్యూటీ డైరెక్టర్‌ డా.ఎంఏ హకీం నేతృత్వంలో రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ టీంను నియమించామని జూ డైరెక్టర్‌ ఎన్‌.క్షితిజ తెలిపారు. మెదక్‌ జిల్లా పాపన్నపేట శివారు అటవీ ప్రాంతంలో ఐదు నెమళ్లు మత్యువాత పడ్డాయి. కుళ్లిన స్థితిలో ఉన్న వాటి మృతకళేబరాలు పశువుల కాపరి గుర్తించడంతో విషయం వెలుగు చూసింది. దీంతో స్థానికంగా బర్డ్‌ఫ్లూ కలకలం మొదలైంది.


కానీ, స్థానిక పశు సంవర్థక అధికారి మాత్రం అజీర్ణంతో చనిపోయి ఉండొచ్చని చెబుతున్నారు. వెంకటేశ్వర గుట్ట ప్రాంతంలో చనిపోయి.. కుళ్లిన స్థితిలో  ఉన్న నెమళ్లను గుర్తించిన పశువుల కాపరి.. ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. 


Updated Date - 2021-01-09T07:41:05+05:30 IST